భారతీయ వైద్య పరిశోధన మండలి, వ్యాధుల నియంత్రణ జాతీయ కేంద్రం నిరుడు జులైలో- ఎబోలా, ఎల్లో ఫీవర్, ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వంటి అత్యంత ప్రమాదకర వైరల్ ఇన్‌ఫెక్షన్లపై విస్పష్ట హెచ్చరికలు జారీ చేశాయి. ఆర్నెల్లు తిరిగాయో లేదో, వాటి జాబితాలో లేని కరోనా మహమ్మారి ఉరుములేని పిడుగులా ఊడిపడింది. టైఫాయిడ్, మలేరియా, డెంగీ, స్వైన్‌ఫ్లూ వంటివీ మృత్యు ఘంటికలు మోగించే భారత్‌లో కొవిడ్ కోరసాచడం అక్షరాలా పిడుగుపాటే!
70వేల పైచిలుకు కేసులు, రెండున్నర వేలకు చేరువైన మరణాలతో భీతిగొలుపుతున్న కరోనాపై ఏకోన్ముఖ పోరాటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకల శక్తియుక్తులు కూడదీసుకొంటున్న వేళ- సీజనల్ వ్యాధులు ప్రబలనున్నాయన్న సమాచారం- మరింత ఆందోళన కలిగించేదే. సమస్త ప్రజారోగ్య వ్యవస్థలపై కొవిడ్ పెనుభారం మోపిన తరుణంలో మలేరియా, పోలియో వంటి వ్యాధులపైనా దృష్టి సారించక తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పక్షం రోజులనాడే హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే- డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది అవసరమైన చోట్లకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రయాణించగలిగేలా చూడాలని కేంద్రం రాష్ట్రాలను తాజాగా ఆదేశించింది.
మందు దొరికే వరకు..
ఉన్న వైద్య సిబ్బందే కరోనా సవాళ్లను కాచుకోవడంతోపాటు, వ్యాధి నిరోధక టీకాల బాధ్యతను, సీజనల్ వ్యాధుల ఉద్ధృతి నియంత్రణనూ చేపట్టాల్సి ఉందంటూ అన్ని ప్రైవేటు క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు, ల్యాబులూ తెరిచేందుకు చర్యలు తీసుకోవాలనీ స్పష్టంగా సూచించింది. కొవిడ్ కోరలు విరిచే ఔషధం వచ్చేదాకా తక్కిన వ్యాధుల ముట్టడి ఆగేది కాదు. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రజారోగ్య పరిరక్షణ అక్షరాలా కత్తిమీద సాము!
ఆరోగ్యపరమైన ఉపద్రవాల్ని ఎదుర్కోవడంలో ఇండియా సహా అనేక దేశాలు ఏ మాత్రం సిద్ధంగా లేవన్న ప్రపంచ ఆరోగ్య భద్రతా సూచీ- ఆసియాలో థాయ్‌లాండ్, దక్షిణ కొరియాలే మేలిమి పని తీరు కనబరుస్తున్నాయని విశ్లేషించింది. ముంజేతి కంకణానికి అద్దమెందుకు?
పెరుగుతున్న ఆరోగ్య సంక్షోభం..
మలేరియా, టైఫాయిడ్, హెపటైటిస్, పచ్చకామెర్లు, డయేరియా, కలరా, టీబీ, ఇన్‌ఫ్లుయెంజా వంటి సాంక్రామిక రుగ్మతలే అభాగ్య జనావళిపై కసిగా మృత్యుపాశాలు విసురుతున్న దురవస్థ ఈనాటిది కాదు. వాటికి జతపడి 1990లో 30.5శాతంగా ఉన్న సాంక్రామికేతర వ్యాధులు 2016నాటికి 55.4 శాతానికి పెరిగి సృష్టిస్తున్న జనారోగ్య సంక్షోభం అంతా ఇంతా కాదు.
అందరికీ ఆరోగ్యం అందమైన కలగా మిగిలి, పౌష్టికాహార లోపాలే సాంక్రామిక వ్యాధుల ప్రజ్వలనానికి కారణమవుతున్న దశలో కొవిడ్ మహమ్మారి మరింత భయానక వాతావరణాన్ని సృష్టించింది. విషజ్వర లక్షణాలతో విరుచుకుపడే మలేరియా, డెంగీ, స్వైన్ ఫ్లూల మాదిరిగానే కొవిడ్ కూడా దాడి చేస్తుండటంతో- వాస్తవంగా వ్యాధి నిర్ధారణ అయ్యేదాకా రోగులు, వారి సంబంధీకులపై ఉండే మానసిక సామాజిక ఒత్తిడి, ఆందోళన దుర్భరమైనవి.
ఆ రాష్ట్రాల్లోనే అధికంగా..
నిరుడు హెచ్1ఎన్1 వ్యాధి దేశీయంగా 1218 మందిని, 2018లో టీబీ నాలుగు లక్షల 40వేల మందిని బలిగొన్నాయి. 2015 లగాయతు హెచ్1ఎన్1 కేసులు అత్యధికంగా నమోదవుతున్న మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, దిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఇప్పుడు కొవిడ్ ప్రబలంగా విరుచుకుపడుతోందని విశ్లేషణలు చాటుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో మాయావి కొవిడ్ ఆనుపానాల్ని విస్తృత పరీక్షల ద్వారా కనిపెట్టి, దాని పనిపట్టడం ఎంత ముఖ్యమో, విషజ్వరాల విజృంభణ మరో సంక్షోభం సృష్టించకుండా కాచుకోవడం అంతే ప్రధానం. కరోనా నుంచి రక్షణ కవచాలుగా అక్కరకొస్తున్న పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, బౌతిక దూరం వంటి వాటిని కచ్చితంగా పాటించడం ద్వారానే మాయదారి రోగాల ముట్టడి నుంచి బయటపడగలం!
ఇదీ చూడండి: 'మెరుగుపడిన కరోనా కేసుల రెట్టింపు సమయం'