ఇప్పటికే రెండు దఫాలుగా జనజీవనాన్ని ఛిన్నాభిన్నం చేసిన కొవిడ్(Covid-19) రక్కసి- మూడోసారీ దాడి చేసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల 'గతానుభవాల ఆధారంగా' చేసిన పరిశీలనలు, అధ్యయనాలు మూడోదశ వ్యాప్తి అనివార్యమనే అభిప్రాయాలకు బలం చేకూరుస్తున్నాయి. కొవిడ్ మూడో దశ తప్పదని(Corona third wave), అయితే అది ఎప్పుడు వచ్చేదీ చెప్పలేమని, దాన్ని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కె.విజయరాఘవన్ సైతం గతంలోనే హెచ్చరించారు. టెలీకన్సల్టేషన్ సేవలకు వైద్యులు ముందుకు రావాలని పిలుపిచ్చారు. మరోవైపు మూడోదశ వైరస్ విజృంభణ కేవలం కొంతమంది ఊహ మాత్రమేనని మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సైతం వైరస్ మూడోదశ వ్యాప్తి ఉంటుందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని స్పష్టం చేసింది.
మళ్ళీ పెరుగుతున్న కేసులు
మూడోదశపై భిన్న వాదనలు వినిపిస్తున్న తరుణంలో ఇటీవల మహారాష్ట్రలోని పుణే, నాసిక్, అహ్మద్‌నగర్, రత్నగిరి తదితర జిల్లాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాంతో ఆయా ప్రాంతాల్లో మళ్ళీ కఠిన ఆంక్షలు విధించారు. కేరళతో పాటు, ఈశాన్య రాష్ట్రాల్లో సైతం కేసుల సంఖ్య తిరిగి పెరగనారంభించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించింది. ఆ బృందాలు అక్కడి పరిస్థితులను సమీక్షించి తగిన సూచనలు చేయనున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో వైరస్ మూడోదశ విజృంభణ ఉండవచ్చని తొలుత నిపుణులు అంచనా వేశారు. అయితే తాజాగా విడుదలైన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక ప్రకారం ఆగస్టులోనే ఇది జూలు విదిల్చే అవకాశం ఉంది. జులై రెండో వారానికి దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య సగటున రోజూ పదివేలకు తగ్గవచ్చని, ఆగస్టు ద్వితీయార్ధంలో మళ్ళీ విజృంభిస్తాయని నివేదిక పేర్కొంది. 'కొవిడ్-19 ది రేస్ టు ఫినిషింగ్ లైన్' పేరిట విడుదలైన ఈ నివేదిక ప్రకారం రెండో దశతో పోలిస్తే మూడో దశలో కేసుల సంఖ్య 1.7రెట్లు ఎక్కువగా ఉంటుంది. మరణాలు రెండోదశలో ఉన్నంత తీవ్రంగా ఉండకపోవచ్చు. భారత్‌లో ప్రస్తుతం నిత్యం సగటున 40 లక్షల మందికి టీకాలు వేస్తున్నారు. దేశ జనాభాలో ఇప్పటివరకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు అయిదు శాతంలోపే. యూఎస్ (47.1శాతం), యూకే (48.7), ఇజ్రాయెల్ (59.8), స్పెయిన్ (38.5), ఫ్రాన్స్ (31.2శాతం)లతో పోలిస్తే భారత్ టీకాల విషయంలో ఎంతో వెనకబడి ఉంది.
కరోనా వైరస్ మళ్ళీ ప్రమాద ఘంటికలు మోగిస్తే దాన్ని అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన సంసిద్ధం కావాల్సి ఉంది. ముఖ్యంగా మూడోదశలో చిన్న పిల్లలు ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఉందనే నిపుణుల అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు నెలల క్రితమే సుప్రీంకోర్టు మూడోదశ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. రానున్న గడ్డు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవాలంటే ఇప్పటినుంచే సిద్ధపడాలని హెచ్చరించింది. తాజా క్యాబినెట్ సమావేశంలో వైద్యమౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం రూ.23,123 కోట్లతో ప్యాకేజీ ప్రకటించింది. మూడోదశ ముప్పును దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోదీ తాజాగా నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆక్సిజన్ కొరత తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ చర్యలు ఊరట కలిగించేవే అయినా- దఫాలవారీగా విజృంభిస్తున్న వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇవి చాలదనేది చేదు వాస్తవం.
సమగ్ర ప్రణాళిక అవసరం
కరోనా వైరస్ ఉత్పరివర్తనం చెందుతూ విజృంభిస్తోంది. మానవాళిపై మహమ్మారి దాడి చేస్తున్న తీరుపట్ల నిరంతర పరిశీలన, అధ్యయనం అవసరం. ఒకవేళ కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లను ఇప్పుడున్న టీకాలు అడ్డుకోలేకపోతే మళ్ళీ ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. కొత్త టీకాల ఆవిష్కరణా అత్యావశ్యకం. కొవిడ్‌ను సమర్థంగా కట్టడి చేసేందుకు ప్రస్తుతం ఉన్న మార్గం టీకాయే. దురదృష్టవశాత్తు ఈ ప్రక్రియ తొలినాళ్లలో చోటు చేసుకున్న లోపాలవల్ల తీవ్రమైన జాప్యం నెలకొంది. తొలిదశ విజృంభణ సందర్భంగా తగిన జాగ్రత్తలు పాటించకపోవడంవల్లే రెండోదశలో దేశం భయానక అనుభవాల్ని చవిచూడాల్సి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాస్కు ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించడం వంటివి అనివార్యమని అందరూ గ్రహించాలి. కరోనా నిర్ధరణ పరీక్షల ద్వారానే వ్యాధి తీవ్రతను అంచనా వేయగలం. దేశవ్యాప్తంగా నిర్ధరణ పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. దానివల్ల వాస్తవ సమాచారం బయటకు రావడంలేదు. కొవిడ్‌పై సమర్థంగా యుద్ధం చేయాలంటే వాస్తవ సమాచారం ఎంతో అవసరం. ప్రభుత్వాలు ఈ లోపాన్ని సరిదిద్దుకుంటేనే వైరస్‌ను విజయవంతంగా ఎదుర్కోగలం. వైద్యపరికరాలు, ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లను సమకూర్చుకోవడంతో పాటు- గతానుభవాలే పాఠాలుగా సమగ్ర ప్రణాళికతో సిద్ధం కావడం ప్రస్తుతం సర్కార్లు అనుసరించాల్సిన వ్యూహం. తద్వారా మహమ్మారిని తిప్పికొట్టగల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది.
- నీలి వేణుగోపాల్‌రావు