కరోనా రెండోసారి తుపానులా విజృంభిస్తూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వైద్యశాలల్లో పడకలు దొరకని దుస్థితి నెలకొంది. వైరస్ మందులను నల్లబజారులో అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొవిడ్ టీకాలకు తీవ్రమైన కొరత ఉండటంతో.. ఇప్పుడప్పుడే అవి అందరికీ అందుబాటులోకి వచ్చే సూచనలు లేవు. దీంతో కొవిడ్ వ్యాధిగ్రస్తులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో ఎవరికి తోచిన వైద్యాన్ని వారు ప్రచారం చేస్తున్నారు.
ఇటీవల ఒక ఉపాధ్యాయుడు నిమ్మరసం ముక్కుల్లో పిండితే కరోనా రాదనే ప్రచారాన్ని నమ్మి, ముక్కునిండా నిమ్మరసం పిండుకుని, అస్వస్థతకు గురై మరణించారు. కొవిడ్ నివారణకు గోమూత్రమే పరమౌషధమని ప్రచారం చేసేవారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇక వంటింటి దినుసులు, కొన్ని రకాల మొక్కలు కరోనాను సమర్థంగా ఎదుర్కొంటాయంటూ వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. పరోపకారం చేస్తున్నామనే భ్రమతో చాలామంది ఈ తరహా ప్రచారాలకు పాల్పడుతున్నారు.
విద్యావంతులూ అదే బాటలో..
ఊడలు దిగిన అజ్ఞానం వల్ల కొందరు అభాగ్యులు ఇటువంటి చిట్కాలు నమ్మి- సరైన చికిత్స తీసుకోకుండా ప్రాణాల మీదికి తెచ్చుకొంటున్నారు. అంతో ఇంతో శాస్త్రీయ అవగాహన ఉన్న విద్యావంతులు సైతం మానసిక దౌర్బల్యంతో ఈ ప్రచారాలను ఏదో ఒక దశలో నమ్మి ఆచరిస్తూ ఉండటం గమనార్హం. మరోవైపు వ్యాపార ప్రయోజనాలకూ కొవిడ్‌ను వాడుకుంటున్నారు. 'శరీర రోగనిరోధక వ్యవస్థ బలపడితే కొవిడ్ మిమ్మల్ని ఏమీ చేయలేదు' అంటూ- బహుళజాతి సంస్థల నుంచి చిన్నా చితకా కంపెనీల వరకు అనేక ఉత్పత్తులను విశేషంగా అమ్ముకొంటున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనే తలంపుతో కొందరు ఈ తరహా ఉత్పత్తులను విపరీతంగా వాడుతున్నారు. విచక్షణ లేకుండా ఔషధాలను వినియోగించడమూ మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక విపరీతంగా వేడినీళ్లు తాగి, ఆవిరి పట్టి లేనిపోని కొత్తసమస్యలు కొనితెచ్చుకునేవాళ్లూ అసంఖ్యాకంగానే ఉన్నారు.
సరైన మార్గాలతో ముందుకు..
శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుకునేందుకు తోడ్పడతాయంటూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఆసనాలను ప్రదర్శిస్తున్నారు. అలాంటివి సాధారణ పరిస్థితుల్లో కొంత మేలు చేయవచ్చు. కానీ, వ్యాధి వచ్చినవారికి వాటివల్ల తక్షణ ప్రయోజనమేమీ ఉండదని నిపుణులు అంటున్నారు. అశాస్త్రీయమైన ప్రచారాలు నమ్మి ప్రాణం మీదికి తెచ్చుకోవడం మంచిది కాదు. సరైన మార్గాలద్వారా శరీర రక్షణ కణ వ్యవస్థను బలోపేతం చేసుకునే మార్గాలు అనేకమున్నాయి. శరీరాన్ని అతిగా శ్రమపెట్టని తేలికపాటి వ్యాయామం వీటిలో ప్రధానమైనది. ఈ వ్యాయామాలవల్ల శరీరంలో సైటోకిన్లు, న్యూట్రోఫిన్లు, తెల్లకణాల వంటి వాటి ప్రసరణ మెరుగై, రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
పరిశుభ్రతే ధ్యేయంగా..
వీటితో పాటు ముఖ్యంగా పరిశుభ్రతకూ పెద్దపీట వేయాలి. భౌతిక దూరం పాటించడం, ముఖ మాస్కులు ధరించడం తప్పనిసరి. అన్నింటికంటే ముఖ్యంగా కొవిడ్‌పై శాస్త్రీయ అవగాహన పెంపొందించుకోవాలి. చాలామందిలో కొవిడ్ లక్షణాలు కనిపించినా మామూలు అస్వస్థతగా భావిస్తూ, బయట తిరుగుతూ వ్యాధిని వ్యాప్తి చేస్తున్నారు. అయిదారు రోజుల తరవాత సైతం లక్షణాలు తగ్గకపోతే, అప్పుడు మాత్రమే కొవిడ్ పరీక్ష చేయించుకుంటున్నారు. ఆ పరీక్షా ఫలితాలు రావడానికి మరికొద్ది రోజులు పడుతోంది. అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమిస్తోంది. ప్రాథమిక లక్షణాలు కనబడగానే, సీˆ్వయ నిర్బంధంలో ఉండటం, పరీక్ష చేయించుకోవడం ద్వారా చాలావరకు నష్టాన్ని నివారించడానికి వీలుంది.
చికిత్సల కోసం వాటిని ఉపయోగించాలి..
భారత్‌లో పేద, దిగువ మధ్య తరగతి ప్రజల నివాసాల్లో వ్యాధి సోకినవారిని విడిగా ఉంచేంత చోటు ఉండదు. ఈ కష్టకాలంలో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు చొరవ తీసుకుని ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు వంటి వాటిని బాధితుల వసతి, చికిత్సలకోసం వినియోగించాలి. స్థానిక సంస్థలు కొవిడ్ బాధితులకు వసతి సదుపాయం కల్పించేందుకు ముందుకు రావాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే అన్ని వ్యవస్థలూ కొవిడ్ బాధితుల సేవలకు పూనుకోవాలి. అప్పుడే సమాజంలో ధైర్యస్థైర్యాలు పెరుగుతాయి. నిన్న మొన్నటివరకు టీకా వేయించుకునేందుకు చాలామంది వెనకాడారు. టీకాపై ఉన్న అపోహాలు పోయేలా ప్రజానీకానికి అవగాహన కలిగించాలి.
మరోవైపు ప్రభుత్వాలు అందరికీ సరిపడా టీకాలను సరఫరా చేయాలి. టీకా మరణాల్ని సమర్థంగా ఆపగలిగినా, వైరస్ ఉత్పరివర్తనం చెందుతూ ఉండటంవల్ల కొవిడ్‌ను పూర్తిగా పారదోలాలంటే వ్యాక్సిన్ తీసుకున్న తరవాతా కొన్ని నెలలపాటు ముఖ మాస్కులను ధరించడం, భౌతిక దూరం పాటించడంవంటి రక్షణ చర్యలు కొనసాగించాలని వైద్యులు చెబుతున్నారు. వ్యాక్సిన్లవల్ల సామూహిక రోగనిరోధక శక్తి అభివృద్ధి అయ్యే వరకు కొవిడ్ నిబంధనలను అందరూ తప్పనిసరిగా పాటించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. విస్తృత అవగాహన కార్యక్రమాల ద్వారా మాత్రమే కరోనా వైరస్ బారి నుంచి భద్రంగా బయటపడగలమని వ్యక్తులు, వ్యవస్థలు గుర్తించాలి.
- అనిసెట్టి శాయికుమార్, రచయిత
ఇదీ చదవండి: ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదీ మూల్యం!