బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు ఓ నెటిజన్ వింత ప్రశ్న ఎదురైంది. 'సర్.. మీరెప్పుడైనా దేశ ప్రధాని కావాలి అనుకున్నారా?' అని అడగ్గా... బదులుగా బిగ్‌బి నవ్వుతూ సమాధానమిచ్చారు. 'అరే బాబు.. పొద్దుపొద్దున్నా కాస్త పాజిటివ్‌గా ఉండు, మాట్లాడు' అని పగలబడి నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశారు. బిగ్‌బి సరదాగా మాట్లాడిన తీరు నెటిజన్లను నవ్వించింది.
లాక్‌డౌన్ నేపథ్యంలో షూటింగ్‌లు నిలిచిపోవడం వల్ల ఇంట్లోనే ఉన్నారు అమితాబ్. సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటూ కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. తన గ్యాలరీలోని పాత ఫొటోలను షేర్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన తన తొలి ఫొటోషూట్ స్టిల్‌ను పంచుకున్నారు. '1969లో చిత్ర పరిశ్రమకు పరిచయమైన తర్వాత ఫిల్మ్ మ్యాగజైన్ కోసం నా మొట్టమొదటి ఫొటోషూట్. ఆ మ్యాగజైన్ పేరు 'స్టార్ అండ్ స్టైల్'. అప్పట్లో 'ఫిల్మ్‌ఫేర్'తోపాటు నడుస్తున్న గొప్ప మ్యాగజైన్ అది. షూట్‌లో కాస్త ఇబ్బందిపడ్డా. అప్పటి ప్రముఖ జర్నలిస్టు దేవయాని నాతో మాట్లాడేందుకు వచ్చారు. నిజానికి ఈ ప్రాజెక్టులో స్టార్, స్టైల్ రెండూ లేవు. కానీ ఎప్పుడూ తెల్ల చీరలో కనిపించే శక్తిమంతమైన మహిళ దేవయాని మాత్రం నమ్మకంగా ఉన్నారు' అంటూ అప్పటి విషయాల్ని పంచుకున్నారు.
ఇదీ చూడండి : దర్శకధీరుడు రాజమౌళి తర్వాతి సినిమా మహేశ్‌తో