యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నెపోటిజమ్ అంశమై నెటిజన్స్ అంతెత్తున ఎగిరిపడుతున్నారు. బంధుప్రీతి కారణంగానే సుశాంత్ చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓటీటీలో విడుదలైన 'సడక్-2'పైనా ఈ ప్రభావం తీవ్రంగా పడింది. ఇందులోని నటీనటులే లక్ష్యంగా, తమ కోపాన్ని చూపిస్తున్నారు.
'సడక్-2' సినిమా ట్రైలర్‌ను యూట్యూబ్‌లో ఉంచిన నిమిషాల్లోనే విపరీతంగా డిస్లైక్ చేయడం ప్రారంభమైంది. ఇప్పటివరకూ ఏ చిత్రానికి రాని విధంగా కోటి 20 లక్షలకుపైగా డిస్‌లైక్స్ వచ్చాయి. దీనంతటికీ నెపోటిజమ్ ప్రధాన కారణమని అభిమానులు, కామెంట్స్‌లో పేర్కొంటున్నారు.
ఈ చిత్ర ట్రైలర్‌ను డిస్లైక్ చేయటానికే ఏకంగా 10 గూగుల్ ఎకౌంట్లను కొత్తగా క్రియేట్ చేసుకున్నట్లు ఓ నెటిజన్ పేర్కొన్నారు. కొందరు చూసి డిస్లైక్ కొడుతుంటే, మరికొందరు చూడకుండానే డిస్‌లైక్స్ కొడుతున్నారు. ట్రైలర్‌కు లైక్ కొట్టిందనే కారణంగా ఏకంగా తన ప్రేయసినే వదిలేసినట్లు ఓ వ్యక్తి పేర్కొనడం, ఏ స్థాయిలో నెపోటిజాన్ని వ్యతిరేకిస్తున్నారో స్పష్టం చేస్తోంది.
విపరీతమైన ట్రోలింగ్‌ల మధ్య ఆగస్టు 28న OTT వేదికగా 'సడక్-2' విడుదలైంది. అయితే చరిత్రలోనే అత్యంత తక్కువ రేటింగ్ వచ్చిన సినిమాగా ఇది నిలిచింది. ఐఎమ్‌డీబీలో ఎన్నడు లేనంత తక్కువగా దీనికి 1.1 రేటింగ్ వచ్చింది.
ప్రస్తుతం 'సడక్-2' మాత్రమే పరిమితమైన నెటిజన్ల ఆక్రోశం.. భవిష్యత్‌లో మరిన్నీ సినిమాలపైనా కన్పిస్తుందేమోనని విశ్లేషకులు భయపడుతున్నారు. ఇలానే ఉంటే నిర్మాతలు, నటులు, చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.