ఒకరు అపరిమిత హాస్యంతో తన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ టాప్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్నారు. మరొకరు కథాబలమున్న చిత్రాలతో, తన విలక్షణమైన నటనతో ఆడియన్స్‌ను ఎంతగానో అలరిస్తున్నారు. వారిద్దరూ తమ తమ పంథాలలో దూసుకుపోతూ తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని అందిస్తున్నారు. వారే డైరెక్టర్ అనిల్ రావిపూడి, నటుడు శ్రీవిష్ణు. వీరిద్దరూ ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి తమ కెరీర్ విశేషాలను పంచుకున్నారు.
'గాలి సంపత్' ఎన్నో సినిమా?
అనిల్: 'గాలి సంపత్' కేవలం నేను స్క్రీన్‌ప్లే, మాటలు మాత్రమే ఇచ్చా. దర్శకత్వ పర్యవేక్షణ చేశా. ఇది నేను డైరెక్ట్ చేసిన సినిమాల జాబితాలోకి రాదు. అన్ని రకాలుగా ఈ చిత్ర బృందంలో సభ్యుడినై ఒక మంచి సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం.
హీరోగా ఎన్నో సినిమా?
శ్రీవిష్ణు: నేనెప్పుడూ లెక్కపెట్టుకోలేదు. మొదట్లో కొంత వరకు లెక్కించా. నాకు తెలిసి 25,30 మధ్యలో ఉంటాయేమో! మా సొంతూరు అమలాపురం. నటుడినవ్వాలనే ఇండస్ట్రీకి వచ్చా. నాకంటూ ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్లు ఎవరూ లేరు. వెంకటేష్‌గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్. నటుడిగా తెరపై కనిపించింది కృష్ణవంశీగారి 'శశిరేఖా పరిణయం' సినిమాతో, హీరోగా 'ప్రేమ ఇష్క్ కాదల్'లో మొదటి సారి నటించా.
ఆ అవకాశం ఎలా వచ్చింది?
శ్రీవిష్ణు: నేను అవకాశాల కోసం తిరిగే రోజుల్లో ఈ వాట్సాప్, ఫేస్‌బుక్‌లు అంతగా లేవు. మెయిల్ ద్వారా కొన్ని ఫొటోలు అన్ని సినిమా ఆఫీసులకు పంపేవాడిని. అలా ప్రతి యూనిట్‌లోనూ నా ఫొటోలు ఉండేవి. ఆ క్రమంలోనే 'ప్రేమ ఇష్క్ కాదల్'లో అవకాశం దక్కింది. ఆ సినిమానే నా కెరీర్‌కు మంచి బ్రేక్‌నిచ్చింది.
'గాలి సంపత్'అనే టైటిల్ ఎలా వచ్చింది?
అనిల్: ఇందులో టైటిల్ రోల్ పోషించిన రాజేంద్రప్రసాద్‌గారు మాట్లాడితే నోట్లో గాలి మాత్రమే వస్తుంది. 'ఫా..ఫీ'అనే కొత్త భాషలో మాట్లాడతారు. సినిమాలో సత్య క్యారెక్టరు రాజేంద్రప్రసాద్‌గారి పాత్రకు అనువాదకుడిలాగా ఉంటారు. ఆ సందర్భంలో చాలా హాస్యం ఉంటుంది. శ్రీవిష్ణు కొడుకు పాత్రలో నటించారు.
ఈ కథ ఎవరిది?
అనిల్: నా మిత్రుడు సాయికృష్ణ నా సినిమాలకు రచనా బృందంలో పనిచేస్తుంటాడు. అతనే 'గాలి సంపత్' కథ రాసుకుని నిర్మించాలనుకున్నాడు. దీనికి సాహు గారపాటి, హరీష్ పెద్ది గార్ల సహకారం తోడవడం వల్ల అనీష్ అనే కొత్త డైరెక్టర్‌తో చిత్రాన్ని తెరకెక్కించాం. నావైపు నుంచి పూర్తి సాంకేతిక సహకారం వాళ్లకు అందించా. అందరం కలిసి ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడం ఆనందంగా ఉంది. సినిమాలో ఉండే 'ఫీ..ఫీ..ఫీ' భాషను యూనిట్ అంతా కూర్చుని తయారుచేశాం. మా సాయికృష్ణ ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు చూస్తుంటాడు. ఎప్పటికైనా 'లైఫ్ ఆఫ్ పై','క్యాస్ట్ అవే' సినిమా జోనర్లలో కథలు రాయాలనుకునే ఆలోచనల్లోంచి పుట్టిందే 'గాలి సంపత్'. అప్పట్లో తెలుగులో 'పాపం పసివాడు' వచ్చింది. మళ్లీ అదే జోనర్‌కు చెందిన 'గాలి సంపత్' వస్తోంది. ఈ చిత్రం చేసేటప్పుడు ఆర్థికంగా నాకెంత లాభం ఉంటుందని ఎప్పుడూ అలోచించలేదు. ఎందుకంటే ఇది నా స్నేహితుడు సాయికృష్ణకు ఇచ్చే ఒక బహుమతిగా భావిస్తున్నా. నేనెప్పుడూ సినీ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ జోలికి వెళ్లకూడదనుకుంటున్నా. అలాగే మంచి కథలుంటే మాత్రం మెంటార్‌గా ఉంటూ అందుకు తగిన సాంకేతిక సహాయం చేసి ప్రేక్షకుల్లోకి సినిమాను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా.
ఈ కథకు శ్రీవిష్ణునే ఎందుకు ఎంచుకున్నారు?
అనిల్: మొదట ఈ కథ విన్నప్పుడే తండ్రి పాత్రకు రాజేంద్రప్రసాద్‌గారినే అనుకున్నాం. ఇక కొడుకు పాత్రకు సహజంగా నటించేవారైతేనే సెట్ అవుతారనిపించింది. ఈ మధ్య కాలంలో శ్రీవిష్ణు విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ ఆడియన్స్‌ను మెప్పిస్తున్నాడు. అతనైతే ఈ పాత్రకు సరిపోతాడనిపించింది. తనూ కథ విన్న వెంటనే ఓకే చెప్పేశాడు. అలాగే హీరోయిన్ లవ్‌లీసింగ్ తన పాత్ర పరిధిలో చక్కగా నటించింది.
ప్రస్తుతం డైరెక్ట్ చేస్తున్న చిత్రం?
అనిల్: ప్రస్తుతం 'ఎఫ్3'ని తెరకెక్కిస్తున్నా. 'ఎఫ్2'ను మించి ఇందులో కామెడీ ఉంటుంది. అందులో నటించినవారే దాదాపు ఇందులోనూ ఉంటారు. కచ్చితంగా ఆడియన్స్ కడుపుబ్బా నవ్విస్తాం. 'ఎఫ్2'లో భార్యల వల్ల సమస్యలు వస్తే, 'ఎఫ్ 3'లో డబ్బుతో వచ్చే ఇబ్బందులను చాలా సరదాగా చూపిస్తాం.
ఫిబ్రవరి 29న మీ పుట్టినరోజట?
శ్రీవిష్ణు: అవున్ సార్! లీపు సంవత్సరంలో పుట్టా. దీంతో ఏటా ఫిబ్రవరి 28న ఫ్రెండ్స్ నాకు బర్త్‌డేవిషెస్ చెబుతారు. నేను పుట్టినరోజున శివరాత్రి పర్వదినమట, అందువల్ల మా ఇంట్లో శివరాత్రిరోజు నా పుట్టినరోజు వేడుకలు చేసుకుంటాం.
మీ డ్రీమ్ డైరెక్టర్ ఎవరు?
శ్రీవిష్ణు: ఇండస్ట్రీలోకి రాకముందు ఇలా అనుకునేవాణ్ణి. 'ఏ డైరెక్టర్ అయితే టాప్‌లో ఉంటారో వాళ్లతో నాకో సినిమా పడితే భలే ఉంటుంది కదా' అనుకునేవాణ్ణి. ఇప్పుడు నటించటం మొదలుపెట్టాక మనం ఇంకా ఆ స్థాయికి ఎదగలేదనే అనిపిస్తోంది. ఒకవేళ వాళ్లు నాతో చేస్తానంటే ఆనందంగా నటిస్తా. ప్రస్తుతమైతే నా పరిధిలో ఉండే దర్శకులతోనే సినిమాలు చేస్తున్నా.
సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారు?
శ్రీవిష్ణు: వెబ్ డిజైనర్‌గా పనిచేవాణ్ణి. కానీ, మనసెప్పుడూ సినిమాల మీదే ఉండేది. ప్రాక్టికల్‌గా సినిమాలు వర్కౌట్ కావని మా వాళ్లంతా అంటుండేవారు. చేస్తున్న ఉద్యోగంపై చిరాకు వచ్చేది. ఎందుకంటే రోజూ ఒకే విధంగా ఉండేది. ఇంకా ఇలా కాదనుకుని జాబ్ మానేసి ఇండస్ట్రీలో ప్రయత్నాలు మొదలుపెట్టా. నాన్నగారు వ్యవసాయం చేస్తారు. అమ్మ గృహిణి. నాకొక సోదరి.
ఇండస్ట్రీలోకి రావడానికి బాగా సహాయం చేసిందెవరు?
శ్రీవిష్ణు: నాకు మిత్రగణం చాలా ఎక్కువే. వారే నన్ను మొదటి నుంచీ సినిమాల్లో రాణిస్తానని నమ్మేవారు. ఇండస్ట్రీలోకి వచ్చాక నటులు నారా రోహిత్, రామ్ నాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. నారా రోహిత్ నాకు ముందు నుంచీ మిత్రుడు కావడం వల్ల ఆయన సినిమా స్టోరీలు వింటూ ఉన్నప్పుడు పక్కనే ఉండేవాడిని. దీంతో కథలు వినడం, వాటిని విశ్లేషించడం బాగా అలవాటైంది. డైరెక్టర్లతో కూడా మంచి స్నేహం కదురడం వల్ల వాళ్లే నన్ను ఫలనా పాత్రకు సరిపోతానని చెప్పి నటింపజేశారు. కృష్ణవంశీగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా చేశా. భవిష్యత్తులో సినిమాలకు దర్శకత్వం చేస్తానా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేను, కానీ చాలా స్క్రిప్ట్‌లు రాసుకుని ఉన్నా. వెంకటేష్‌గారిని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ కథలు రాస్తుంటా. క్రికెట్ బాగా ఆడుతుంటా. క్రికెటర్లలో రాహుల్‌ద్రవిడ్‌కు వీరాభిమానిని. భవిష్యత్తులో పెద్ద హీరోలతో స్క్రీన్ పంచుకోవాల్సివస్తే ఆనందంగా చేస్తా. ఎందుకంటే ఒక సీనియర్ నటుడితో కలిసి పని చేస్తే ఎంత ఉపయోగముంటుందో రాజేంద్రప్రసాద్‌గారితో కలిసి నటించినప్పుడు అర్థమైంది.
కమర్షియల్ డైరెక్టర్‌గా ఈ సక్సెస్ ప్రయాణం అనిల్ రావిపూడికి ఎలా అనిపిస్తోంది?
అనిల్: సరదాగా అనిపిస్తోంది. గతంలో జంథ్యాల, వంశీ, ఈవీవీ సత్యనారాయణ గార్లు ఎన్నో జనరంజక కామెడీ చిత్రాలు తీసి, ఒక సినీ లైబ్రరీనే మనకందించి వెళ్లారు. నేను ఎక్కువగా వారి సినిమాలే చూసేవాడిని. జంధ్యాల గారి కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. సినిమాలో ఉండే ప్రతీ పాత్రకు ఒక ప్రాముఖ్యం ఉంటుంది. ఏదో తెరపై ఉంటుందని పాత్రలు సృష్టించేవారు కాదు. వాళ్లకొక మ్యానరిజం పెట్టి, మనందరికి గుర్తుండిపోయే పాత్రలను పరిచయం చేసేవారు.
సినిమాలపై ఆసక్తి ఎప్పటినుంచి మొదలైంది?
అనిల్: చిన్నప్పటినుంచి నాకు సినిమాలపై ఆసక్తి ఉండేది. నా చిన్నతనంలో మా కుటుంబం మహబూబ్‌నగర్‌లో వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్లు. నా తల్లిదండ్రులు పొలానికి వెళ్లేముందు నన్ను అక్కడే స్థానికంగా టెంట్‌లో ఉండే సినిమా థియేటర్లో ఉంచి వెళ్లేవాళ్లు. నేనేమో ఎటూ కదలకుండా అక్కడే వాళ్లు వేసే సినిమాలు చూస్తూ ఉండేవాడిని. అలా నాపై సినిమా ప్రభావం బాగా పడింది. ఆ తర్వాత బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నా, పుట్టినరోజైనా, ఏదైనా పండగొచ్చిన సినిమాలకు పంపిస్తుండేవారు. అంతేకాకుండా మా బాబాయి అరుణ్‌ప్రసాద్ సినీ రంగంలో ఉండటం నాకు కలిసొచ్చింది. ఆయన అండతోనే ఇండస్ట్రీలోకి వచ్చా. 'తమ్ముడు','గౌతమ్ ఎస్‌ఎస్‌సీ' వంటి అద్భుతమైన సినిమాలు తీశారాయన.
ఇప్పుడు ఆయన ఎక్కడుంటున్నారు?
అనిల్: ప్రస్తుతం ఆయన సినిమాలు మానేసి వ్యాపారం చేస్తున్నారు. 'గౌతమ్ ఎస్ఎస్‌సీ' చిత్రం డైరెక్ట్ చేశాక, జగపతిబాబుగారితో ఒక సినిమా తీశారు. అది అంతగా ఆడలేదు. దీంతో కొన్నాళ్లు విరామమివ్వాలని భావించినట్టున్నారు. నేను పూర్తి రైటర్‌గా మారింది ఆయన శిక్షణలోనే. బాబాయి ఇప్పుడొచ్చి సినిమా తీసిన ట్రెండ్‌కు తగ్గట్టు తెరకెక్కించగలరు. ఆయన సినిమాల్లోనూ, పాటల్లోనూ నాణ్యత ఉంటుంది. ఈ రోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే ఆయనే కారణం. ఆయనొచ్చి డైరెక్షన్ చేస్తానంటే మళ్లీ రైటర్ మారి పూర్తి స్క్రిప్ట్ రాయటానికి నేను రెడీ.
ప్రస్తుత సినిమాల్లో హీరోలు కూడా కామెడీ చెయ్యటం కమెడియన్స్‌పై ప్రభావం చూపుతుందా?
అనిల్: మీరన్నది నిజమే! ఇప్పుడు ప్రత్యేకంగా కామెడీ ట్రాకులేవీ రాసుకోవడంలేదు. కారణం కథలో హీరోలు కూడా కామెడీ చేస్తుండటం. వాళ్లు ఎంత చేసినా కమెడియన్స్‌పై ప్రభావం ఉండదు. ఎందుకంటే కొన్ని కొన్ని మ్యానరిజమ్స్, సిగ్నేచర్స్ వాళ్లిస్తేనే బాగుంటుంది. ఉదాహరణకు 'ఎందా చేటా' అనే పదం మీరు పలికితేనే బాగుంటుంది. అలా ఎవరి ప్రాముఖ్యం వారికుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాస్యనటుల సంఖ్య ఎక్కువగానే ఉంది.
వెండితెరపై రైటర్‌గా మీ పేరు పడిన మొదటి చిత్రమేది?
అనిల్: నాగార్జున గారు నటించిన 'బాస్' సినిమాలో మొదటిసారి డైలాగ్ రైటర్‌గా నా పేరు వెండితెరపై చూసుకున్నా. ఆ తర్వాత 'శౌర్యం', 'దరువు', 'మసాలా', 'ఆగడు' వంటి సినిమాలకు రైటర్‌గా పనిచేశా. కానీ రైటర్‌గా సక్సెస్ కానీ నేను అదే స్టార్లతో డైరెక్టర్‌గా చేసిన చిత్రాలు బ్లాక్‌బస్టర్ కొట్టాయి. రైటర్‌గా కొన్ని అపజయాలు ఎదురైనా, నేనెక్కడా డీలా పడలేదు. నా పరుగును ఆపలేదు. ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే అవకాశాలు వెంటపడతాయి. అది సత్యం. నటులకు నాలుగైదు అవకాశాలు ఉండచ్చొమో. ఏ పెద్ద దర్శకులైనా నన్ను డైలాగ్స్ రాయమని అడిగితే వంద శాతం పనిచేస్తా.
అనిల్ రావిపూడితో మీ బంధం ఎలా ఉంటుంది?
శ్రీవిష్ణు: కచ్చితంగా మంచి అనుబంధమే ఉంటుంది. 'గాలి సంపత్' సినిమా ద్వారా అది మరింత బలపడింది. ఆయన నుంచి సెట్లో ఎన్నో నేర్చుకున్నా. అటు వృత్తిపరంగానూ, ఇటు వ్యక్తిగతంగానూ ఆయనలో నాకు నచ్చిన కొన్ని విషయాలను అమలులో పెడుతున్నా. అలాగే రాజేంద్రప్రసాద్‌గారితో ఈ నట ప్రయాణాన్ని ఎన్నటికీ మరువలేను. నటనలోని ఎన్నో మెళుకువలు ఆయన దగ్గర నుంచి నేర్చుకుని, ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో వాటిని అమలు చేస్తున్నా. నన్ను గమనించినవారంతా ఆ ప్రభావం కనిపిస్తుందంటూ కితాబిస్తున్నారు.
థియేటర్లో ఎక్కువసార్లు చూసిన సినిమా ఏది?
శ్రీవిష్ణు: వెంకటేష్ గారి 'నువ్వు నాకు నచ్చావ్'. థియేటర్లో మొత్తం 72సార్లు చూశా. నేను కాలేజీ చదివే రోజుల్లో ఆ సినిమా వచ్చింది. అలా మొదటి పదిసార్లు టికెట్ కొన్నా. ఇక అక్కడి నుంచి థియేటర్ యాజమాన్యమే నాకు ఉచితంగా సినిమా చూసేందుకు అనుమతి ఇచ్చింది.
మీ ఆవిడ నిర్మాతగా సినిమాలు చేశారా?
శ్రీవిష్ణు: హా!అవును. 'అప్పట్లో ఒకడుండేవాడు', 'నీది నాది ఒకటే కథ' చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించింది. అలాంటి కథలు నేను చేయాలనే ఉద్దేశంతోనే తను నిర్మాతగా మారింది. మా ఇద్దరిది ప్రేమపెళ్లి. ఆమెది వైజాగ్, గీతం కాలేజీలో చదువుకునేటప్పుడు తనను ఇష్టపడ్డా. ఇద్దరం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మాకో పాప.
ఎందుకు శ్రీవిష్ణు రొమాంటిక్ సీన్లలో నటించాలంటే ఇబ్బంది పడతాడంటా(నవ్వులు)?
శ్రీవిష్ణు: ఎందుకో మొదటినుంచి అటువంటి సన్నివేశాల్లో నటించడమంటే ఇబ్బందిగా ఉంటుంది. ఒక సినిమాకు నా స్నేహితుడే డైరెక్టర్. వాడు కథను వివరించేటప్పుడు స్క్రిప్టులో ఉన్న రొమాంటిక్ సన్నివేశాల గురించి అస్సలు చెప్పలేదు. తీరా సెట్స్‌పైకి వెళ్లాక ఆ సీన్లు చేయాలన్నాడు. ఎంత బ్రతిమాలాడుకున్నా వాడు వినలేదు(నవ్వులు). ఎలాగోలా గట్టెక్కిచ్చా.
'రాజా ది గ్రేట్' సినిమా మొదట హీరో రామ్‌తో తెరకెక్కిద్దామనుకున్నారట కదా?
అనిల్: అవును! మొదట రామ్‌ని ఊహించుకునే ఈ కథ రాసుకున్నా. కానీ ఎందుకో ఆ తర్వాత మా కాంబినేషన్ వర్కౌట్ కాలేదు. ఎందుకుంటే అప్పటకే రామ్ 'హైపర్'కి తోడు మరో సినిమాలో యాక్షన్ ప్రధానంగా నటించారు. మళ్లీ అదే జోనర్‌లో కాకుండా కాస్త విభిన్నంగా చేయాలనుకున్నాడు. అందుకే ఆ సినిమా ఆగిపోయింది. తప్పనిసరిగా త్వరలో రామ్‌తో సినిమా ఉంటుంది.
మీ కుటుంబం గురించి?
అనిల్: మాది కూడా పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. నాకు ఒక పాప, బాబు. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముందు నాకు కుమారుడు పుట్టడం ఎప్పటికీ మర్చిపోలేను. ఇక నా తల్లిదండ్రులు ఇప్పుడు నేనున్న స్థితిని చూసి సంతృప్తిగా ఉన్నారు. మా నాన్న నేను తీసే సినిమా సెట్‌లోనే ఎక్కువగా ఉంటారు. షూటింగ్ లొకేషన్‌లో ఆయనుంటే సినిమా నిర్మాతలు భలే ఆనందంగా ఉంటారు. ఎందుకంటే అందరినీ దగ్గరుండి ఆయన పనిచేయిస్తుంటారు. నా చిన్నతనంలో ఆయన సినిమా షూటింగ్ చూసేందుకు చాలా దూరం వెళ్లి ఎక్కడో జనాల్లో నిలబడి చూస్తూ చప్పట్లు కొట్టేవారట. ఒకసారి వెంకటేష్‌గారి 'బొబ్బిలి రాజా' షూటింగ్‌ను అలాగే చూశారట. ఈ రోజు అదే వెంకటేష్‌గారి పక్కన కూర్చుని మాట్లాడుతున్నారు. ఆ దృశ్యం చూసినప్పుడు నాకు చాలా గర్వంగా ఉంటుంది.
డ్యాన్స్ బాగా చేస్తారట కదా?
అనిల్: చిన్నప్పటి నుంచి చిరంజీవిగారి సినిమాలు చూస్తూ ఆయన డ్యాన్స్‌లు చేస్తూ ఉండేవాడిని. ప్రొఫెషనల్‌గా ఎక్కడా నేర్చుకున్నది లేదు. కానీ, స్కూల్స్‌లో, కాలేజ్‌లలో ఈవెంట్లు పెడితే కచ్చితంగా ప్రైజ్ వచ్చేలా చేసేవాడిని. ఎక్కడైనా పెళ్లిళ్లు జరిగితే ఆ బ్యాండ్‌మేళం వాళ్లు నన్ను తీసుకెళ్లి డ్యాన్స్ వేయించేవారు. ఇంటికొచ్చాక అమ్మ చీపురుకట్ట తిరగేసేది. అలాగే చిన్నప్పుడు 'బుడుగు' అనే నాటకం కూడా వేసేవాడిని. ఒక పెద్ద పుస్తకం నిండా డైలాగులను కంఠతా పట్టేసి చెప్పేశా. అలాగే ఏదోక ఈవెంట్‌లో కచ్చితంగా డ్యాన్స్ చేయాలనుంది. అది కూడా మంచిగా కొరియోగ్రఫీ చేసుకుని చేస్తా. కచ్చితంగా ఒక రేంజ్‌లో చేస్తానని మాత్రం చెప్పగలను.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'ఇండస్ట్రీకి వచ్చాక ఆ విషయం అర్థమైంది'