ఉగాది పండుగ తెలుగు వారికి చాలా ప్రత్యేకం. షడ్రుచుల సమ్మేళనంతో పాటు రకరకాల వంటకాలు చేయాలనుకుంటారు. కొత్త సంవత్సరం నాడు ఏం చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి చూసేద్దామా...!
గసగసాల పాయసం..
కావల్సినవి..
- గసగసాలు- పావు కప్పు
- పచ్చి కొబ్బరి తురుము- ముప్పావు కప్పు
- తురిమిన బెల్లం- అర కప్పు
- సన్నగా కట్ చేసుకున్న డ్రైఫూట్స్ - పావు కప్పు
- యాలకులు - ఒకటి లేదా రెండు
- నెయ్యి- మూడు టేబుల్ స్పూన్లు
తయారీ
- బాణలిలో స్పూన్ నెయ్యి వేసి, గసగసాలు కాస్త రంగు మారే వరకూ వేయించాలి. వేగిన గసగసాలను పక్కకు తీసి, అదే బాణలిలో డ్రైఫ్రూట్స్ వేయించుకోవాలి. గార్నిష్ కోసం ఒక టీస్పూను డ్రైఫ్రూట్స్‌ని పక్కన పెట్టుకోవాలి.
- వేయించిన గసగసాలు, డ్రైఫ్రూట్‌లను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా మెదిగాక, ఇందులో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.
- యాలకులను పొడిచేసి పెట్టుకోవాలి.
- పావు కప్పు నీటిలో తురిమిన బెల్లాన్ని కలిపి, లేత పాకం తయారయ్యే వరకూ మరిగించాలి.
- పాకం తయారవగానే ఇందులో గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని, యాలకుల పొడిని, నేతిని కలిపి చిక్కబడేవరకూ కలుపుతూ ఉండాలి.
- చిక్కబడగానే డ్రైఫ్రూట్ పలుకులతో గార్నిష్ చేస్తే.. వేడి వేడి గసగసాల పాయసం రడీ..!
పల్లీ బొబ్బట్లు
కావల్సినవి..
- గోధుమ పిండి- రెండు కప్పులు
- నూనె/నెయ్యి - ఆరు టేబుల్ స్పూన్లు
- ఉప్పు - చిటికెడు
- పల్లీలు - ఒక కప్పు
- నువ్వులు - పావు కప్పు
- గసగసాలు - రెండు టీస్పూన్లు
- తురిమిన బెల్లం- ముప్పావు కప్పు
- యాలకుల పొడి- పావు టీస్పూను
తయారీ..
- గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు, మూడు టేబుల్ స్పూన్ల నూనె/నెయ్యి వేసి, కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ.. చపాతీ పిండిలా కలపాలి.పైన నూనె/ నెయ్యి రాసి మూతపెట్టి అరగంట పాటు నానబెట్టాలి.
- బాణలిలో పల్లీలు, నువ్వులు, గసగసాలు విడివిడిగా వేయించుకోవాలి.
- వీటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులో బెల్లపు తురుము, యాలకుల పొడి వేసి, బాగా కలిసే వరకూ మళ్లీ గ్రైండ్ చేసుకోవాలి.
- కొద్దిగా పాలు పోసి, ఈ పిండిని గుండ్రటి ముద్దలుగా చేసుకోవాలి.
- గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి అరచేతి వెడల్పున ఒత్తుకోవాలి.
- వీటిలో పల్లీ పొడి ముద్దలను స్టఫ్ చేసి, అంచులను మూయాలి.
- వేళ్లకు నెయ్యి/ నూనె రాసుకుంటూ ఈ ఉండలను గుండ్రంగా ఒత్తుకోవాలి.
- స్టౌ మీడియంలో ఉంచి, వీటిని నూనె/నేతితో కాల్చాలి.
రుచితో పాటు ఆరోగ్యాన్నీ ఇచ్చే కర్ణాటక స్పెషల్ 'శెన్గ హోళిగె ' అదే.. పల్లీ బొబ్బట్లు సిద్ధం.!
అరటిపండు బోండా
కావల్సినవి
- అరటి పండు - ఒకటి
- గోధుమపిండి - అర కప్పు
- బొంబాయి రవ్వ- ముప్పావు కప్పు
- బెల్లపు తురుము - అర కప్పు
- యాలకుల పొడి - అర టీస్పూను
- బేకింగ్ సోడా - ముప్పావు టీస్పూను
- నూనె - వేయించడానికి సరిపడా
తయారీ..
- ముందుగా అరటిపండు, యాలకుల పొడి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
- పావుకప్పు నీళ్లలో తురిమిన బెల్లం వేసి, కరిగే వరకూ కలపాలి. దీన్ని పది నిమిషాలు స్టౌ మీద సన్నని మంటపై ఉంచి, లేత పాకం తయారు చేయాలి. పాకం కాస్త చల్లార్చి వడగట్టాలి.
- ఇందులో గోధుమ పిండి, బేకింగ్ సోడా, బొంబాయి రవ్వ, అరటి పండు గుజ్జు కలిపి, గంటపాటు నానబెట్టాలి.
- పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేస్తూ నూనెలో వేయించుకుంటే నోరూరించే బనానా బోండా రెడీ..!
మేతీ కార్న్ వడ
కావల్సినవి
- శెనగ పప్పు- అర కప్పు
- కంది పప్పు- అర కప్పు
- మెంతికూర - ఒక కప్పు
- స్వీట్ కార్న్- అర కప్పు
- పచ్చి మిర్చి- మూడు
- అల్లం- అంగుళం ముక్క
- కారం - అర స్పూను
- పసుపు - పావు స్పూను
- జీలకర్ర - అర స్పూను
- ఉప్పు - రుచికి తగినంత
- ఇంగువ - చిటికెడు
- కరివేపాకు- గుప్పెడు
- నూనె- వేయించడానికి సరిపడా
తయారీ..
- ముందుగా కంది పప్పు, శెనగపప్పు నాలుగు గంటలపాటు నానబెట్టాలి.
- నాలుగు గంటల తర్వాత నీటిని వడగట్టాలి.
- నానిన కంది పప్పు, శెనగపప్పు, పచ్చి మిరపకాయలు, అల్లం, జీలకర్ర కలిపి నీళ్లు పోయకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని బౌల్ లోకి తీసుకుని, ఇందులో తరిగిన మెంతికూర, పసుపు, కారం, ఇంగువ, ఉప్పు, స్వీట్ కార్న్, కరివేపాకు వేసి కలపాలి.
- బాణలిలో నూనె మరగనిచ్చి, తర్వాత స్టౌ మీడియం మంటలో ఉంచాలి.
- వడ పిండిని నిమ్మకాయంత పరిమాణంలో తీసుకుని, గుండ్రంగా చేయాలి.
- వాటిని ముని వేళ్లతో ఒత్తుకుని, వేయించుకోవాలి.
- వేయించిన వడలను టిష్యూ లేదా పేపర్ టవల్‌పై వేసుకుని నూనె కాస్త పీల్చుకోగానే.. వేడివేడిగా సర్వ్ చేయొచ్చు.
అల్లం - మామిడి చిత్రాన్నం
కావల్సినవి
- అన్నం - రెండు కప్పులు
- పచ్చి మామిడి తురుము- అర కప్పు
( పులుపు తక్కువ తినేవారు మామిడి తురుము తగ్గించాలి)
* అల్లం తురుము- టీస్పూను- అల్లం - అరంగుళం ముక్క
- జీడి పప్పు - రుచికి తగినన్ని
- మెంతులు - చిటికెడు
- ఉప్పు - రుచికి తగినంత
- నూనె/ నెయ్యి - తాలింపుకి సరిపడా
- ఆవాలు- తాలింపుకి సరిపడా
- జీలకర్ర - తాలింపుకి సరిపడా
- ఇంగువ - చిటికెడు
- పసుపు - చిటికెడు
- కరివేపాకు - రెండు రెబ్బలు
- కొత్తిమీర - గార్నిష్‌కి సరిపడా
- ఎండు మిర్చి- రెండు
తయారీ
- అన్నం పొడి పొడిగా వండుకోవాలి.
- బాణలిలో నూనె/నెయ్యి వేసి, జీడిపప్పు, సన్నగా గుండ్రంగా తరిగిన అల్లం విడి విడిగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. (అల్లం కరకరలాడేలా వేయించాలి)
- ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి, నిలువుగా తరిగిన పచ్చి మిరపకాయలు వేసి వేయించి, తర్వాత పసుపు, ఇంగువ వేయాలి.
- ఈ తాలింపుకి అల్లం తురుము, మామిడి తురుము, తగినంత ఉప్పు చేర్చి పచ్చిదనం పోయే వరకూ వేయించాలి.
- మామిడి తురుములోని నీరంతా ఇగిరి పోయి, తాలింపు నూనె కనిపించాక స్టౌ ఆపేసి కాస్త చల్లారనివ్వాలి.
- ఇందులో అన్నాన్ని కలిపి వేయించిన అల్లం ముక్కలు, జీడిపప్పు, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేస్తే అల్లం-మామిడి చిత్రాన్నం ఆస్వాదించడానికి రెడీ!
ఇదీ చదవండి: రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు