అగ్రదేశాల ఆధిపత్య పోరులో సరికొత్త ఆయుధ పోటీ మొదలైంది. ఒకప్పుడు అణ్వాయుధాల కోసం పోటీపడిన దేశాలు తాజాగా హైపర్‌సోనిక్ సాంకేతికతను ఒడిసిపట్టేందుకు ఆరాటపడుతున్నాయి. ధ్వని కంటే కనీసం అయిదు రెట్ల వేగంతో దూసుకెళ్లి శత్రువు స్థావరాలను నాశనం చేసే పరిజ్ఞానం కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో విచ్చలవిడిగా ఆయుధాలను పోగు చేసుకోవడాన్ని నివారించేందుకు అగ్రరాజ్యాల మధ్య కుదిరిన ఒప్పందాలకు కాలం చెల్లడం తాజా ఆయుధ పోటీకి ఆజ్యం పోస్తోంది. రష్యా, చైనా, అమెరికా పోటీపడి మరీ హైపర్‌సోనిక్ ఆయుధ పరీక్షలు చేపట్టాయి.
అమెరికా ఆందోళన
ఈ ఏడాది ఆగస్టులో చైనా హైపర్‌సోనిక్ క్షిపణిని లాంగ్ మార్చ్ రాకెట్‌పై అమర్చి ప్రయోగించినట్లు ఇటీవల వెలుగుచూసింది. ఇది ఒకసారి భూప్రదక్షిణ చేసి లక్ష్యానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో పడినట్లు తెలుస్తోంది. ఈ పరీక్షను చైనా గోప్యంగా ఉంచింది. ఇప్పటిదాకా భూమి, సముద్ర గర్భం, గగనతలం నుంచి అణ్వాయుధ ప్రయోగానికి అగ్రరాజ్యాలు పోటీపడ్డాయి. ఇకపై అంతరిక్షం నుంచీ వాటిని ప్రయోగించే శక్తిని చైనా సొంతం చేసుకుంది. అంటే ఈ పోటీ అణు త్రికోణం (నూక్లియర్ ట్రయాడ్) నుంచి అణు చతురస్రానికి (నూక్లియర్ క్వాడ్‌కు) చేరిందన్నమాట. ఇప్పటి వరకూ రష్యా, చైనా మాత్రమే ఈ ఆయుధాలను తమ దళాల్లోకి చేర్చాయి. అమెరికాలోని క్షిపణి రక్షణ వ్యవస్థ ఉత్తర ధ్రువం వైపు నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. చైనా పరీక్షించిన కొత్త ఆయుధంతో రాడార్లకు అందనంత ఎత్తులో దిశలను మార్చుకొంటూ దక్షిణ ధ్రువం వైపు నుంచీ దాడి జరిగే అవకాశం ఉంది. ఫలితంగా అమెరికాలో కంగారు మొదలైంది.
ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ధ్వని వేగంతో పోటీపడే ఆయుధాల కోసం అమెరికా, సోవియట్ యూనియన్‌లు తీవ్రంగా ప్రయత్నించాయి. అదే సమయంలో ఐక్యరాజ్య సమితి బాహ్య అంతరిక్ష ఒప్పందంలోని లొసుగులను వాడుకొని దిగువ భూకక్ష్యను పాక్షికంగా ఉపయోగించుకొనే ఫోబ్స్ (ఫ్రాక్షనల్ ఆర్బిటల్ బంబార్డ్‌మెంట్ సిస్టమ్) ఆయుధాలను తయారు చేయడం మొదలుపెట్టాయి. సోవియట్ విచ్ఛిన్నం తరవాత అమెరికా ఆ ప్రాజెక్టుల నుంచి బయటకు వచ్చేసింది. రష్యా సైతం తగిన నిధులు లేకపోవడంతో వాటిని అటకెక్కించింది. 1972లో చేసుకొన్న క్షిపణి నిరోధక ఒప్పందం నుంచి 2002లో అమెరికా-రష్యాలు బయటకు వచ్చేశాయి. అనంతరం క్షిపణి రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడంపై అమెరికా దృష్టిపెట్టింది. రక్షణ వ్యవస్థలను ఛేదించి దాడిచేసే హైపర్‌సోనిక్ ఆయుధాలను రష్యా అభివృద్ధి చేసింది. వాటి నుంచి పుట్టుకొచ్చిందే 'అవన్‌గార్డ్' క్షిపణి. చైనా సైతం తొలిసారి 2017లో డీఎఫ్-17 మధ్యశ్రేణి క్షిపణిపై అమర్చిన హైపర్ సోనిక్ ఆయుధాన్ని పరీక్షించింది. తాజాగా లాంగ్ మార్చ్ రాకెట్‌తో ఫోబ్స్‌ను పోలిన ఆయుధాన్ని పరిశీలించింది. అమెరికా సైతం తాజాగా హైపర్ సోనిక్ పరిజ్ఞానాన్ని విజయవంతంగా పరీక్షించింది. మరోవైపు భారత్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఉత్తర కొరియాలు ఈ తరహా పరిజ్ఞానం కోసం ప్రయోగాలను ముమ్మరం చేశాయి. ఆర్థిక సమస్యల్లో ఉన్న రష్యా దాడులకు దిగే పరిస్థితి లేదని అమెరికాకు బాగా తెలుసు. డ్రాగన్ ఆర్థికంగా చాలా శక్తిమంతమైంది. అయిదేళ్లుగా అణ్వాయుధ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకొంటోంది. తాజాగా హైపర్‌సోనిక్ క్షిపణి పరీక్షతో అమెరికా మీద పైచేయి సాధించింది.
సోవియట్ గుణపాఠం
చైనాతో సరిహద్దు వివాదం యుద్ధం అంచుకు చేరిన సమయంలో భారత్ తాజా పరీక్షను పసిగట్టలేకపోవడం నిఘా వ్యవస్థలో లోపంగానే భావించాలి. భారత క్షిపణి రక్షణ వ్యవస్థ ఇంకా పూర్తిస్థాయిలో బలోపేతం కాలేదు. మరికొన్ని నెలల్లో రష్యా నుంచి తొలివిడత ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ వచ్చాక పరిస్థితిలో కొంత మార్పు రావచ్చు. ప్రత్యర్థి తొలి దాడి చేస్తే, కచ్చితంగా ప్రతిదాడి ఉండేలా అగ్రదేశాలు ఆయుధాలను తయారు చేస్తున్నాయి. ఇదే ఆయుధ పోటీకి కారణమవుతోంది. ఈ క్రమంలో ఆర్థిక వనరులు హరించుకుపోయి ప్రజలు పేదరికంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. విచ్ఛిన్నానికి ముందు సోవియట్ ఎదుర్కొన్న ఆర్థిక పరిస్థితే దీనికి ఉదాహరణ. పరస్పర అపోహలు తొలగించుకొని ఆయుధ పోటీని నివారించేందుకు చైనాతో చర్చల కోసం అమెరికా దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నట్లు 'కార్నెగి ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్'లో అణువిధాన విభాగ సహ సంచాలకులు జేమ్స్ ఎం.అక్టన్ చెబుతున్నారు. అమెరికా, రష్యా, చైనాలు క్షిపణి సామర్థ్యాలపై స్వీయ పరిమితులు విధించుకొనేలా ఒప్పందానికి వస్తేనే ప్రశాంతతకు మార్గం సుగమమవుతుంది. ప్రచ్ఛన్న యుద్ధ ఛాయలు తొలగిపోవాలంటే దేశాధినేతలు, దౌత్యవేత్తల చొరవ చాలా అవసరం.
- పెద్దింటి ఫణికిరణ్
ఇదీ చూడండి: శాంతి స్థాపనకు హింసామార్గం- విచ్చలవిడిగా ఆయుధ సరఫరా