అరటిపండు ఖనిజాల పండు అని వైద్యులు చెబుతుంటారు. పిల్లలకు రోజుకో అరటిపండు తినిపిస్తే ఆరోగ్యంగా ఉంటారు. మరి, ఆ అరటి పండుతోనే బ్రెడ్ చేసేస్తే.. అదిరిపోతుంది కదూ! ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేయండి...
కావాల్సిన పదార్థాలు
- అరటిపండ్లు - మూడు (రెండు మ్యాష్ చేసుకోవాలి, ఒకటి గుండ్రటి స్లైసుల్లా కట్ చేసుకోవాలి)
- గుడ్లు - 6
- మేపుల్ సిరప్ - 3 టేబుల్‌స్పూన్స్
- ఆల్మండ్ బటర్ - 3 టేబుల్‌స్పూన్స్
- వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ - టీస్పూన్
- కొబ్బరి పొడి - ముప్పావు కప్పు
- దాల్చిన చెక్క పొడి - ఒకటిన్నర స్పూన్
- బేకింగ్ సోడా - ముప్పావు టీస్పూన్
- జాజికాయ పొడి - పావు టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
తయారీ
ముందుగా ఓ గిన్నెలో మ్యాష్ చేసిన బనానాలు, గుడ్లు, మేపుల్ సిరప్, ఆల్మండ్ బటర్, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొబ్బరి పొడి, దాల్చిన చెక్కపొడి, బేకింగ్ సోడా, జాజికాయ పొడి, ఉప్పు కలిపి బాగా మిక్స్ చేసుకుని కేక్ బ్యాటర్‌లా తయారుచేసుకోవాలి. చివరగా కట్ చేసుకున్న బనానా ముక్కల్ని వేసి మెల్లగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న బ్యాటర్‌ని బేకింగ్ ట్రేలో పోసుకుని ఒవెన్‌లో 50-60 నిమిషాల పాటు 180 డిగ్రీల వద్ద బేక్ చేసుకోవాలి. ఆహా! అద్భుతమైన బనానా బ్రెడ్ సిద్ధమైంది.
ఇదీ చదవండి: 'అరటికాయ క్యారెట్ గారెలు' సింపుల్ రెసిపీ!