"జయాపజయాల్ని నేనెప్పుడూ గౌరవిస్తా. విజయం దక్కినప్పుడు మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తా. అపజయం ఎదురైనప్పుడు చేసిన పొరపాట్ల నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తా. దేన్నీ అతిగా తలకెక్కించుకుని ఒత్తిడికి గురవ్వను" అని అంటున్నారు నవీన్ చంద్ర. 'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు తెరపై మెరిసిన కథానాయకుడాయన. 'నేను లోకల్', 'అరవింద సమేత', 'ఎవరు' వంటి చిత్రాలతో ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగానూ సత్తా చాటారు. ఇప్పుడు హీరోగా 'భానుమతి రామకృష్ణ' సినిమాతో డిజిటల్ తెరపై సందడి చేయబోతున్నారు. శ్రీకాంత్ నాగోటి దర్శకత్వం వహించారు. యశ్వంత్ ములుకుట్ల నిర్మించారు. సలోనీ లూథ్రా కథానాయిక. జులై 3న ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు నవీన్.
మీతో చేయలేం అన్నారు
'భానుమతి రామకృష్ణ'లో అవకాశం అనుకోకుండా వచ్చింది. దర్శకుడు శ్రీకాంత్... మా జిమ్ ట్రైనర్ సురేష్ ద్వారా పరిచయమయ్యారు. ఓ రోజు మాటల్లో ఈ చిత్ర కథ చెప్పారు. నాకది బాగా నచ్చింది. రామకృష్ణ పాత్ర నేను చేయొచ్చా? అని శ్రీకాంత్‌ను అడిగా. దాంతో తను షాకయ్యారు. 'మీరు ఈ పాత్రను అవలీలగా చేసేయ్యగలరు కానీ, మేమిది చాలా తక్కువ మందితో అతి తక్కువ బడ్జెట్‌తో చేయాలనుకుంటున్నాం. మీ అంత పెద్ద నటుడితో మాకు కష్టమవుతుంది' అన్నారు. నాకు కథ బాగా నచ్చింది. నాకోసం మీరు పెద్దగా ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదు. దీన్ని ఎలా తెరకెక్కించాలి అనుకుంటున్నారో అలాగే చేయండని చెప్పా.
మధ్యతరగతి రామకృష్ణల కథ
ఈ సినిమాలో తెనాలిలో పుట్టి పెరిగిన రామకృష్ణ.. ఉన్న దాంట్లో సంతృప్తికరంగా బతికేస్తుంటాడు. ఇక భానుమతి విషయానికొస్తే.. ఇంట్లో కుటుంబ సమస్యలు, ప్రేమలో విఫలం, 30ఏళ్లు దాటినా పెళ్లి కావట్లేదన్న టెన్షన్ ఇలా రకరకాల ఒత్తిడితో ఉంటుంది. తన జీవితంలోకి వచ్చేవాడు తన ఆలోచనలకు తగ్గట్లుగా ఉండాలనుకుంటుంది. ఇలా భిన్నమైన వ్యక్తిత్వాలున్న ఇద్దరు వ్యక్తులు కలిసి చేసిన ప్రయాణం 'భానుమతి రామకృష్ణ'. వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది.
అప్పుడే అసలు కష్టం తెలిసొచ్చింది
కథ విన్నప్పుడు ఈ పాత్ర ఈజీగా చేసెయ్యొచ్చు అనుకున్నా, రంగంలోకి దిగేసరికి అసలు కష్టం తెలిసొచ్చింది. నిజంగా ఆ పాత్ర లక్షణాలున్న వ్యక్తుల్ని పట్టుకోవడమెలా అన్నది పెద్ద ఫజిల్. దీనికి నేను దర్శకుడు 'ఫైండింగ్ రామకృష్ణ' పేరుతో చిన్న ప్రయోగం చేశాం. ఈ ప్రయాణంలో 'నాలోనూ ఓ రామకృష్ణ ఉన్నాడు. సినిమాలు, హంగామాల మధ్య వాడు మరుగున పడిపోయాడు' అని కనుగొన్నా. కొందరి అనుభవాలు, నాలోని రామకృష్ణను కలిపి పాత్రకు సిద్ధమయ్యా.
ఓటీటీ మంచి ఆప్షన్
థియేటర్లు, ఓటీటీ.. వినోద మాధ్యమాలు ఏవైనా దేని మార్గాలు దానివే. ఇప్పుడు కొవిడ్ - 19 పరిస్థితుల్లో ఓటీటీ ప్రేక్షకులకు మంచి ఆప్షన్‌గా మారింది. అందరూ చక్కగా ఇంటి పట్టునే వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. ఏదేమైనా ఈ పరిస్థితుల వల్ల థియేటర్లలో ప్రేక్షకుల అరుపులు, హంగామాల మధ్య సినిమా చూడలేకపోవడం లోటే అనిపిస్తుంది.
వాళ్ల స్ఫూర్తితోనే..
నేను పుట్టింది హైదరాబాద్‌లోనే.. పెరిగిందంతా కర్ణాటక. అక్కడే డిప్లమా అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ చేశా. తర్వాత కొన్నాళ్లు ఓ కంపెనీలో అప్రెంటీస్‌గా చేశా. సినిమాలపై ఆసక్తితో కొంత డబ్బు తీసుకొని ఇటువైపు వచ్చేశా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు సింగిల్ బెడ్ రూంలో జీవించడం నుంచి నా సినీ ప్రయాణం మొదలైంది. ఈ క్రమంలో నా జీవితంలో పాల ప్యాకెట్లు వేసే వాళ్లు, పేపర్ బాయ్ ఇలా అనేక మంది రామకృష్ణల్ని దగ్గర్నుంచి చూశా. వీళ్లతో పాటు మరెంతో మంది సహాయాలతోనే నటుడిగా ఈ స్థాయికి ఎదిగా.
జ్ఞానోదయం చేశారు
నటుడిగా నా జీవితాన్ని మలుపు తిప్పింది నిర్మాత దిల్‌రాజు. 'అందాల రాక్షసి', 'దళం' చిత్రాలు కథానాయకుడిగా నాకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. తర్వాత హీరోగా కొన్ని కథలు చేశా. అవి ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఆ సమయంలో ఒత్తిడికి గురయ్యా. 'నేను లోకల్' విడుదలయ్యాక.. ఓ రోజు దిల్‌రాజు నాకు జ్ఞానోదయం చేశారు. 'నీలో మంచి నటుడు ఉన్నాడు. కాబట్టి విభిన్నంగా ప్రయత్నించు. కథానాయకుడిగానే చేయాలని ఎదురు చూడకు. ప్రధాన పాత్రలేవైనా చేస్తూ ముందుకు వెళ్లు' అని సలహా ఇచ్చారు. అప్పటి నుంచే నా ఆలోచనా ధోరణిని మార్చుకొన్నా. ప్రేక్షకులు మంచి నటుడిగా గుర్తు పెట్టుకోగలిగితే చాలనుకున్నా.
జీవితంలో ప్రేమ, పెళ్లి..
పెళ్లి అన్నది 25ఏళ్లకే చేసుకోవాలి, 30ఏళ్ల కల్లా పూర్తవ్వాలి అన్నది నేను నమ్మను. నిజ జీవితంలో ప్రేమ, పెళ్లి అనే వాటిని ఎవరెలా హ్యాండిల్ చేస్తారనే దాన్ని బట్టి వారి జీవితం అలా ఉంటుంది. నాకు తెలిసి ప్రేమ వివాహమైతే.. ఇద్దరూ భార్య భర్తల్లాగే కాకుండా మంచి స్నేహితుల్లా ఉండగలుగుతారు. పెద్దలు కుదర్చిన పెళ్లిలోనూ ఇలా ఉండొచ్చు. ఏ వివాహ బంధంలోనైనా పురుషుడు, స్త్రీ ఇష్టాఇష్టాలను గౌరవించగలగాలి.
'విరాటపర్వంలో' ఇలా.. వరుణ్ చిత్రంలో అలా..
“ప్రస్తుతం నేను చేస్తున్న చిత్రాల్లో ఐదు వరకు విడుదల కావాల్సి ఉన్నాయి. రానాతో చేస్తున్న ‘విరాటపర్వం’లో నా పాత్ర చాలా కొత్తగా ఉండబోతుంది. నా కెరీర్‌లో ది బెస్ట్ రోల్ అవుతుంది. వరుణ్‌తేజ్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రంలో బాక్సర్‌గా నటిస్తున్నా. బోయపాటి - బాలకృష్ణ కలయికలో రూపొందుతున్న చిత్రంలో ఓ విభిన్నమైన పాత్ర ఉంది. కానీ, అదింకా ఫైనల్ కాలేదు.