ప్రాణాంతక వైరస్‌ల పనిపట్టాలన్న మానవాళి మహాసంకల్పం నిబద్ధ శాస్త్రవేత్తల దశాబ్దాల తపస్సుతోనే సిద్ధిస్తుంది. కంటికి కనపడని శత్రువులా మనిషి శరీరంలో చొరబడి కీలక అవయవాలపై దాడి చేయడం ద్వారా మృత్యు ముఖానికి చేర్చే వైరస్‌ల ఆనుపానుల్ని పసిగట్టడం మొదలు వాటిని అంతం చేసే ఔషధాన్ని కనిపెట్టడం దాకా వైద్యశాస్త్ర పరిశోధనల్లో పురోగతి ఎన్నో అద్భుతాల్ని ఆవిష్కరించింది. ప్రకృతిలో పరివ్యాప్తమైన కోటానుకోట్ల వైరస్‌లన్నీ ప్రాణహాని కలిగించేవి కాకపోయినా- ఏవి ఎప్పుడు ఎలా విషమించి విస్తరిస్తాయో, అందుకు మూలకారణమేమిటో కనిపెట్టడమే మానవ మేధకు నిరంతర సవాలుగా మారింది.
నీరు, ఆహారం ద్వారా సంక్రమించి సాధారణ కామెర్లకు కారణమయ్యే 'హెపటైటిస్ ఎ' ను గుర్తించిన కొన్నాళ్లకే 1960లో 'హెపటైటిస్ బి' వెలుగు చూసింది. వైరస్‌తో కలుషితమైన రక్త మార్పిడి ద్వారా సోకే హెపటైటిస్-బి పూర్వాపరాల్ని శోధించిన బారుక్ బ్లూమ్‌బెర్గ్‌కు 1976లో నోబెల్ పురస్కారం దక్కగా దానికి వ్యాక్సిన్ నేడు అందుబాటులో ఉంది.
రక్తపరీక్షల ద్వారా వైరస్‌ను వడగట్టే సాంకేతికత అభివృద్ధి చెందినా హెపటైటిస్ కేసుల్లో 20 శాతమే తగ్గుదల నమోదవడం వల్ల కొత్త వైరస్ ఆచూకీ కోసం మొదలైన అన్వేషణ- ముగ్గురు శాస్త్రవేత్తల అంచెలవారీ కృషిమూలంగా 1997లో ఒక కొలిక్కి వచ్చింది. చరిత్రలో తొలిసారిగా 'హెపటైటిస్ సి' వైరస్‌ను నిర్మూలించేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయి అంటూ ఆల్టర్, చార్లెస్ రైస్, మైఖేల్ హౌటన్‌లకు నోబెల్ కమిటీ ఈ ఏటి వైద్యశాస్త్ర పురస్కారం ప్రకటించింది.
2030 నాటికి హెపటైటిస్-సి వైరస్‌ను పూర్తిగా నిర్మూలించాలన్నది ఐక్యరాజ్య సమితి లక్ష్యం. ఇప్పటికీ దాన్ని నిర్మూలించే వ్యాక్సిన్ రాకపోయినా, సురక్షిత రక్తమార్పిడికి, కాలేయ క్యాన్సర్ కట్టడికి బాటలు వేయడంలో ఆ శాస్త్రవేత్తల కృషి స్ఫూర్తిమంతం. కొరివిగా మారిన కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ప్రాణాంతక వైరస్‌లపై సమరం మరింత కట్టుదిట్టంగా సాగాల్సిన సమయమిది!
తక్షణం రోగ లక్షణాలు కనపడకుండా మనిషిపై దాడి చెయ్యడంలో హెపటైటిస్-సి, కరోనా దొందూదొందే. కాలేయ క్యాన్సర్‌కు దారితీసే దాకా దీర్ఘకాలం ఎలాంటి లక్షణాలూ కనపడనివ్వని హెపటైటిస్ సి ఇండియాలో కోటీ 30 లక్షల మందికి సోకి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకు భిన్నంగా వారం పది రోజుల్లో కుబుసం విడిచే కరోనా సృష్టిస్తున్న కల్లోలం అంతాఇంతా కాదు.
గత అయిదు దశాబ్దాల్లో మానవాళిని వణికించిన మహమ్మారుల్లో 70 శాతం జంతువుల నుంచి సోకినవేనని డబ్ల్యూహెచ్‌ఓ అధ్యయనం చెబుతోంది. 2018 నాటి 'వార్షిక వ్యాధుల సన్నద్ధతా ప్రణాళిక'లో ప్రజారోగ్యానికి ఆత్యంత ప్రమాదకరంగా పరిణమించగల ఎబోలా, అతి తీవ్ర శ్వాసకోశ జబ్బుల జాబితా చివర 'డిసీజ్ ఎక్స్' అంటూ అసలు తెలియని మహమ్మారి ఏదో విరుచుకుపడి ప్రాణాంతకంగా మారే అవకాశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తావించింది.
'డిసీజ్ ఎక్స్'కు కొవిడ్ అని మొన్న ఫిబ్రవరిలో నామకరణం చెయ్యడానికి కొన్నేళ్ల ముందునుంచే జంతువుల నుంచి సంక్రమించే రాబిస్, ఎబోలా, ఆంత్రాక్స్, క్యూ ఫీవర్ వంటి మాయదారి రోగాలు ఏటా 27 లక్షల మందిని బలిగొంటున్న దురవస్థ కొనసాగుతోంది.
క్షీరదాలు, పక్షుల్లోనే ఇప్పటికీ కనిపెట్టని 17 లక్షల రకాల వైరస్‌లు దాగిఉండే అవకాశంపై శాస్త్రవేత్తలు విస్తృత సర్వేకు సమాయత్తమవుతున్న వేళ ఇది. ఎలా వచ్చింది అలానే పోతుందన్న అమెరికా అధ్యక్షుడి అశాస్త్రీయ ఆలోచనాధోరణి అగ్రరాజ్యంలో కొవిడ్ కార్చిచ్చుకేకాదు, శాస్త్ర పరిశోధనలకే గొడ్డలి పెట్టులా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సారథ్యంలోనే ప్రాణాంతక వైరస్‌ల విజృంభణకు అడ్డుకట్ట వేసేలా భూరి పరిశోధనల ప్రాజెక్టు సత్వరం పట్టాలకెక్కాలి. చేతులు కాలాక ఆకుల కోసం వెంపర్లాటలా కాకుండా- పొంచి ఉన్న విపత్తుల నుంచి మానవాళికి రక్షణ కల్పించే పరిశోధనలకు ప్రపంచదేశాలన్నీ ఉమ్మడిగా తోడ్పాటునందించాలి!
ఇదీ చూడండి: వ్యాక్సిన్ సమగ్ర సమాచారం కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్