భారీ అంచనాల నడుమ.. భారత్‌లో టెక్ దిగ్గజం యాపిల్ ఆన్లైన్ స్టోర్‌ను బుధవారం ప్రారంభించింది. దీనితో భారత వినియోగదారులు నేరుగా యాపిల్ ఉత్పత్తులను.. అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది.
ఇప్పటివరకు యాపిల్ ఉత్పత్తులను థర్డ్ పార్టీ రీసెల్లర్లు, ఈ-కామర్స్ సైట్లలో కొనేందుకు వీలుంది.
దేశంలో ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించిన నేపథ్యంలో యాపిల్ ఉత్పత్తుల విక్రయానికి పలు ఆకర్షణీయమైన ఆఫర్లు తీసుకొచ్చింది.
క్యాష్‌బ్యాక్..
ఆన్లైన్ స్టోర్ ప్రారంభం సందర్భంగా.. యాపిల్ వినియోగదారులకు ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. రూ.20,900లకు పైగా జరిపే కొనుగోలులకు 6 శాతం (గరిష్ఠంగా 10,000) క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. అయితే హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ ద్వారా జరిపే చెల్లింపులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అక్టోబర్ 16 వరకు ఒక కార్డుకు ఒకసారి మాత్రమే ఆఫర్ వర్తిస్తుందని యాపిల్ తెలిపింది.
మల్టిపుల్ పేమెంట్స్, ఈఎంఐ సదుపాయాలు..
యాపిల్ ఆన్లైన్ స్టోర్‌లో చెల్లింపులకు క్రెడిట్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, రూపే కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఆన్ డెలివరీ వంటి సదుపాయాలు ఉన్నాయి. నో-కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది. తమ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డు ఆధారంగా ఈఎంఐలను లెక్కించుకునేందుకు యాపిల్ వెబ్సైట్లో ప్రత్యేక సదుపాయం ఉంది.
అన్ని రకాల ఉత్పత్తుల ఆర్డర్లను ఉచితంగా, కరోనా నేపథ్యంలో కాంటాక్ట్‌లెస్‌గా చేయనున్నట్లు స్పష్టం చేసింది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్..
యాపిల్ వెబ్సైట్ ద్వారా కొత్త ఐఫోన్ కొనాలనుకునే వారికి ఎక్స్ఛేంజి ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఐఫోన్‌తో పాటు ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లోనూ ఈఎంఐ సదుపాయం వినియోగించుకునే వీలుంది.
ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ మోడల్‌కు గరిష్ఠంగా రూ.35,000, ఐఫోన్ ఎక్స్ఆర్ మోడల్‌కు రూ.24,000 ట్రేడ్ ఇన్ వ్యాల్యూ ఇస్తోంది యాపిల్. ఏ బ్రాండ్లు, మోడళ్లు ఈ ఆఫర్ కిందకు వస్తాయో.. పూర్తి జాబితా యాపిల్ వెబ్సైట్లో ఉంది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఎంపిక చేసుకున్న వినియోగదారులు.. బ్రాండ్ వివరాలు, ఫోన్ కండీషన్ వంటి పలు వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది.
విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రత్యేక ఆఫర్లు..
ఎవరైనా వినియోగదారుడు విద్యా సంబంధిత అవసరాలకు యాపిల్ డివైజ్‌లు కొనుగోలు చేస్తే వారికి అదనపు డిస్కౌంట్లు వర్తిస్తాయని యాపిల్ ప్రకటించింది. అధికారిక వైబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసే విద్యార్థులు, ఉపాధ్యాయులు కొత్త మ్యాక్పై రూ.23,990 వరకు.. ఐప్యాడ్‌పై రూ.7,445 వరకు డిస్కౌంట్ పొందే వీలుందని తెలిపింది.
వినియోగదారులు తమ అవసరాల ఆధారంగా మెమొరీ స్టోరేజీ, గ్రాఫిక్ కార్డ్ వంటివి ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవచ్చు.
పండుగ సీజన్ నేపథ్యంలో ఎంపిక చేసిన ఉత్పత్తులపై ప్రత్యేక సిగ్నేచర్ గిఫ్ట్ వ్రాప్ వంటివి ఇవ్వనున్నట్లు పేర్కొంది యాపిల్. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ సహా పలు ఇతర ప్రాంతీయ భాషల్లో ప్రత్యేక ఎమోజీలు కూడా ఇవ్వనుంది.
ఫ్రీ ఆన్లైన్ సెషన్..
వినియోగదారులు తాము కొనుగోలు చేసిన ఉత్పత్తులకు సంబంధించి, కాన్ఫిగరేషన్, నిపుణుల సలహాలు ఉచితంగా పొందే వీలు కల్పిస్తున్నట్లు యాపిల్. యాపిల్ ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత వీలున్న సమయైలో ఈ సెషన్‌ను పెట్టుకునే వీలు కూడా ఉంది.
ఫొటో ఎడిటింగ్, ప్రైవసీ డేటా ట్రాన్స్ఫర్ వంటివి ఇందులో ఉన్నాయి. ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఈ సెషన్ అందుబాటులో ఉంటుంది.
యాపిల్ ప్లస్ కేర్..
యాపిల్ ఉత్పత్తులపై రెండేళ్ల వరకు వారంటీ, టెక్నికల్ సపోర్ట్, యాక్సిడెంటల్ డ్యామేజ్ కవర్ వంటివి అందించే సదుపాయమే ఈ యాపిల్ ప్లస్ కేర్.
అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే.. డ్యామేజీ కవర్ పరిమిత మొత్తానికి మాత్రమే వర్తిస్తుంది. యాపిల్ ప్రోడక్ట్‌ను పోగొట్టుకోవడం, చోరీకి గురవడం వంటివి జరిగితే వాటికి కవరేజీ వర్తించదు.
ఇదీ చూడండి:వ్యవసాయ మార్కెటింగ్‌లో అంకురాలు... వినూత్న మార్గాలతో విజయాలు