మూడు పూటలా తిండి కోసమూ ఎన్నో తిప్పలు పడిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. అందుకు కారణం ఆ ఇంటి పెద్ద కూతురే. ఆమే ముంబయికి చెందిన శైలీ కాంబ్లే(sayli kamble). గణాంకశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేసి... మరోవైపు గాయనిగా ప్రయత్నించింది. అలా ఇండియన్ ఐడల్(indian idol) పోటీల్లో మూడో స్థానంలో నిలిచింది. ఆ 23 ఏళ్ల గాయని పాటల ప్రయాణం తెలుసుకుందామా..!
నాన్న కిషోర్ కాంబ్లే 30ఏళ్లుగా అంబులెన్సు నడుపుతున్నారు. అమ్మ సురేఖ ఇల్లు చూసుకుంటుంది. నేను, ఇద్దరు చెల్లెళ్లు. చిన్నతనం నుంచే నాకు సంగీతమంటే ప్రాణం. లతా మంగేష్కర్, ఆశాబోంస్లేలను ఆరాధిస్తూ పెరిగా. నాన్నపడే కష్టానికి తప్పకుండా చదవాలి.. ఇల్లు నిలబడాలంటే నేను తప్పకుండా ఉద్యోగం చేయాలి. అందుకే చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. అన్నింట్లో మొదటి ర్యాంకు సాధించేదాన్ని. గణాంకశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశా. రెండేళ్లుగా బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నా. ఇటు చదువులో రాణిస్తూనే పాటతో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నా. నాలుగో తరగతి నుంచే పాటతో ప్రయాణం సాగుతోంది. సొంతంగా టీవీల్లో చూస్తూ పాటలు సాధన చేశాను. చిన్నచిన్న కార్యక్రమాలతో మొదలై మరాఠీలో నా గొంతు తెలియని వాళ్లుండరనే స్థాయికి చేరుకున్నాను. ఉద్యోగాల వేటలో పడి ఇండియన్ ఐడల్ లాంటి కార్యక్రమాల దాకా వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. మొదట్లో అమూల్ వాయిస్ ఆఫ్ ఇండియా, మమ్మీ కె సూపర్‌స్టార్స్, గౌరవ్ మహారాష్ట్ర లాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు నన్ను మా రాష్ట్రానికి పరిచయం చేశాయి. ఆ తర్వాత అనుకోకుండా ఇండియన్ ఐడల్ సీజన్ 12లోకి అడుగుపెట్టాను.
ఇంటి బరువు ఇప్పుడు నేను మోస్తా..
స్థాయి, ప్రాంతం భేదం లేకుండా ప్రతిభ ఉన్న ఎందరికో అవకాశమిచ్చిందీ వేదిక. ఇక్కడ ప్రదర్శన అనగానే తొలుత వణికిపోయాను. కానీ ఇక్కడ టైటిల్ గెలవడమే నా లక్ష్యం కాబట్టి ధైర్యం తెచ్చుకుని మరీ పాడాను. సీజన్‌లో తొలి గోల్డెన్ మైక్ నాకే దక్కింది. అదే నాకు ప్రత్యేక గుర్తింపు. ఆ తర్వాత ఎక్కడా తగ్గకుండా టాప్ 10లో నిలిచాను. ఎందరో అభిమానుల ఓట్లతో రన్నరప్‌గా నిలిచాను. అయితే మాకోసం నాన్న పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఆయన కోసమైనా గెలవాలనే కసితో పాడాను. ఇక్కడ గెలిచి ఓ మంచి ఇల్లు కట్టడం, కారు కొనడం, మంచి బట్టలు కొనివ్వడం చేయాలనుకున్నాను. వాళ్లకు ఉన్నత జీవనాన్ని అందించి ఇకపై నేనే కష్టపడాలని నిర్ణయించుకుని పాడా. మా నాన్న శ్రమ గుర్తు పెట్టుకోవాలనే ప్రముఖ కంపోజర్ ఆనంద్ నాకు ‘శైలీ కిషోర్ కాంబ్లే’గా పేరు మార్చారు. ఇండియన్ ఐడల్‌లో నాకు దక్కిన గుర్తింపుతో ఇప్పుడు బాలీవుడ్‌లో అవకాశాలొస్తున్నాయి. మరాఠీ సినిమాల్లో పాడుతున్నాను. ఇకపై మా ఇంటి బాధ్యత, బరువు నేనే మోస్తా. ఇంత తక్కువ సమయంలో గెలుపు నన్ను చేరడానికి నాన్న కష్టమే కారణమని చెబుతా.
ఇదీ చదవండి: HYPERACTIVE KIDS: అల్లరి గడుగ్గాయిలను అదుపు చేద్దామిలా..!