ఇలా కుక్కర్‌లో పెట్టి అలా నాలుగు విజిల్స్ వేయగానే దించేసే వంటకాలు కాదు దమ్ వంటకాలంటే. మంటనేరుగా తగలకుండా కింద పెనం, ఆపై మందపాటి హండీ(పాత్ర).. తక్కువ మంట మీద గంటలు తరబడి ఉడుకుతాయి. నిజంగా శ్రమే! అయితేనేం.. వంటకం అంతా అయిన తర్వాత ఆవిరిపోకుండా హండీలకు పకడ్బందీగా చుట్టిన గోధుమపిండి సీల్ తీస్తుంటే వచ్చే పరిమళం ఉంది చూశారూ..! ఆహా.. ఒక్కమాటలో చెప్పాలంటే అద్భుతః. ఆ పరిమళం, రుచి కోసమే దమ్ వంటకాలని తినాలనిపిస్తుంది. ఎంత శ్రమైనా చేయాలనిపిస్తుంది.
మరి ఈ రోజు.. హైదరాబాద్ సబ్జీ దమ్‌కీ బిర్యానీ తయారీని తెలుసుకుందాం.
గోధుమపిండి, బాస్మతీ బియ్యం, కాయతగూరలతో కమ్మని హైదరాబాద్ సబ్జీ దమ్‌కీ బిర్యానీ ఎలా చేయాలో తెలుసా? ఈ కింది చెప్పినవి పాటించి.. తయారు చేసుకోండి మరి.
కావాల్సినవి:
మసాలా1: బాస్మతి బియ్యం- 400గ్రా, కాయగూరముక్కలు- 400గ్రా, అల్లంవెల్లుల్లిపేస్ట్- 50గ్రా, ఉప్పు- తగినంత, కారం- 15గ్రా, పసుపు- 5గ్రా, నూనె- తగినంత
మసాలా2: షాజీరా- 5గ్రా, జీరాపొడి- 10గ్రా, ధనియాలపొడి- 10గ్రా, గరంమసాలా- 10గ్రా, కొత్తమీర తరుగు- నాలుగు చెంచాలు, పుదీనా తరుగు- రెండు చెంచాలు, దోరగా కరకరలాడేలా వేయించిన ఉల్లిపాయలు(బ్రౌన్ ఆనియన్)- 20గ్రా, పెరుగు- 100గ్రా, పచ్చిమిర్చి పేస్ట్- 15గ్రా
మసాలా3: గరంమసాలా: 10గ్రా, అల్లంవెల్లుల్లిపేస్ట్- 10గ్రా, ఉప్పు- తగినంత, పచ్చిమిర్చి- 4, పుదీనా తరుగు- 10గ్రా, కొత్తమీర తరుగు- 10గ్రా, పోట్లీ మసాలాపొడి- 10గ్రా,
మసాలా4: నెయ్యి- 50గ్రా, కుంకుమ పువ్వు- అరగ్రాము, బ్రౌన్ ఆనియన్- 25గ్రా, పుదీనా, కొత్తిమీర తరుగు- 10గ్రా, గోధుమపిండి- 100గ్రా
తయారీ:
గోధుమపిండిని చపాతీపిండిలా ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాస్మతి బియ్యాన్నీ పావుగంట ముందే నానబెట్టి ఉంచుకోవాలి. కాయగూరలని కొద్దిగా ఉడికించుకుని మసాలా1లో చెప్పిన దినుసులతో కాయగూరలని మారినేట్ చేసుకుని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి పాత్ర తీసుకుని అందులో మసాలా2లో చెప్పిన అన్ని దినుసులని వేసుకుని బాగా కలిపి మారినేట్ చేసిన కాయగూరలని కూడా వేసి కలుపుకోవాలి. ఒక లోతైన పాత్రలో రెండు లీటర్ల నీటిని వేసి మరిగించుకోవాలి. ఇందులో మసాలా3లో చెప్పిన దినుసులని కూడా వేసుకోవాలి. కాసేపటికి బియ్యం కూడా వేసి అన్నం సగం ఉడికిన తర్వాత ఆ అన్నాన్ని తీసుకుని మారినేట్ చేసిన కాయగూరలపై లేయర్లుగా వేసుకోవాలి. చివరి లేయర్‌గా చెప్పిన దినుసులని వేసి ఇత్తడిపాత్రపై పళ్లాన్ని ఉంచి గోధుమపిండితో సీల్‌మాదిరిగా వేసుకోవాలి. పొయ్యిమీద మందపాటి పెనం పెట్టి దానిపై ఈ ఇత్తడి పాత్ర ఉంచి పావుగంటపాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. పొయ్యి కట్టేసి పెనంమీద పదినిమిషాలపాటు అలానే ఉంచి అప్పుడు దించుకోవాలి.
నాన్‌వెజ్ ప్రియుల కోసం..
చిటికెలో నోరూరే వంట కావాలంటే గృహిణులు చూసేది కోడిగుడ్లవైపే..! మరెందుకు ఆలస్యం గుడ్లతో కొత్త వంటకాల కోసం ఇది క్లిక్ చేయండి. నోరూరించే ఎగ్ వెరైటీస్.. మీరూ ఓ లుక్కేయండి..!
ఇదీ చదవండి: మటన్ స్పెషల్: ఎంఎల్ఏ పొట్లం బిర్యానీ