మెగా వారసురాలు నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాల నడుమ చైతన్య జొన్నలగడ్డ ఆమె మెడలో మూడు ముళ్లు వేశారు. అనంతరం.. ఏడడుగులు వేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో పూలు, తోరణాలతో అందంగా అలంకరించిన మండపంలో ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ముహూర్తం వేళ పెళ్లి కుమార్తె నిహారిక బంగారు వర్ణం దుస్తుల్లో మెరిసిపోయారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు.. వధూవరులను ఆశీర్వదించారు. ఈ శుభకార్యానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు నూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. వారి జీవితం సంతోషం, ప్రేమతో నిండిపోవాలని కోరుకుంటున్నట్లు పోస్ట్‌లు చేశారు.
ఈ సందర్భంగా నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు. "నా కుమార్తె తొలి రోజు పాఠశాలకు వెళ్తున్నట్లు అనిపిస్తోంది.. కానీ ఆమె సాయంత్రం తిరిగి ఇంటికి రాదు. నా చిన్నారి ఎదిగి, పాఠశాలకు వెళ్తున్నప్పుడు ఆమెతో రోజులో 24 గంటలు ఆడుకోలేనని నా మనసుకు చెప్పడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఈ సారి (పెళ్లి చేయడాన్ని ఉద్దేశిస్తూ) ఎంత కాలం పడుతుందో చూడాలి. దాన్ని కాలమే నిర్ణయిస్తుంది. నిన్ను చాలా మిస్ అవుతున్నా నిహారిక తల్లి" అంటూ నాగబాబు పెళ్లి ఫొటో షేర్ చేశారు.
ఇదీ చూడండి: నిహారిక పెళ్లి.. పవన్ కల్యాణ్ రాకతో సందడే సందడి