రవితేజ-గోపిచంద్ మలినేనిల కాంబినేషన్ అంటే సినీ పరిశ్రమలో మంచి పేరుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'డాన్ శీను', 'బలుపు' బాక్సాఫీస్ ముందు మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు సిద్ధమౌతూ క్రాక్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే అన్ని వాణిజ్య హంగులతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో మాస్‌రాజాపై భారీ జాతర సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. ఈ ఎపిసోడ్లో వందల మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు పాల్గొంటున్నారట. ఈ సీన్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే పోరాట సన్నివేశాలు తెరపై సినీప్రియులను ఆకట్టుకోనున్నాయట. ఈ చిత్రంలో రవితేజ ఓ శక్తిమంతమైన పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు.
ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రుతిహాసన్ నటిస్తోంది. ప్రముఖ నటులు సముధ్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఠాగూర్ మధు నిర్మాత.
ఇదీ చూడండి: సేనతో 'మహా'ప్రభుత్వ ఏర్పాటుపై రేపే కాంగ్రెస్ ప్రకటన