కరోనాపై పోరులో భాగంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మూడు రకాల వెంటిలేటర్లను తయారు చేసింది. ప్రాణ, వాయు, స్వాస్థ పేర్లతో వీటిని అభివృద్ధి చేసింది. ఈ వెంటిలేటర్లను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు గానూ సాంకేతిక బదిలీకి ముందుకొచ్చింది.
వెంటిలేటర్ 'ప్రాణ'
ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లేలా తక్కువ ధరతో ఈ వెంటిలేటర్‌ను తయారు చేసింది. 'ప్రోగ్రామబుల్ రెస్పిరేటరీ అసిస్టెన్స్ ఫర్ ద నీడీ ఎయిడ్' పేరుతో దీన్ని రూపొందించింది. ఈ పేరు సంక్షిప్త రూపమే 'ప్రాణ'.
అధునాతన నియంత్రణ వ్యవస్థ, ఎయిర్‌వే ప్రెజర్ సెన్సార్లు, ఆక్సిజన్ సెన్సార్లు, పీప్(పాజిటివ్ ఎండ్ ఎక్పిరేటరీ ప్రెజరీ) కంట్రోల్ వాల్వ్ వంటి ఫీచర్లు ఈ వెంటిలేటర్లో ఉన్నాయి. రోగికి అవసరమైన మోతాదులో ఆక్సిజన్‌ను ఇది అందిస్తుంది. విద్యుస్ సమస్యలు ఏర్పడినప్పుడు ఇతర బ్యాటరీలను దీనికి అనుసంధానించే వీలు ఉంటుంది. వెంటిలేటర్ సరిగా అమర్చకపోతే హెచ్చరించే అలారం వ్యవస్థ సైతం ఇందులో ఉంది.
వాయు
వెంటిలేషన్ అసిస్ట్ యునిట్ పేరుతో ఐసీయూ గ్రేడ్ మెకానికల్ వెంటిలేటర్‌ను తయారు చేసింది ఇస్రో. సెంట్రిఫ్యుగల్ బ్లోవర్ అనే విధానంపై ఇది ఆధారపడి పనిచేస్తుంది. శుద్ధి చేసిన గాలిని ఇది గ్రహించి.. రోగికి అందిస్తుంది. ఎలాంటి కంప్రెసింగ్ సోర్స్ లేకుండానే ఇది పనిచేస్తుంది.
స్వాస్థ
స్పేస్ వెంటిలేటర్ ఎయిడెడ్ సిస్టమ్ ఫర్ ట్రామా అసిస్టెన్స్(స్వాస్థ) పేరుతో తయారు చేసిన ఈ వెంటిలేటర్ అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందని ఇస్రో తెలిపింది. ప్రయాణిస్తున్న వాహనాలు, అంబులెన్సులలో వినియోగించేందుకు ఇది ఉపకరిస్తుందని వెల్లడించింది. సాధారణ డిజైన్‌తో, సులభంగా దొరికే పరికరాలతో దీన్ని రూపొందించింది.
ఈ వెంటిలేటర్ల సాంకేతికతను ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, అంకురాలకు అందించనున్నట్లు తెలిపింది. ఆసక్తి కలిగిన సంస్థలు, వ్యక్తులు జూన్ 15లోగా తమను సంప్రదించాలని సూచించింది.
ఇదీ చదవండి- శత్రువులకు ధీటుగా 'ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్'