లగ్జరీ గాడ్జెట్స్ తయారీ సంస్థ యాపిల్.. మార్కెట్లోకి తన కొత్త ఉత్పత్తులను విడుదల చేసే ముందు ఓ భారీ ఈవెంట్ (Apple Event 2021) నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి 'కాలిఫోర్నియా స్ట్రీమింగ్' పేరుతో మంగళవారం ఆ మెగా ఈవెంట్‌ను నిర్వహించింది.
ఈ ఈవెంట్లో ఐఫోన్ లవర్స్ ఎంతగానో ఎదురుచూసిన ఐఫోన్ 13ను (Apple Iphone 13) యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఆవిష్కరించారు. ఈ ఫోన్ గులాబీ రంగులో ఉంది. కెమెరా లెన్స్‌లను 'ఐ' మూలగా ఏర్పాటు చేసి ఫోన్ వెనక భాగానికి కొత్త రూపు తెచ్చింది. ఫేస్ ఐడీ సెన్సర్లను తక్కువ స్థలంలో అమర్చింది. ఫోన్ కెమేరాలో కొత్తగా సినిమాటిక్ మోడ్ ఉంది. డాల్బీ విజన్ హెచ్‌డీఆర్‌లో షూట్ చేయవచ్చు. మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్‌నూ ఇవి సపోర్ట్ చేస్తాయి. ఐఫోన్ 13 సిరీస్‌లో ఐఫోన్ 13 మినీ; ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్‌లను మంగళవారం అమెరికాలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రజల ముందుకు తెచ్చింది. వీటితో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 7, ఐప్యాడ్ మినీ, ఐప్యాడ్ 2021లనూ ఆవిష్కరించింది.
బ్యాటరీ అధిక సామర్థ్యం..
ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13లు 5.4; 6.1 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉన్నాయి. ఈ ఫోన్లన్నీ తాజా ఏ15 బయానిక్ ప్రాసెసర్‌తో వచ్చాయి. ఐఫోన్ 12 ప్రోతో పోలిస్తే ఐఫోన్ 13 ప్రో బ్యాటరీ గంటన్నర; 13 ప్రోమాక్స్ బ్యాటరీ రెండున్నర గంటలు ఎక్కువగా పనిచేయనుంది.అన్ని ఫోన్ల మెమొరీ 128 జీబీ నుంచి మొదలవుతుంది.
ధర ఎంతంటే?
ఐఫోన్ 13 ధర 699 డాలర్ల నుంచి; 13 ప్రో 999 డాలర్లు; 13 ప్రోమాక్స్ 1099 డాలర్ల నుంచి ప్రారంభమవుతున్నాయి.
భారత్‌లో ఎప్పుడో?
ఈనెల 17 నుంచి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు.. 24 నుంచి అందుబాటులోకి వస్తాయి. ఐఫోన్ 13 మినీ రూ.69,900, 13 రూ.79,900, 13 ప్రో రూ.1,19,900, 13 ప్రో మ్యాక్స్ రూ.1,29,900 నుంచి ప్రారంభమవుతాయి.
యాపిల్ వాచ్ సిరీస్ 7..
ఈ వాచ్ డిస్‌ప్లేను పూర్తిగా మార్చారు. కొత్త తెర పెద్దగా, మరింత టెక్స్ట్‌ను చూపించడానికి వీలుంది. పూర్తి స్థాయి కీబోర్డును సపోర్ట్ చేయనుంది. ఈ వాచ్‌లు అయిదు రంగుల్లో లభించనున్నాయి. 399 డాలర్ల నుంచి వీటి ధరలు ప్రారంభమవుతాయి.
ఇవీ చదవండి: