Chiranjeevi condolences to Shivashankar master: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ మృతి చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
"శివశంకర్ మాస్టర్ మరణ వార్త నన్ను కలచివేసింది. ఆయనా నేనూ కలిసి చాలా సినిమాలకు పనిచేశాం. 'ఖైదీ' చిత్రంతో మా స్నేహం మొదలైంది. ఇటీవల 'ఆచార్య' సెట్‌లో కలుసుకున్నాం. అదే చివరిసారి అవుతుందని అస్సలు ఊహించలేదు. ఓ ఆత్మీయుడ్ని కోల్పోయా. ఆయన మృతి నృత్య కళకే కాదు యావత్ సినీ పరిశ్రమకే తీరనిలోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి."
- నటుడు చిరంజీవి
"శివశంకర్ మాస్టర్ మృతి చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. శాస్త్రీయ నృత్యంలో శివశంకర్ మాస్టర్‌కు మంచి పట్టు ఉంది. సినీ నృత్యంలో శాస్త్రీయ నృత్యాన్ని మేళవించేవారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా"
-పవన్‌కల్యాణ్, హీరో
"శివశంకర్ మాస్టర్ చనిపోయారన్న వార్త విని నా గుండె పలిగింది. ఆయన్ను రక్షించేందుకు మా వంతు ప్రయత్నం చేశాం. కానీ, భగవంతుడు ఇలా చేశాడు. మాస్టర్.. సినీ పరిశ్రమ మిమ్మల్ని మిస్ అవుతుంది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి."
-నటుడు సోనూసూద్
"శివశంకర్ మాస్టర్ లేరన్న విషయం బాధ కలిగించింది. ఆయన కుటుంబానికి మా సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం."
- శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ
"శివశంకర్ మాస్టర్ మృతి బాధాకరం. 'మగధీర' చిత్రానికి ఆయన కొరియోగ్రఫీ చేశారు. ఆయనతో పనిచేసిన రోజులు మరిచి పోలేనివి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి"
-రాజమౌళి, దర్శకుడు
ఇదీ చూడండి: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత