వినోదం, విహారం నుంచి విలాసాల వాణిజ్యంగా పర్యాటకం(World Tourism Day 2021) మారిన తరవాత ఈ రంగం సైతం పర్యావరణ విధ్వంసకాల్లో ఒకటైపోయింది. నానాటికీ విస్తృతమవుతున్న పర్యాటకం కారణంగా పుట్టుకొస్తున్న వ్యర్థాలతో వాతావరణానికి పెను నష్టం(Tourism Pollution) జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఉత్పన్నమవుతున్న కాలుష్యంలో అయిదు శాతానికి పర్యాటక రంగమే కారణం. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ(ఐసీఏఓ) రెండు దశాబ్దాల క్రితమే ఈ విషయంలో హెచ్చరించింది. భవిష్యత్తులో పర్యావరణహిత పర్యాటకం(ఎకో టూరిజం) మేలని, ప్రపంచ దేశాలన్నీ ఈ దిశగా అడుగులు వేయాలని వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్(ఐపీసీసీ) ఇటీవల నొక్కిచెప్పింది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ 1980 నుంచి ఏటా సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక ఉత్సవాలను(World Tourism Day 2021) జరుపుతోంది. 1990లో యూఎన్‌ఓ అంతర్జాతీయ పర్యావరణ పర్యాటక సొసైటీ(టీఐఈఎస్)ని ఏర్పాటు చేసింది. గ్లోబల్ వార్మింగ్‌తో ఉలిక్కిపడ్డ ప్రపంచ దేశాలు ఎకో టూరిజం వైపు దృష్టి సారిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 140 కోట్ల మంది అంతర్జాతీయంగా, మరో 900 కోట్ల మంది ఆయా దేశాల్లో స్థానికంగా పర్యటనలు చేస్తున్నారు. వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది.
అధికమవుతున్న కర్బన ఉద్గారాలు..
ఒకప్పుడు ప్రాకృతిక ఆహ్లాద ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శనే పర్యాటకంలో ప్రధానంగా ఉండేది. ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు పెరిగాక పర్యాటకం తీరే మారిపోయింది. స్టార్ హోటళ్లు, విలాస కాలక్షేపాలు, డాన్స్, లేజర్ షోలు, ప్రదర్శనశాలలు, జూద క్రీడలు కొత్తగా జాబితాలోకి చేరాయి. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్, ఘన వ్యర్థాల(Tourism Pollution) వంటివి పెరిగిపోతున్నాయి. విమానాలు, శీతలీకరణ యంత్రాల వల్ల వాతావరణంలో ప్రమాదకర కర్బన ఉద్గారాలు అధికమవుతున్నాయి. కేవలం పర్యాటకం వల్ల 2016లో 160 కోట్ల టన్నుల దాకా కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో కలిసినట్లు అంచనా. 2030నాటికి ఇది సుమారు 200 కోట్ల టన్నులకు చేరుతుందని ఐసీఏఓ ప్రకటించింది. మానవులకు, ప్రకృతికి మేలు చేసేలా ఉండాలంటూ పర్యావరణహిత పర్యాటకాన్ని టీఐఈఎస్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఏటా ఒక్కో దేశంలో ఒక్కో నినాదంతో పర్యావరణ, సుస్థిర పర్యాటక సదస్సు(ఈఎస్‌టీసీ)లు నిర్వహిస్తోంది. 190 దేశాలు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. 16వ సదస్సు 'నిమగ్నం, సాధికారత, స్ఫూర్తి' నినాదంతో ఈ ఏడాది జులైలో టర్కీలోని టొకాట్ చారిత్రక నగరంలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణహిత పర్యాటకాన్ని ప్రోత్సహించడం, నౌకా ప్రయాణాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం తదితర తీర్మానాలు ఇందులో వెలువడ్డాయి. దేశీయ పర్యాటకంలో విద్యుత్, సోలార్, బయో ఇంధన వాహనాలను ఉపయోగించాలని నిర్ణయించారు. ప్రపంచ వన్యప్రాణి సంస్థ(డబ్ల్యూడబ్ల్యూఎఫ్) సైతం పర్యావరణహిత పర్యాటకం ప్రాముఖ్యత గురించి అంతర్జాతీయంగా అవగాహన కల్పిస్తోంది.
సహజవనరులకు శాపంగా..
ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక ప్రకారం రెండేళ్లక్రితం ప్రపంచ ప్రయాణ, పర్యాటక పోటీతత్వ సూచీలో 140 దేశాల సరసన భారత్ 34వ స్థానంలో నిలిచింది. మన జీడీపీలో 6.8శాతం ఈ రంగం నుంచి లభిస్తోంది. తొమ్మిది రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 7516 కిలోమీటర్ల సముద్రతీరం భారత్‌లో ఉంది. సహజ పర్యాటకానికి ఇది ఎంతో అనువు. ఇప్పటికే కేరళ ప్రపంచంలోనే తొలి పది పర్యావరణహిత పర్యాటకాల్లో ఒకటిగా నిలుస్తోంది. హిమాలయ పర్వతాలు, నదులు, తూర్పు, పశ్చిమ కనుమలు, పర్వత శ్రేణులు, ఎడారులు, జలపాతాలు, సరస్సులు, చారిత్రక కట్టడాలు, పురాతన దేవాలయాలు, వైవిధ్య ప్రాంతాలు, అనేక జాతుల జీవులు- వెరసి భారత్ ప్రకృతి ఒడిలో సేదతీరిన సహజ పర్యాటకాలయం. కట్టుదిట్టమైన చట్టాలు లేకపోవడం, కొందరి స్వార్థం దేశంలోని సహజవనరులకు శాపంగా మారింది. గనుల తవ్వకాలతో తూర్పు, పశ్చిమ కనుమల్లో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. అడవుల నరికివేతతో పచ్చదనానికి ప్రమాదం వాటిల్లుతోంది. విచ్చలవిడి కాలుష్యంతో సముద్ర జలాలు, వాటిలో ఉండే జీవరాశులు, పగడపు దిబ్బల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. నదులన్నీ కాలుష్య కాసారాలవుతున్నాయి. సరైన భద్రత ఏర్పాట్లు లేక నదుల్లో విహారయాత్రకు వెళ్ళిన పర్యాటకులు బోటు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. జలపాతాల వద్ద సరైన రక్షణ ఏర్పాట్లు లేక ఏటా ఎందరో మృత్యువాత పడుతున్నారు. అన్నింటికీ మించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపం జాతీయ పర్యాటక ప్రణాళికకు విఘాతంగా మారింది. పర్యావరణ పర్యాటకాన్ని పటిష్ఠం చేసి రాబోయే ఏడేళ్లలో జీడీపీలో దాని వాటాను కనీసం పది శాతానికి తీసుకెళ్లాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సాధ్యం కావాలంటే పర్యావరణ పర్యాటకంపై విస్తృతంగా ప్రచారం కల్పించడంతో పాటు ప్రకృతి అందాలను పరిరక్షించాలి. పర్యాటకుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడమూ తప్పనిసరి.
- చిలుకూరి శ్రీనివాసరావు
ఇదీ చూడండి: Ramoji film city : రామోజీ ఫిలింసిటీకి పర్యాటక పురస్కారం
ఇదీ చూడండి: UNWTO Best Tourism Villages: 'బెస్ట్ టూరిజం విలేజ్' పోటీలో భూదాన్ పోచంపల్లి