శాసనసభ ఎన్నికలు(Assembly elections) సమీపిస్తున్న తరుణంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓటర్లపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Utterpradesh CM) సర్కారు వరాల జల్లు కురిపిస్తోంది. రాష్ట్రంలోని కోటి మంది యువతకు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు అందించేందుకు తాజాగా మూడు వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. 2012 ఎన్నికల ప్రచారంలో సమాజ్‌వాది పార్టీ ఇలాగే, ఇంటర్ పూర్తయిన వారికి ఉచిత ల్యాప్‌టాప్‌ల హామీ ఇచ్చింది. యువ ఓటర్లపై అది అప్పట్లో బాగా ప్రభావం చూపింది. యోగి సైతం ఇప్పుడదే బాటలో నడుస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఆర్థిక సాయమూ అందిస్తామంటున్నారు. ఇందుకోసమే అన్నట్లుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఏడువేల కోట్ల రూపాయల అదనపు బడ్జెట్‌ను యోగి సర్కారు ఇటీవల ఆమోదించింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో దాదాపు 15 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. యోగి(yogi adityanath news) తాజా వాగ్దానాలు మొదటిసారి, రెండో దఫా ఓటేసే యువతను బాగా ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల పథకం అబద్ధపు హామీ తప్ప ఇంకేమీ కాదని, 2017 ఎన్నికల్లో ఇచ్చిన చాలా హమీలను భాజపా నెరవేర్చలేదని సమాజ్‌వాది పార్టీ విమర్శిస్తోంది. యువత భాజపాపై తీవ్ర ఆగ్రహంతో ఉందని, వచ్చే ఎన్నికల్లో అది ప్రతిఫలించడం ఖాయమని అంటోంది.
99 శాతం నెరవేర్చాం..
గత అసెంబ్లీ ఎన్నికల్లో 'లోక్ కల్యాణ్ సంకల్ప్ పత్ర' పేరిట భాజపా రమారమి 150 హామీలు గుప్పించింది. అవినీతికి తావులేని పాలన, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు ఉచిత వైఫై, ప్రజలకు శాశ్వత నివాసగృహాలు, రెండు లక్షల రూపాయల ఆరోగ్య బీమా, రైతుల రుణమాఫీ, అయిదేళ్లలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, 24 గంటల విద్యుత్తు, వంట గ్యాస్, నగరాలకు గ్యాస్ పైప్‌లైన్ వంటివి వాటిలో ఉన్నాయి. చాలా హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని ప్రతిపక్షాలు అంటుంటే, 99శాతం వాగ్దానాలను ఇప్పటికే నెరవేర్చేశామని భాజపా ఘంటాపథంగా చెబుతోంది. నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 45.74లక్షల చెరకు రైతులకు రూ.1.37లక్షల కోట్ల బకాయిలు చెల్లించిందని, 86లక్షల రైతులకు రూ.36వేల కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు పేర్కొంటోంది.
వాగ్దానాలను నిలబెట్టుకొన్న మాట నిజమే అయితే, హామీలవారీగా అమలు వివరాలను బయటపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. యూపీ శాసనసభలో మొత్తం 403 స్థానాలున్నాయి. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకి 350 సీట్లు దక్కడం ఖాయమని, భాజపాపై ప్రజల ఆగ్రహం చూస్తుంటే 400 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదని ఎస్పీ జాతీయ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ జోస్యం చెబుతున్నారు. కొవిడ్ మహమ్మారిని యోగి సర్కారు సమర్థంగా ఎదుర్కోలేకపోయిందని ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఔషధాల బ్లాక్ మార్కెటింగ్, పంచాయతీ ఎన్నికల సమయంలో ఉపాధ్యాయుల ప్రాణాలను వైరస్‌కు బలిపెట్టడం, చమురు, వంటగ్యాస్ ధరల మంటలు, రైతు చట్టాలు, నిరుద్యోగం వంటివి రానున్న ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం చూపిస్తాయని ఆయన ఆశిస్తున్నారు. మరోవైపు భాజపా సైతం తాము 350కి పైగా సీట్లు సాధించడం తథ్యమని అంతే నమ్మకంగా చెబుతోంది.
పంచాయతీ ఎన్నికల్లో సత్తా..
ఇటీవల జిల్లా పంచాయతీ ఎన్నికల్లో 75కు 67 అధ్యక్ష స్థానాలను, బ్లాక్ పంచాయతీల్లో 826కు 648 అధ్యక్ష పదవులను భాజపా బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకొన్నారు. యూపీలో 48శాతం ప్రజలు కాషాయదళానికే మద్దతు పలుకుతున్నట్లు 'ఆసియానెట్' సర్వే పేర్కొంది. ఎస్పీకి 36శాతం జనామోదం దక్కింది. బ్రజ్, ఉత్తరయూపీ, అవధ్, కాశీ, కాన్పూర్, బుందేల్‌ఖండ్‌లలో యోగి హవాకు తిరుగులేదన్నది సర్వే సారాంశం! 2017 ఎన్నికల్లో భాజపా 312 సీట్లు సాధించగా- ఎస్పీ 47, బీఎస్పీ 19, కాంగ్రెస్ ఏడు సీట్లకు పరిమితమయ్యాయి. ఓట్ల పరంగా ఎస్పీ, బీఎస్పీ దాదాపు 22శాతం చొప్పున దక్కించుకోగా- కాంగ్రెస్ కేవలం ఆరు శాతంతో సరిపెట్టుకుంది. భాజపాకు 40శాతం ఓట్లు పడ్డాయి. 2012 ఎన్నికల్లో ఎస్పీ 224 సీట్లు సాధిస్తే; బీఎస్పీ 80, భాజపా 47, కాంగ్రెస్ 28 స్థానాలు గెలుచుకున్నాయి. 2012, 2017 ఫలితాలకు అసలు పొంతనే కనిపించదు! యూపీలో ఇప్పటికే అగ్రవర్ణాల మద్దతు భాజపాకు ఉండగా, ఓబీసీలను ఆకర్షించేందుకు ఆ పార్టీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఎస్పీలో అంతర్గత కుమ్ములాటలు, మసకబారిన కాంగ్రెస్ ప్రభ, బీఎస్పీ ఒంటరి ప్రయాణం.. వీటన్నింటి నడుమ తాజా హామీలు యోగి ప్రభుత్వానికి ఏ మేరకు కలిసి వస్తాయో వేచి చూడాల్సిందే!
- దివ్యాన్షశ్రీ
ఇదీ చదవండి:పరిశ్రమలను ప్రోత్సహిస్తేనే- రక్షణ రంగంలో ఆత్మనిర్భరత!