అమల అక్కినేని, టాలీవుడ్ కింగ్ నాగార్జున మనసు దోచుకున్న అందాల భామ. నాగ్, అమలలది టాలీవుడ్లో ఓ అందమైన జంట. వివాహానికి ముందు సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా.. ఆ తరువాత వాటికి దూరమయ్యారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ తెరపై మెరిశారు.
నేపథ్యం
అమల అక్కినేని జన్మస్థలం కోల్‌కతా. 1968, సెప్టెంబర్ 12న జన్మించారు. తండ్రి భారతీయుడు, తల్లి ఐరిష్ దేశస్తురాలు. చెన్నై కళాక్షేత్ర కళాశాల నుంచి భరత నాట్యంలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు అమల. ప్రసిద్ధ కళాకారిణి రుక్మిణి దేవి ఆరెండల్ ఈ సంస్థని స్థాపించారు. 13 సంవత్సరాల వయసు నుంచే రుక్మిణి దేవి బృందంలో ప్రదర్శనలు ఇస్తూ దేశవిదేశాలు పర్యటించారు అమల.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మొదటి సినిమా అవకాశం
అలా ప్రదర్శనలు ఇస్తున్న సమయంలో ప్రముఖ నటుడు, దర్శకుడు టి.రాజేందర్ సినిమాలో అవకాశం వచ్చింది. ప్రేమకథల్ని రసరమ్యంగా తెరకెక్కించగల సత్తా ఉన్న సృజనాత్మక దర్శకుడు తన చిత్రంలో క్లాసికల్ డాన్సర్ పాత్ర కోసం అమలను సంప్రదించారు. గ్రాడ్యుయేషన్ అప్పుడే పూర్తైన సంవత్సరంలో ఆ అవకాశం వచ్చిన కారణంగా సినిమా పరిశ్రమ ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తి కలిగిందట అమలకు. అందువల్ల ఆ అవకాశాన్ని చేజార్చుకోలేదు. అంతేకాదు పూర్తి స్థాయి నాట్యకారిణి పాత్ర చేయడం కూడా తనకు సౌకర్యవంతంగా ఉందని ఒకానొక సందర్భంలో చెప్పారు. ఒక నర్తకిగా ప్రదర్శనలు ఇవ్వడం కంటే సినిమాలో నటించడం బాగుందని ఆమె పేర్కొన్నారు.
54 చిత్రాల విజయవంతమైన సినీ ప్రయాణం
అమల మొత్తం 54 సినిమాల్లో నటించారు. టి.రాజేందర్ సినిమా 'మైథిలీ ఎన్నై కాథలి'తో ఎంట్రీ ఇచ్చిన ఆమె అనతికాలంలోనే డార్లింగ్ ఆఫ్ ఇండస్ట్రీగా మారిపోయారు. వరుస సినిమాలు చేస్తూ విజయాలు సాధిస్తూ ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషా చిత్రాల్లో అమలకు ఎన్నో అవకాశాలు వచ్చాయి.
హాస్టల్లో పెరగడం
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తండ్రి నేవీ అధికారిగా పనిచేస్తూ ఉండడం, తల్లి ఐర్లాండ్‌లో ఉండడం వల్ల అమల హాస్టల్లో పెరిగారు. అమల స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వారు. సినిమాల్లోకి రావాలన్న నిర్ణయం కూడా ఇలాంటిదే. అమల నిర్ణయాన్ని తల్లిదండ్రులు గౌరవించారు.
సినిమాలోనే అమలకు నాగ్ ప్రపోజ్
అప్పుడప్పుడే తెలుగు చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న అమలని అక్కినేని వారసుడు నాగార్జున అభిమానించారు. 'నిర్ణయం' సినిమాలో వీరిద్దరి లవ్ ట్రాక్‌కి నిదర్శనమా అన్నట్లు.. 'హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం... ప్రేమించాను దీన్నే... కాదంటోంది నన్నే..' అన్న పాట అప్పట్లో అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. 'గొప్ప ఇంటి కుర్రవాణ్ణి....అక్కినేని అంతటోన్ని... కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా?' అంటూ సినిమాలోనే నాగార్జున ప్రపోజ్ చేశారు.
మొదట ఎవరు ప్రేమించారంటే..
నాగార్జున.. అమలకి మొదటగా ప్రపోజ్ చేశారు. 'నిర్ణయం' సినిమా తరువాత నాగ్ ప్రేమిస్తునానని చెప్పడం ఎంతో ఆశ్చర్యం కలిగించిందని అమల ఓ సందర్భంలో తెలిపారు. తామిద్దరం పరిణతి చెందిన వారం కాబట్టి తమ పెళ్లికి ఎటువంటి ఆటంకాలు ఎదురుకాలేదని చెప్పారు. అక్కినేని నాగార్జున, అమల వివాహం 1992లో జరిగింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బ్లూ క్రాస్ వ్యవస్థాపకురాలు
వివాహం జరిగి హైదరాబాద్‌కు వచ్చిన రెండవ రోజే ఓ ట్రక్ వల్ల జంతువుకు యాక్సిడెంట్ అవడాన్ని చూసింది అమల. ఆ జంతువుని వెంటనే ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చారు. హైదరాబాద్‌లో జంతు సంరక్షణ కేంద్రాలు అప్పట్లో లేవు. దాంతో, ఇంట్లోనే గాయపడిన జంతువులను పెట్టుకునేవారు. అలా, 50, 60 గాయపడిన జంతువులను తన ఇంట్లోనే సంరక్షించేవారు. మంగూస్, కుందేళ్లు, కుక్కపిల్లలు, పిల్లిపిల్లలు, గద్దలు, పావురాలు వంటి జంతువులకు షెల్టర్ ఇచ్చారు. అప్పుడు అమలతో ఇల్లు జూ లా అయిపోయిందని నాగ్ అన్నారట. నాగ్ సలహాతోనే జంతువులను సంరక్షించే విషయంలో చెన్నైలో ఉన్న బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియా వారి సాయంతో శిక్షణ పొందారు. ఆ తర్వాత బ్లూ క్రాస్ స్థాపించి.. 4 లక్షల 50 వేల జంతువులను తన ఒడిలోకి చేర్చుకున్నారు. ఆరు వందలకు పైగా వాలంటీర్లు, శ్రేయోభిలాషులు ప్రస్తుతం ఈ సొసైటీలో ఉన్నారు. గాయపడిన జంతువులకు సహాయం చేస్తూ ఉంటే ఎంతో సంతృప్తిగా ఉంటుందని అమల చెబుతూ ఉంటారు.
ఫిట్నెస్ అంటే ప్రాణం
యోగ, నడక, వ్యాయామాలు చేయడం అమలకు చాలా ఇష్టం. శాకహార భోజనమే చేస్తారు. స్వీట్ల జోలికి వెళ్లరు. ఇంట్లోనే ట్రైనర్ పర్యవేక్షణలో జిమ్ చేస్తారు.
నాగ్‌తో సినిమాలు
నాగార్జున, అమల హీరోహీరోయిన్లుగా 'కిరాయి దాదా', 'చినబాబు', 'శివ', 'ప్రేమ యుద్ధం', 'నిర్ణయం', సినిమాలు వచ్చాయి . తెలుగులో అమల నటించిన సినిమాల్లో 'పుష్పక విమానం', 'రక్త తిలకం', 'రాజా విక్రమార్క', 'అగ్గిరాముడు', 'ఆగ్రహం' ఉన్నాయి. ఇవన్నీ అమల సినీ కెరీర్లో మెచ్చు తునకలు.
రీ ఎంట్రీ
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు అమల. 'కేర్ ఆఫ్ సైరాభాను' చిత్రంతో 25 సంవత్సరాల తరువాత మలయాళ సినిమాలో నటించారు. 'మనం' చిత్రంలో డాన్స్ టీచర్‌గా ఓ చిన్న పాత్రలో మెరిశారు.
పురస్కారాలు
1991లో ఓ మలయాళ సినిమాకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు అమల. 2012లో తెలుగులో తెరకెక్కిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంలో ఆమె పాత్రకి ఉత్తమ సహాయ నటి కేటగిరీలో ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. ఇదే చిత్రానికి ఉత్తమ అవుట్ స్టాండింగ్ యాక్ట్రెస్‌గా అవార్డును అందుకున్నారు.