Rajasthan Election Result 2023 in Telugu : రాజస్థాన్‌లో మార్పు సంప్రదాయమే గెలిచింది. అధికారంలో ఉన్న పార్టీని గద్దె దించే 25 ఏళ్ల సంప్రదాయాన్నే కొనసాగించిన అక్కడి ఓటర్లు అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుకు చరమగీతం పాడారు. మెజారిటీ స్థానాలను బీజేపీకి కట్టబెట్టారు. కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకత, మోదీ ప్రజాకర్షణ శక్తి, హిందుత్వ వికాసం వంటి అంశాలు బీజేపీ విజయానికి దోహదం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతంతమాత్రంగానే ఉన్నా హస్తం పార్టీకి వ్యతిరేకంగా ఓటర్లు ఏకం కావడం వల్ల కమలదళం విజయతీరాలకు చేరింది.
1998 నుంచి రాజస్థాన్‌లో ఐదేళ్లకోసారి అధికార పార్టీ మారుతూ వస్తోంది. ఐదేళ్లు కాంగ్రెస్, మరో ఐదేళ్లు బీజేపీ పాలిస్తూ వస్తున్నాయి. ఇదే సంప్రదాయం ఇప్పుడు రిపీట్ అయింది. 2018లో కాంగ్రెస్ విజయం సాధించగా ఇప్పుడు మళ్లీ కాషాయదళాన్ని గద్దెనెక్కించారు ఓటర్లు. 115 స్థానాల్లో బీజేపీ గెలవగా- కాంగ్రెస్ 70 సీట్లలో గెలిచింది. మరో 14 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు.
కాంగ్రెస్‌పై వ్యతిరేక పవనాలే!
గహ్లోత్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే ఎన్నికల్లో బీజేపీకి సానుకూలంగా మారినట్లు తెలుస్తోంది. యువత, మహిళల్లో గహ్లోత్ సర్కారుపై ఉన్న అసంతృప్తి ఫలితాల్లో ప్రస్ఫుటమైంది. రాష్ట్రంలో నాలుగేళ్ల వ్యవధిలో 18 సార్లు పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయి. యువతతో పాటు వారి కుటుంబాల్లోనూ దీనిపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇందుకు సంబంధించి రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ నివాసాలు, కార్యాలయాలపైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. దీంతో కాంగ్రెస్ సర్కారుపై వ్యతిరేకత కాస్తా బీజేపీకి సానుకూలంగా మారడం ప్రారంభమైంది. కమలనాథులు సైతం జోరు ప్రదర్శించి అసంతృప్త ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. బడాబాబుల హస్తం ఉందనే అభిప్రాయం ప్రజల్లో ఉండటం వల్ల బీజేపీ పని సులువైంది.
అటు, మహిళల్లోనూ అసంతృప్తి రగలడం గహ్లోత్ సర్కారును కోలుకోలేకుండా చేసింది. అత్యాచారాలు సహా మహిళలపై నేరాలు పెరిగిపోవడం ఆ పార్టీ అవకాశాలను దెబ్బతీసింది. అదే సమయంలో బీజేపీ మహిళాకర్షక పథకాలతో మేనిఫెస్టో ప్రకటించింది. పోలీస్ స్టేషన్లలో మహిళల కోసం ప్రత్యేక డెస్క్‌లు, యాంటీ రోమియో స్క్వాడ్లను ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. 12వ తరగతి విద్యార్థినులకు ఫ్రీగా స్కూటర్లను ఇస్తామని ప్రకటించింది. నిరుద్యోగ యువతను ఆకట్టుకునేలా 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఐదేళ్లలో భర్తీ చేస్తామని మాటిచ్చింది. ఇది ఆ పార్టీకి సానుకూలంగా మారినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్‌లో వర్గపోరు- సామాజిక సమీకరణాలు
రాష్ట్రస్థాయి నాయకత్వం విషయంలో రెండు పార్టీల పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. రెండు పార్టీల్లోనూ వర్గ విభేదాలు తీవ్రంగానే ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ విషయంలో ఇది మరింత అధికంగా ఉంది. గహ్లోత్, పైలట్ మధ్య పోరు దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఎన్నికల సమయంలో వీరిద్దరూ స్నేహగీతం పాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మరోవైపు, బీజేపీ సైతం మాజీ సీఎం వసుంధరా రాజెకు కళ్లెం వేసి కొత్త నాయకత్వానికి బీజం వేసింది. ఎంపీ దియా కుమారిని రంగంలోకి దించింది. ఈ పరిణామాలు సామాజికంగా బీజేపీకి కలిసివచ్చినట్లే కనిపిస్తోంది.
2018 ఎన్నికల్లో వసుంధర రాజె పట్ల వ్యతిరేకతతో రాజ్‌పుత్‌లు బీజేపీని దూరం పెట్టారు. సచిన్ పైలట్ ముఖ్యమంత్రి అవుతారని భావించి గుజ్జర్లు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. ఈసారి పరిస్థితి మారిపోయింది. పైలట్‌ను కాంగ్రెస్ దూరం పెట్టడం గుజ్జర్ల ఓట్లపై ప్రభావం చూపింది. వీరంతా హస్తంపై అసంతృప్తితో బీజేపీ వైపు మొగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు, మేవాడ్, మార్వాడ్కు చెందిన రాజ్‌పుత్‌లను పార్టీలో చేర్చుకోవడంలో దియా కీలక పాత్ర పోషించారు. ఫలితంగా వారు సైతం బీజేపీకి అనుకూలంగా మారినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
పనిచేసిన హిందుత్వ!
రాజస్థాన్ వ్యాప్తంగా హిందుత్వ అంశం ఎన్నికల్లో ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. గహ్లోత్ సర్కారు ముస్లింలకు అనుకూలంగా ఉందనే వాదనల మధ్య బీజేపీ అధికారంలోకి రావాలని హిందూ ఓటర్లలో భావన వ్యక్తమైనట్లు సమాచారం. కన్హయ్యలాల్ హత్య ఉదంతం సైతం ఎన్నికల సమయంలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ వల్లే రాజస్థాన్‌లో అలాంటి ఘటనలు జరిగాయనే అభిప్రాయం హిందూ ఓటర్లలో ఉంది. ఇది బీజేపీ అనుకూల పవనాలకు కారణమైనట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మోదీ కరిష్మా
రాష్ట్రస్థాయిలో బలమైన నాయకత్వం లేనప్పటికీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధిష్ఠానమే కారణమని స్పష్టమవుతోంది. అనేక వర్గాలుగా ఉన్న రాష్ట్ర బీజేపీని కేంద్ర పెద్దలే ముందుండి నడిపించారు. ప్రచారంలోనూ వారే ప్రధాన భూమిక పోషించారు. ఎన్నికల ప్రచారం మోదీ వర్సెస్ గహ్లోత్గా సాగింది. అదే సమయంలో పెద్ద సంఖ్యలో ఎంపీలను రంగంలోకి దించింది బీజేపీ. ఎంపీలుగా వీరు చేసిన సేవలు అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగపడతాయని భావించి ఈ వ్యూహం అమలు చేసింది. కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్, దియా కుమారి సహా పలువురు ప్రముఖులను బరిలో దించి సానుకూల ఫలితాలు సొంతం చేసుకుంది.
''ఇండియా'ను ఏం చేద్దాం?'- ఎన్నికల ఫలితాలపై విపక్ష నేతల కీలక భేటీ
బీజేపీలో నయా జోష్- డ్యాన్సులతో హోరెత్తిస్తున్న లేడీస్- ఈమె నృత్యం హైలైట్!