How To Enable The Speedometer In Google Maps : చాలా మంది డ్రైవర్లు.. ఏదో ఒక సందర్భంలో స్పీడ్ లిమిట్ దాటి చలాన్ కట్టే ఉంటారు. ఇది ఆర్థికంగా ఇబ్బంది కలిగించే అంశం. అందుకే గూగుల్ మ్యాప్స్ రహదారి భద్రతను పెంపొందించడం కోసం, అలాగే డ్రైవర్లకు అసిస్టెన్స్ అందించడం కోసం స్పీడోమీటర్ అనే సూపర్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది డ్రైవర్లకు రియల్-టైమ్‌లో స్పీడ్‌లిమిట్ సమాచారాన్ని అందిస్తుంది. కనుక నిర్దిష్ట వేగానికి మించి వాహనం నడపకుండా డ్రైవర్లు జాగ్రత్త పడడానికి వీలవుతుంది.
ట్రాఫిక్ రూల్స్ మారుతూ ఉంటాయ్!
వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. ముఖ్యంగా హైవేల్లో కాస్త వేగంగా వాహనం నడపవచ్చు. కానీ లోకల్ రోడ్లపై వేగం తగ్గించుకుని వెళ్లాల్సి ఉంటుంది. అయితే కొన్ని సార్లు హైవే నుంచి లోకల్ రోడ్లపైకి వచ్చినప్పుడు స్పీడ్ లిమిట్ విషయాన్ని డ్రైవర్లు గమనించలేకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో అనవసరంగా చలాన్ కట్టాల్సి వస్తుంది.
ప్రాంతీయ నిబంధనలతో సమస్య!
నిర్మాణాలు జరిగే ప్రాంతాల్లో.. తాత్కాలికంగా స్పీడ్ లిమిట్స్ విధిస్తూ ఉంటారు. ముఖ్యంగా సదరు ప్రాంతంలో పనిచేసే కార్మికులకు, అలాగే డ్రైవర్లకు భద్రత కల్పించడం కోసం ఇలాంటి టెంపరరీ స్పీడ్ లిమిట్స్‌ను అమలు చేస్తూ ఉంటారు. అయితే రాత్రి సమయాల్లో, వాతావరణం బాగాలేని సందర్భాల్లో.. డ్రైవర్లు ఇలాంటి విషయాలను గమనించలేకపోవచ్చు. అందుకే గూగుల్ మ్యాప్స్.. స్పీడోమీటర్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ స్పీడో మీటర్ డ్రైవర్లకు నావిగేషన్ అసిస్టెన్స్‌ను అందిస్తుంది. అంటే రియల్‌టైమ్‌లో సదరు ప్రాంతంలో ఎంత వేగంతో వాహనం నడపాలో డ్రైవర్లకు తెలియజేస్తుంది. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
స్పీడోమీటర్ ఫీచర్ వాడడం ఎలా?
How To Enable Speedometer In Google Maps :
- ముందుగా మీ ఆండ్రాయిడ్ డివైజ్‌లోని Google Maps యాప్‌ను ఓపెన్ చేయండి.
- మీ ప్రొఫైల్ పిక్చర్ లేదా ఇనీషియల్పై క్లిక్ చేయండి.
- డ్రాప్‌డౌన్ మెనూలో మీకు Settings ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
- అక్కడ మీకు Navigation Settings ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
- వెంటనే మీకు Driving Options కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే, మీకు వివిధ డ్రైవింగ్ ఫీచర్లు కనిపిస్తాయి.
- ఈ డ్రైవింగ్ ఆప్షన్లలోనే Speedometer ఫీచర్ కూడా ఉంటుంది. దానిని మీరు ON చేసుకోవాలి. అంతే సింపుల్!
ఇకపై మీకు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసిన ప్రతిసారీ.. మీ GPS స్పీడ్ ఎంతు ఉంది అనేది తెలుస్తుంది. అంతేకాదు మీరు స్పీడ్ లిమిట్ దాటి వాహనాన్ని నడుపుతూ ఉంటే.. మీకు అలెర్ట్ కూడా ఇస్తుంది. దీనితో మీరు పరిమిత వేగంతో వాహనాన్ని నడపడానికి వీలవుతుంది.
ఇంతకీ స్పీడోమీటర్ ఎలా పనిచేస్తుంది?
How Speedometer Works : గూగుల్ మ్యాప్స్‌లోని స్పీడోమీటర్ ఫీచర్ పూర్తిగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో పనిచేస్తుంది. కనుక ఇది స్ట్రీట్ వ్యూ ఇమేజరీ (రహదారి చిత్రాలు) సహా, థర్డ్-పార్టీ చిత్రాలను పరిశీలించి, జీపీఎస్ సమాచారాన్ని విశ్లేషించి, సదరు ప్రాంతంలోని వాహన వేగం (స్పీడ్ లిమిట్) ఎంత ఉండాలనేది డ్రైవర్లకు తెలియజేస్తుంది. అంతేకాదు వాహనం వెళ్లాల్సిన ప్రాంతంలో ట్రాఫిక్ ఎలా ఉంది. అక్కడ ఎంత వేగంతో ప్రయాణించాలి? అనే విషయాలను కూడా తెలియజేస్తుంది.
'ఈ స్పీడోమీటర్ ఫీచర్ కేవలం డ్రైవర్లకు మాత్రమే కాదు.. వాహన తయారీ సంస్థలకు కూడా ఉపయోగపడుతుందని.. ముఖ్యంగా సరికొత్త డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి ఇది సహాయకారిగా ఉంటుంది' అని గూగుల్ చెబుతోంది.