అసలే వర్షాకాలం.. ఆపై చల్లని వాతావరణం. ఇలాంటి సమయంలో వేడి వేడి వంటకాలు తినాలని అందరికీ అనిపిస్తుంది! మరి ఆయిల్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకొని అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే బదులు.. తక్కువ సమయంలో చేసుకోగలిగే నోరూరించే పెసరపప్పు సలాడ్ ట్రై చేయండి. ఈ వంటకం తయారు చేసే విధానం, తింటే కలిగే లాభాలపై ఓ లుక్కేయండి..
పెసరపప్పు సలాడ్: నానబెట్టి నీళ్లు తీసిన పెసరపప్పులో తురిమిన కొబ్బరి, క్యారెట్, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేయాలి. బాగా కలిపాక చివర్లో కొద్దిగ నిమ్మరసం పిండాలి. ఇలా చేసుకొని తినడం వల్ల చలవ చేస్తుంది. త్వరగా జీర్ణమవుతుంది. అధిక దాహాన్ని తగ్గిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
లాభాలెన్నో...
- ఒంట్లోని వేడిని, కఫాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్య ఉండదు. దీంట్లో విటమిన్-బి1, బి2 అధికంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పెసరపప్పును ఉడకబెట్టి, నానబెట్టి రెండు రకాలుగానూ వండుకోనే సౌలభ్యం ఉంది.
- ముఖ్యంగా కళ్లకు చాలా మంచిది. మిగతా పప్పుల్లా కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు ఉండవు. కొంతమందిలో మాత్రమే గ్యాస్ సమస్య ఎదురవుతుంది.
- పిండిపదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు, క్యాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, విటమిన్-ఎ1, బి1, బి2, పొటాషియం, సోడియంలాంటి పోషకాలెన్నో దీంట్లో ఉన్నాయి. మొలకెత్తిన పెసల్లో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.
- కలరా, చికెన్ పాక్స్, వైరల్ ఫీవర్‌లు వచ్చినప్పుడు కూడా దీన్ని ఇవ్వవచ్చు. ఇది నీరసాన్ని తగ్గించి శక్తిని అందిస్తుంది. చిన్న పిల్లలకూ మంచిది. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా తినే కచోరి తయారీలోనూ పెసర పప్పును ఎక్కువగా వాడతారు.
- డా. పెద్ది రమాదేవి, ఆయుర్వేద నిపుణులు