ల్యాప్‌టాప్.. ప్రస్తుత కాలంలో దీని ఉపయోగం పెరిగింది. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేందుకు, విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు వినేందుకు... ఇలా చాలా అవసరాలను కంప్యూటర్ అవసరం ఉంటోంది. ల్యాప్‌టాప్‌కు ఉన్న అనుకూలతల దృష్ట్యా వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
రూ.15వేల నుంచి లక్షల రూపాయాల వరకు ల్యాప్‌టాప్‌లు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఫీచర్లు, హార్డ్‌వేర్‌ను బట్టి వీటి ధరల్లో మార్పు ఉంటుంది. బడ్జెట్‌తో పాటు ఉపయోగాన్ని దృష్టిలో ఉంచుకొని ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవాలి. సాంకేతికంగా కూడా వీటిని కొనుగోలు చేసే సమయంలో పలు విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
వీడియో ఎడిటింగ్, గేమ్స్ లాంటి హై ఎండ్ ఉపయోగం నుంచి మొదలుకొని.. నెట్ బ్రౌజింగ్ లాంటి చిన్న చిన్న కార్యకలాపాలను ల్యాప్‌టాప్‌లో నిర్వహించాల్సి ఉంటుంది. హై ఎండ్ ఉపయోగం ఉన్న వారు మంచి దానిని తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో చిన్న చిన్న పనులు కోసం అయితే తక్కువ స్థాయిలో తీసుకున్నా సరిపోతుంది.
ప్రాసెసర్
ల్యాప్‌టాప్ ముఖ్యమైన భాగాల్లో ప్రాసెసర్ అనేది చాలా కీలకం. ఇది ఎంత ఎక్కువ స్పీడ్ ఉండే అంత మంచిది. మంచి ప్రాసెసర్ మల్టీ టాస్కింగ్‌ను సమర్థంగా నిర్వహిస్తుంది. ఇంటెల్, ఏఎండీలు కంప్యూటర్ ప్రాసెసర్లను తయారు చేస్తున్న ప్రధాన కంపెనీలు. ఇంటెల్‌లో ఐ3, ఐ5, ఐ7 ప్రాసెసర్లు ఉన్నాయి. వీటిలో జనరేషన్ మారుతుంటుంది. ప్రస్తుతం 11వ జనరేషన్ ప్రాసెసర్లను ఇంటెల్ విడుదల చేసింది. ఏఎండీ లో కూడా పలు రకాల ప్రాసెసర్లు ఉన్నాయి. ఇంటెల్ ప్రాసెసర్లను తీసుకుంటే ఐ7 హెవీ టాస్క్‌లను హ్యాండిల్ చేయగలదు. అదే సమయంలో ఐ3 తక్కువ టాస్క్‌లను హ్యాండిల్ చేయగలదు.
మెమోరీ
రోజు వారీ ఉపయోగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మంచి మెమోరీ సరిపడేంత ఉండాలి. ఒకప్పుడు హెచ్డీడీ(హార్డ్ డిస్క్ డ్రైవ్) మెమోరీలు మాత్రమే ల్యాప్‌టాప్‌లలో వచ్చేవి. ఇప్పుడు ఎస్ఎస్డీ(సాలిడ్ స్టేట్ డ్రైవ్)లు వస్తున్నాయి. హెచ్డీడీ అనేది డిస్క్ ఆధారిత టెక్నాలజీ. ఎస్ఎస్డీలో పోల్చితే రీడ్, రైట్స్పీడ్లు తక్కువగా ఉంటాయి. ఎస్ఎస్డీ అనేది మెమోరీ కార్డ్‌ను పోలి ఉంటుంది. ఇందులో రీడ్, రైట్‌స్పీడ్ లు ఎక్కువగా ఉంటాయి. హెచ్డీడీ కంటే ఎస్ఎస్డీని ఎంచుకోవటం ఉత్తమం. ఎస్ఎస్డీలో సాంకేతికలపరంగా తేడా ఉంది. వీటిని గమనించి ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవాలి.
ర్యామ్
మల్టీ టాస్కింగ్ కోసం ఇది చాలా ముఖ్యమైనది. ర్యామ్ తక్కువగా ఉన్నట్లయితే ఒకే సారి ఎక్కువ అప్లికేషన్లను ఉపయోగించే వీలు ఉండదు. వీడియో ప్రాసెసింగ్ లాంటి వాటి కోసం ల్యాప్‌టాప్ వాడుతున్న వారు అయితే తప్పకుండా ఎక్కువ ర్యామ్ తీసుకోవాలి. చిన్న చిన్న అవసరాల కోసం తీసుకునే వారు అయితే తక్కువగా ఉన్నది అయినా సరిపోతుంది. అన్నీ స్థాయిల్లో ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ ఎక్కువగా 8 జీబీ, 16 జీబీ ర్యామ్ ఉన్నవే విక్రయం అవుతున్నాయి.
బ్యాటరీ
ల్యాప్‌టాప్ పోర్టబుల్‌గా ఉంటుంది. ఎక్కడైనా దీనిని ఉపయోగించుకోవచ్చు కాబట్టి బ్యాటరీ లైఫ్ అనేది చాలా ముఖ్యం. కొంతకాలం కిందట ఇవి ఒక్క పూర్తి ఛార్జితో నాలుగు, ఐదు గంటలు పనిచేసేవి. అయితే ఇప్పుడు 9 గంటల వరకు నడిచే ల్యాప్‌టాప్‌లు మార్కెట్లో ఉన్నాయి. పర్ ఫార్మెన్స్‌తో పాటు బ్యాటరీ లైఫ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
ఓఎస్
లాప్‌టాప్‌లు దీని ఆధారంగానే పనిచేస్తాయి. ఇవి ఒక్కొక్కటి వేరువేరుగా ఉంటాయి. మ్యాక్ ఓఎస్ ధర ఎక్కువగా ఉంటుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న దాని ధర కొంచెం తక్కువగా ఉంటుంది. ఓపెన్ సోర్స్ ద్వారా లభించే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ల్యాప్‌టాప్‌ల ధర తక్కువగా ఉంటుంది. విండోస్ తీసుకుంటే అందులో 10, 8, 7 అనే రకాలు ఉన్నాయి. లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎంచుకోవటం ఉత్తమం.
స్క్రీన్ సైజు
ల్యాప్‌టాప్ సైజు అనేది సాధారణంగా దాని స్ర్కీన్ సైజు మీద ఆధారపడి ఉంటుంది. ఫుల్ హెచ్డీ, హెచ్డీ... ఇలా పలు రకాల రెజల్యూషన్లతో, స్ర్కీన్లతో ఉన్న ల్యాప్‌టాప్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కువగా 14 ఇంచుల్లో ఉండే దానిని ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే వాటి కంటే చిన్న సైజులో కూడా అందుబాటులో ఉన్నాయి. స్ర్కీన్సైజు తగ్గుతున్న కొద్ది ధర కొంచెం పెరుగుతుంది. వీటింతో పాటే టచ్ స్ర్కీన్ ల్యాప్‌టాప్‌లు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. వీటినే ట్యాబ్గా మార్చుకునే వెసులుబాటు ఉంది. వీటినే 2 ఇన్ 1 లు అంటారు.
గ్రాఫిక్స్
గ్రాఫిక్స్ అనేది అన్ని రకాల అవసరాలకు తప్పనిసరి కాకపోవచ్చు. వీడియో ఎడిటింగ్, గేమింగ్ తదితర హైఎండ్ అవసరాల కోసం డెడికేటెడ్ గ్రాఫిక్కార్డ్ అవసరం. సాధారణ కార్యకలాపాల కోసం గ్రాఫిక్స్ అంతగా అవసరం ఉండకపోవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఇతర అంశాలు..
యూఎస్బీ, హెచ్డీఎంఐ, టైప్‌సీ... ఇలా తదితర పోర్ట్‌లు ల్యాప్‌టాప్‌కు ఉంటాయి. వీటి సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. అయితే ల్యాప్‌టాప్‌ను సౌకర్యంగా చేసేందుకు పోర్ట్‌ల సంఖ్య గతంతో పోల్చితే కంపెనీలు ఇప్పుడు బాగా తగ్గించాయి.
ఇదీ చూడండి: షియోమీ నుంచి అదిరే ల్యాప్‌టాప్‌లు, కొత్త ఫోన్లు