1. నువ్వుల పచ్చడి
కావాల్సినవి:
- నువ్వులు - కప్పు
- మినప్పప్పు - రెండు చెంచాలు
- ఆవాలు - చెంచా
- మెంతులు - పావుచెంచా
- ఎండుమిర్చి - ఆరు
- పచ్చిమిర్చి - ఐదు
- చింతపండు గుజ్జు - పావుకప్పు
- బెల్లం - వంద గ్రాములు
- నూనె - మూడు చెంచాలు
- ఉప్పు - తగినంత
తయారీ:
బాణలిలో నూనె లేకుండా నువ్వుల్ని వేయించుకుని ఓ గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. తరవాత నూనె వేడిచేసి మినప్పప్పూ, ఆవాలూ, మెంతులూ, ఎండుమిర్చిని వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో చింతపండు గుజ్జూ, బెల్లం తరుగూ, పచ్చిమిర్చీ, తగినంత ఉప్పూ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే ముందుగా వేయించిపెట్టుకున్న ఎండుమిర్చి పోపు కూడా వేసి మరోసారి రుబ్బుకోవాలి. చివరగా వేయించిన నువ్వులు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టి ఓ గిన్నెలోకి తీసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి గారెలూ, ఇడ్లీలూ, దోశల్లోకే కాదు చపాతీల్లోకీ బాగుంటుంది.
2. ముల్లంగి ఊరగాయ
కావాల్సినవి:
- ముల్లంగి - ఒకటి (తురమాలి)
- కారం - రెండు చెంచాలు
- ఆవపిండి - చెంచా
- మెంతిపిండి - పావు చెంచా
- ఉప్పు - తగినంత
- నూనె -పావుకప్పు కన్నా కొద్దిగా తక్కువగా
- పచ్చిమిర్చి - ఒకటి
- ఆవాలు, జీలకర్ర - రెండు కలిపి అరచెంచా
- నిమ్మకాయ - ఒకటి
తయారీ:
ముల్లంగి తురుముపై కొద్దిగా ఉప్పు చల్లి పక్కన పెట్టేయాలి. పదిహేను, ఇరవై నిమిషాలకు ఆ తరుమును గట్టిగా పిండేస్తే నీరంతా పోతుంది. ముల్లంగి నుంచి వచ్చే వాసన కూడా కొద్దిగా తగ్గుతుంది. ఈ తురుమును ఓ గిన్నెలోకి తీసుకుని నూనె, పచ్చిమిర్చి, నిమ్మరసం, తాలింపు గింజలు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత బాణలిలో నూనె వేడి ఆవాలు, జీలకర్ర వేయించి, పచ్చిమిర్చి కూడా వేయాలి. అవి కూడా వేగాక నూనెను పచ్చడిలో వేసి కలిపి చివరన నిమ్మరసం పిండితే సరిపోతుంది. నోరూరించే ముల్లంగి తురుము పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది.
3. కోడిగుడ్డు పచ్చడి
- కావాల్సినవి:
- కోడిగుడ్లు - డజను
- కారం - పావుకేజీ
- ఉప్పు - 200 గ్రాములు
- పసుపు - రెండు చెంచాలు
- మెంతులు, జీలకర్ర - చెంచా చొప్పున
- ఎండుమిర్చి - ఆరేడు
- చింతపండు - పావుకేజీ
- నూనె - పావుకేజీ
- వెల్లుల్లి రెబ్బలు - కొన్ని
తయారీ:
మెంతుల్ని వేయించి పొడిచేసుకోవాలి. కోడిగుడ్లను ఉడికించి పొట్టుతీసి నూనెలో వేయించి పెట్టుకోవాలి. ఓ పాత్రలో కారం, పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు, మెంతిపిండి, నూనె తీసుకుని బాగా కలపాలి. ఇప్పుడు వేయించిపెట్టుకున్న కోడిగుడ్లు వేసి మరోసారి కలపాలి. మిగిలిన నూనె వేడిచేసి ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్రతో తాలింపు పెట్టి.. పచ్చడిపై వేసి బాగా కలపాలి. చివరగా వెల్లుల్లిరెబ్బలు అలంకరిస్తే చాలు.. నిల్వ ఉండే కమ్మని కోడిగుడ్డు పచ్చడి సిద్ధం.
ఇదీ చదవండి: కూల్ కూల్ వేళ హాట్ 'టర్కిష్ సూప్' చేయండిలా...