ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ఆర్థికంగా అతలాకుతలం చేసిన కొవిడ్ మహమ్మారి బాలికల పాలిట సైతం పెనుశాపంగా మారనుంది. దీని కారణంగా రానున్న దశాబ్దంలో అదనంగా దాదాపు కోటి మంది బాలికలు బాల్య వివాహాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునిసెఫ్) హెచ్చరించింది. కొవిడ్, బాల్యవివాహాల నిరోధంలో ప్రగతికి ముప్పు పేరుతో ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున యునిసెఫ్ వెలువరించిన నివేదిక ఆందోళనకర విషయాల్ని వెల్లడించింది. కరోనా కారణంగా పాఠశాలలు మూసివేయడం, కుటుంబాల మీద ఆర్థిక ఒత్తిడి, ప్రభుత్వ పథకాలు-సేవల్లో అంతరాయం, తల్లి, తండ్రి మరణం లాంటివి బాల్యవివాహాలు పెరగడానికి కారణమవుతాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా బాల్య వివాహం అయిన బాలికలు, మహిళలు 65 కోట్ల మంది ఉండగా- వారిలో సగం మంది భారత్, బంగ్లాదేశ్, నైజీరియా, ఇథియోపియా, బ్రెజిల్‌లలోనే ఉన్నట్లు వెల్లడించింది.
కొవిడ్‌కు ముందు జరిపిన అధ్యయనం ప్రకారం- రానున్న దశాబ్దంలో దాదాపు పది కోట్ల మంది బాలికలు బాల్యవివాహ కోరల్లో చిక్కుకునే ముప్పు పొంచి ఉంది. కరోనా కారణంగా ఈ సంఖ్య మరో కోటికి పెరిగే అవకాశం ఉంది. 2030 నాటికి బాల్య వివాహాలకు చరమగీతం పాడాలన్న అంతర్జాతీయ సమాజ లక్ష్యానికి ఇది పెద్ద విఘాతమే! గడచిన దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా బాల్యవివాహాలు 15శాతం (నలుగురిలో ఒకరి నుంచి అయిదుగురిలో ఒకరికి) తగ్గి, దాదాపు 2.5 కోట్ల మంది ఆ ఊబి నుంచి బయటపడ్డారు. కొవిడ్‌వల్ల ఆ ప్రగతి మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతుందని యునిసెఫ్ ఆవేదన వ్యక్తం చేసింది. పాఠశాలల మూసివేత వల్లే బాల్య వివాహాలు 25 శాతం పెరిగే అవకాశం ఉంది. కొవిడ్ కల్లోలం వల్ల ప్రపంచవ్యాప్తంగా బాలికలు, యువతులు సుమారు 2.4 కోట్ల మంది చదువు మానేసే అవకాశం ఉంది. ఇంట్లోనే ఉండటం వల్ల బాలికల మీద లైంగిక దాడి ముప్పు, అవాంఛిత గర్భం, బాల్య వివాహాల ప్రమాదం ఎక్కువ. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక భద్రత కార్యక్రమాలు, పేదరికాన్ని తగ్గించే వ్యూహాలు, చట్టాల కఠిన అమలు ద్వారా బాల్య వివాహాల్ని 33 శాతం దాకా తగ్గించవచ్చని యునిసెఫ్ సూచించింది. నిరుడు వెలువడిన 'గ్లోబల్ గర్ల్‌హుడ్' నివేదికా- బాలికల జీవితాల్లో కరోనా విధ్వంసం గురించి చెప్పింది. అమ్మాయిల ప్రగతిని తీవ్రంగా దెబ్బతీసిన సంవత్సరంగా 2020ని పేర్కొంటూ రానున్న అయిదేళ్లలో ప్రపంచంలో 25 లక్షల మంది అదనంగా బాల్య వివాహాల ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉందని పేర్కొంది. కరోనా వల్ల ఒక్క 2020లోనే అయిదు లక్షల మంది బాలికలు అదనంగా వివాహబంధంలో చిక్కుకునే అవకాశం ఉందని వెల్లడించింది. కొవిడ్ కల్లోలం బాల్య వివాహాల ముప్పును పెంచిందని బాలల హక్కుల కోసం పనిచేసే క్రై స్వచ్ఛంద సంస్థ సైతం వెల్లడించింది. 2020లో మార్చి, జూన్ మధ్యలోనే అయిదు వేలకుపైగా బాల్య వివాహ కేసులు తమ దృష్టికి వచ్చినట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ గతంలో ప్రకటించింది. ఇదే కాలంలో బాలల హెల్ప్‌లైన్, చైల్డ్‌లైన్స్‌కు ఫిర్యాదులు 17 శాతం పెరిగాయని పేర్కొంది.
ఒకవైపు దేశంలో బాల్యవివాహాలు నిరాటంకంగా చోటుచేసుకుంటుండగా- పోలీసు ఫిర్యాదుల దశకు చేరుతున్నవి అరకొరే. జాతీయ నేర గణాంకాల సంస్థ లెక్కల ప్రకారం బాల్య వివాహ నిషేధ చట్టం-2006 కింద దేశంలో 2019లో నమోదైన కేసులు 525. అంతకు ముందు రెండేళ్లు నమోదైనవి వరసగా 501, 395 మాత్రమే. బాల్య వివాహాల కారణంగా రక్తహీనత, బలహీనమైన శిశువుల జననం, శిశు, మాతా మరణాలు లాంటివి దేశ ప్రగతికి విఘాతాలుగా మారతాయి. పెళ్ళి కారణంగా చిన్న వయసులోనే స్నేహితులు, కుటుంబ సభ్యులకు దూరమయ్యే బాలికలు తీవ్ర మనోవేదనకు గురవుతారు. తెలంగాణ ప్రభుత్వం ఆయా పథకాల కోసం వివాహ నమోదును తప్పనిసరి చేసింది. బాల్య వివాహాల నిరోధం కోసం అనేక స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. వీటిని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి. సర్పంచులు, ఉపాధ్యాయుల సాయం తీసుకోవాలి. పేద కుటుంబాల్లోని అమ్మాయిల చదువుకు ఆర్థిక అండ అందించాలి. అప్పుడే చిన్న వయసులోనే పెళ్ళిళ్లకు అడ్డుకట్ట పడుతుంది.
- వేణుబాబు మన్నం