స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్లో చంద్రుడి మీదకు వెళ్లేందుకు ఎనిమిది మందిని ఆహ్వానించారు జపాన్ సంపన్నుడు యుసాకు మిజవా. ఇందుకోసం ఓ కాంటెస్ట్ ప్రారంభించారు. పోటీలో గెలిచిన వారి యాత్రకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరించనున్నట్లు తెలిపారు. ఇందులో ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి ఎంపిక ప్రక్రియ గురించి ఈ మెయిల్ వస్తుందని వివరించారు.
"అన్నిరకాల నేపథ్యం ఉన్న ప్రజలను తీసుకెళ్లాలని అనుకుంటున్నా. మొత్తం 10, 12 మంది ఉంటారు. కానీ నాతో పాటు ఎనిమిది మందిని ఆహ్వానిస్తున్నా. ఈ యాత్ర కోసం మొత్తం ఖర్చులు నేనే చెల్లిస్తా. అన్ని సీట్లు నేను తీసుకున్నా. ఇది ఒక ప్రైవేట్ రైడ్."
-యుసాకు మిజవా, జపాన్ బిలియనీర్
ప్రపంచంలోని 6-8 మంది కళాకారులను తనతో పాటు చంద్రునిపైకి తీసుకెళ్తానని గతంలోనే వెల్లడించారు మిజవా. ఆరు రోజుల పాటు ఈ చంద్రుని యాత్ర కొనసాగనుంది. తిరిగి వచ్చిన తర్వాత యాత్రకు సంబంధించి వినూత్న కళాఖండాలను రూపొందించేలా ప్రయత్నిస్తామని చెప్పారు. జపాన్‌లో అతిపెద్ద ఫ్యాషన్ రిటైలర్ అయిన 'జోజోటౌన్'ను స్థాపించింది ఈయనే. చంద్రుడిపైకి వెళ్లేందుకు తనకు ఓ గర్ల్ ఫ్రెండ్ కావాలని అప్పట్లో ప్రకటన సైతం ఇచ్చారు మిజవా.
ఇదీ చదవండి: చంద్రయాన్‌కు కుబేరుడి ప్లాన్- గర్ల్ ఫ్రెండ్ కోసం వేట
ఈ ప్రాజెక్టుకు 'డియర్ మూన్' అని పేరు పెట్టారు. 2023లో ఈ మిషన్‌ను చేపట్టనున్నారు. స్టార్ షిప్ రాకెట్లో చంద్రుడి మీదకు వెళ్లే తొలి ప్రయాణికుడిగా మిజవా పేరును 2018లోనే ప్రకటించారు ఎలాన్ మస్క్. ఇది సాకారమైతే 1972 తర్వాత తొలి చంద్రుని యాత్రగా రికార్డుకెక్కనుంది.
ఇదీ చదవండి: నలుగురితో స్పేస్ఎక్స్ తొలి అంతరిక్ష యాత్ర