బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మన నుంచి దూరమై నేటికి ఏడాది కావొస్తుంది. గతేడాది జూన్ 14న ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన వర్థంతిని పురస్కరించుకొని అతడికి సంబంధించిన కొన్ని విశేషాలు మీ కోసం..
బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా..
1986 జనవరి 21న బిహార్‌లోని పట్నాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జన్మించారు. సుశాంత్.. తాను కనే కలలను ఓ పుస్తకంలో రాసుకున్నారు. ఎలాగైనా వాటిని నేరవేర్చుకోలనే ధ్యేయంతో ఉండేవారు. ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసిన తర్వాత షియామాక్ దావార్ డ్యాన్స్ స్కూల్లో చేరారు. బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా బాలీవుడ్లో అడుగుపెట్టిన సుశాంత్.. ఏక్తా కపూర్ రూపొందించిన ధారావాహిక ద్వారా నటుడిగా పరిచయమయ్యారు. డీసీఈ చేస్తున్నపుడు ప్రపంచంలోని ప్రదేశాలకు వెళ్లేందుకు డ్యాన్స్ చేస్తూ డబ్బులు సంపాదించేవారు సుశాంత్. తర్వాత ఫిల్మ్ కెరీర్‌ను ఎంచుకునే ఉద్దేశ్యంతో ముంబయి చేరుకుని నదిరా బబ్బర్ థియేటర్ గ్రూప్‌లో చేరారు.
ఏక్తాతో పరిచయం..
జీవితం నెమ్మదిగా సాగుతున్నప్పుడు దర్శక నిర్మాత ఏక్తాకపూర్.. సుశాంత్‌ను చూశారు. 'నేను నిన్ను స్టార్‌ను చేస్తా' అని చెప్పారు. అలా పవిత్ర రిష్తాతో సుశాంత్‌ను బుల్లితెరకు పరిచయం చేశారు ఏక్తా. అప్పటి నుంచి ఇక వెనుదిరిగి చూసుకోవాల్సివన అవసరం రాలేదు. ఒకసారి సుశాంత్ కాఫీ షాప్‌లో కూర్చున్నప్పుడు బాలీవుడ్ క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రాతో పరిచయమైంది. అప్పుడు ముఖేశ్ 'కై పో చే' కాస్టింగ్ పనిలో ఉన్నారు. ఈ మీటింగ్ ఆడిషన్‌కు దారితీసింది. అలా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రధాన నటుడిగా ఎంపికయ్యారు సుశాంత్.
ఇదీ చదవండి: సుశాంత్ బయోపిక్ తెరకెక్కించనున్న ఆర్జీవీ!
ప్రముఖుల ప్రశంసలు..
తన నటనతో శేఖర్ కపూర్, సంజయ్ లీలా భన్సాలీ వంటి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు సుశాంత్. వీరిద్దరితో పలు సినిమాలు చేయాల్సి ఉన్నా పలు కారణాల వల్ల ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. తర్వాత రాజ్‌కుమార్ హిరానీ, నీరజ్ పాండే, దినేశ్ విజన్, నితీశ్ తివారీ వంటి దర్శకులతో పనిచేశారు సుశాంత్. వారి దర్శకత్వంలో పీకే, ఎంఎస్ ధోనీ, కేదార్నాథ్, సోంచరియా, చిచోరే వంటి చిత్రాలు చేసి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. చిచోరే చిత్రంలో తన తనయుడు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. అతడికి స్ఫూర్తి నింపే నాన్న పాత్రలో కనిపించారు సుశాంత్. కానీ నిజ జీవితంలో తానే ఆత్మహత్య చేసుకుని తనువు చాలించడం చాలామంది జీర్ణించుకోలేకపోయారు.
కలల జాబితా..
సుశాంత్ చనిపోవడానికి దాదాపు ఒక సంవత్సరం ముందు, అతడు తాను నెరవేర్చాలనుకున్న 50 కలల జాబితాను పంచుకున్నారు. ఇందులో కొన్ని వ్యక్తిగత లక్ష్యాలు ఉన్నాయి. ఈ జాబితాలో విమానం నడపడం నేర్చుకోవడం, ఐరన్ మ్యాన్ ట్రయాథ్లాన్ శిక్షణ తీసుకోవడం, లెఫ్టాండర్‌గా క్రికెట్ మ్యాచ్ ఆడటం, మోర్స్ కోడ్ నేర్చుకోవడం, పిల్లలకు అంతరిక్షం గురించి తెలుసుకోవడానికి సహాయపడటం, టెన్నిస్ ఛాంపియన్‌తో టెన్నిస్ ఆడటం, ఫోర్ క్లాప్ పుష్ అప్ చేయడం వంటివి ఉన్నాయి.
చంద్రునిపై స్థలం కొనుగోలు..
తనకు తొలి సినిమా అవకాశం దక్కడంలో సాయం చేసిన ముఖేశ్ ఛబ్రా దర్శకత్వం వహించిన దిల్ బెచారాలో హీరోగా చేశాడు సుశాంత్. డైరెక్షన్లో ముఖేశ్‌కు ఇది తొలి సినిమా కావడం విశేషం. 2018లో సుశాంత్ అంతర్జాతీయ లూనార్ ల్యాండ్ రిజిస్టరీ ద్వారా చంద్రునిపై స్థలాన్ని కొనుగోలు చేశారు. కానీ ఆ ఆస్తికి చట్టపరమైన విలువ లేదు. జూన్ 14, 2020న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నో కలలతో రంగుల లోకంలో ప్రవేశించిన ఆయన మరణం అభిమానులతో పాటు సినీ ప్రముఖులకు తీరని శోకం మిగిల్చింది.
ఇదీ చదవండి: దిల్లీలోని వీధికి సుశాంత్ రాజ్‌పుత్ పేరు