'కౌసల్య కృష్ణమూర్తి', 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రాలతో సినీప్రియుల్ని మెప్పించిన తెలుగందం ఆమె. ఇప్పుడు సాయితేజ్‌కు జోడీగా 'రిపబ్లిక్'(Aishwarya Rajesh Recent Movies) సినిమాలో నటించింది. దేవ్ కట్టా దర్శకుడు. ఈ చిత్రం అక్టోబరు 1న(Republic Movie Release Date) థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది ఐశ్వర్యా రాజేశ్. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
"నేను మొదటి నుంచీ వాస్తవికతతో నిండిన చిత్రాలే ఎక్కువగా చేశాను. కమర్షియల్ సినిమాలు చేసింది చాలా తక్కువ. అందుకే ఐశ్వర్య అంటే ఫలానా పాత్రలే చేయగలదని తెలియకుండానే నాపై ఓ ముద్ర పడిపోయింది. నిజానికి నేనూ అన్ని రకాల పాత్రలు చేయగలను. అది ఇప్పుడే అందరికీ అర్థమవుతోంది"
పాత్ర బాగా నచ్చటం వల్ల..
"దేవ్ కట్టా సర్ ఓ రోజు ఫోన్ చేసి 'రిపబ్లిక్' సినిమా గురించి చెప్పారు. ఇందులో మైరా హ్యాన్సన్ అనే పాత్ర ఉంది చేస్తారా? అని అడిగారు. ఫోన్‌లోనే గంట సేపు కథ చెప్పారు. ఈ స్క్రిప్ట్ వింటున్నప్పుడే కథ, నా పాత్ర బాగా నచ్చడం వల్ల చేస్తానని చెప్పా. అలా ఈ సినిమాతో నా ప్రయాణం మొదలైంది. నేనిందులో మైరా అనే ఎన్నారైగా కనిపిస్తా. ఓ సమస్యపై పోరాడేందుకు భారత్‌కు వస్తా. మరి ఆ సమస్య ఏంటి? దానికి పరిష్కారం దొరికిందా? లేదా? అన్నది తెరపై చూడాలి".
"రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు పూర్తి భిన్నమైన చిత్రమిది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా దేవ్ కట్టా ఈ కథ అల్లుకున్నారు. పరిపాలనా.. రాజకీయ వ్యవస్థల నేపథ్యంలో సాగే పొలిటికల్ థ్రిల్లర్‌గా ఉంటుంది. ఓవైపు ప్రేక్షకులను ఎడ్యుకేట్ చేస్తూనే.. మరోవైపు వినోదం పంచిస్తుంది. సినిమా చూశాక ప్రతి ఒక్కరూ మనమూ సమాజానికి ఏదోకటి చేయాలని తపన పడతారు. దీంట్లో సాయితేజ్‌కు నాకు మధ్య ఉండే ప్రేమకథ చాలా కొత్తగా ఉంటుంది".
ఆ తపనతోనే..
"ఈ చిత్రంలో జగపతిబాబు, రమ్యకృష్ణలతో పాటు తెరపై కనిపించే ప్రతి చిన్న పాత్రకు ప్రాధాన్యముంటుంది. ప్రేక్షకులపై బలమైన ముద్ర వేస్తుంది. నేనిప్పటి వరకు కలిసి పని చేసిన హీరోల్లో సాయితేజ్ ఎంతో ప్రత్యేకం. తను ఎంచుకున్న పాత్ర కోసం ఎంత కష్టపడటానికైనా వెనకాడడు. ఈ చిత్రంలో ఆయన పాత్రకు ఓ పెద్ద బాధ్యత ఉంది. తనొక ప్రభుత్వ అధికారి.. ప్రజలతో చాలా మాట్లాడుతుండాలి. ఆ సంభాషణలన్నీ శక్తిమంతంగా ఓ భావోద్వేగంతో చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఆ డైలాగ్‌ల కోసం తేజు ఓ స్కూల్ పిల్లాడిలా చాలా కష్టపడ్డాడు. రోజూ ఓ పుస్తకంలో తన సంభాషణలన్నీ రాసుకుని ప్రాక్టీస్ చేసేవాడు. సినిమాలో ఓ కోర్టు సీన్ ఉంటుంది. ఆ సన్నివేశంలో 10 నిమిషాల డైలాగ్‌ను సింగిల్ షాట్‌లో చెప్పారు సాయితేజ్".
"ప్రజల్ని ఎక్కువగా ప్రభావితం చేసే మాధ్యమాల్లో సినిమా ముందు వరుసలో ఉంటుంది. ఇలాంటి వేదికపై వాస్తవ కథల్ని చర్చిస్తే.. ప్రేక్షకులపై ఆ ప్రభావం మరోస్థాయిలో ఉంటుందని నమ్ముతా. నేను ఏ చిత్రసీమలో ఉన్నా.. మొదటి నుంచి అనుసరించే సూత్రమొకటే. సినిమాలో నేను పోషించే పాత్ర చిన్నదైనా సరే.. అది ప్రేక్షకుల మదిపై చెరగని ముద్ర వేసేదిగా ఉండాలనుకుంటా. అలాగే నటిగా నా నటనకు ఆస్కారముందా.. లేదా? చూసుకుంటా.
వాస్తవికతతో కూడిన కథలు..
"గతంతో పోల్చితే ఇప్పుడు తెలుగులోనూ వాస్తవికతతో కూడిన కొత్త కథలు విరివిగా వస్తున్నాయి. సమంత, అనుష్కల నటనను చాలా ఇష్టపడతా. ప్రస్తుతం తెలుగులో ఓ కథ విన్నా. త్వరలో తెలుగులో 'గతం' ఫేం కిరణ్ రెడ్డితో ఓ చిత్రం చేయనున్నా. తమిళంలో 'గ్రేట్ ఇండియన్ కిచెన్'తో పాటు పలు సినిమాలు చేస్తున్నా".
ఇదీ చదవండి: 'లవ్‌స్టోరీ' మేకింగ్ వీడియో- 'లక్ష్య' మూవీ అప్డేట్