లద్దాఖ్ నుంచి తూర్పు, దక్షిణ చైనా సముద్రాల వరకు తన మాటే నెగ్గాలని పంతం పడుతున్న చైనాకు ముకుతాడు వేయాలని గత ఏడాది అక్టోబరులో జపాన్‌లో సమావేశమైన క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు నిర్ణయించారు. పసిఫిక్ నుంచి హిందూ మహాసముద్రం వరకు న్యాయంగా, స్వేచ్ఛగా సముద్ర వాణిజ్యం జరగకుండా చైనా దుడుకుతనం అడ్డుపడుతోంది. దీన్ని గట్టిగా ఎదుర్కోవడానికి క్వాడ్ కార్యాచరణకు దిగింది.
పసిఫిక్ నుంచి హిందూ మహాసముద్రం వరకు చైనా ప్రాబల్యాన్ని నిలువరించడానికి భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు సభ్య దేశాలుగా ఏర్పడిన ‘క్వాడ్’ తన లక్ష్య సాధన దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. చైనాకు పగ్గాలు వేసే చట్టాలను అమెరికా, ఆస్ట్రేలియాలు తీసుకురాగా, లద్దాఖ్‌లో చైనా దూకుడును అడ్డుకొంటూనే హిందూ మహాసముద్రంలో పైచేయి సాధించడానికి భారత్ చురుగ్గా కదులుతోంది. తమ రాష్ట్రాలు విదేశాలతో కుదుర్చుకునే ఎటువంటి ఒప్పందాన్నైనా వీటో చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కట్టబెడుతూ ఆస్ట్రేలియా పార్లమెంటుఒక చట్టం చేసింది. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ పథకంలో చేరడానికి 2018లో బీజింగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఆ ఒప్పందాన్ని వీటో చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారమిచ్చే చట్టాన్ని ఆస్ట్రేలియా శాసనకర్తలు తీసుకొచ్చారు. మరోవైపు అమెరికా ఆడిటింగ్ ప్రమాణాలను పాటించని విదేశీ కంపెనీలను తమ స్టాక్‌ఎక్స్‌ఛేంజిలనుంచి వెళ్లగొట్టడానికి ప్రజాప్రతినిధుల సభ ఒక చట్టం చేసింది. అమెరికా తెచ్చిన చట్టం వల్ల అలీబాబా, బైడు, పెట్రోచైనా వంటి బృహత్తర కంపెనీలు అమెరికా ఆడిటింగ్‌కు ఒప్పుకోకపోతే అవి ఆ దేశ స్టాక్ ఎక్స్‌ఛేంజిలనుంచి బహిష్కరణకు గురవుతాయి. ఫలితంగా చైనా కంపెనీలు అమెరికా మార్కెట్ నుంచి పెట్టుబడులు సేకరించడం, షేర్ లావాదేవీలు జరపడం అసాధ్యమవుతుంది. లద్దాఖ్ నుంచి తూర్పు, దక్షిణ చైనా సముద్రాల వరకు తన మాటే నెగ్గాలని పంతం పడుతున్న చైనాకు ముకుతాడు వేయాలని గత ఏడాది అక్టోబరులో జపాన్‌లో సమావేశమైన క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు నిర్ణయించారు. పసిఫిక్ నుంచి హిందూ మహాసముద్రం వరకు న్యాయంగా, స్వేచ్ఛగా సముద్ర వాణిజ్యం జరగకుండా చైనా దుడుకుతనం అడ్డుపడుతోంది. దీన్ని గట్టిగా ఎదుర్కోవడానికి క్వాడ్ కార్యాచరణకు దిగింది.
భారత్ పొరుగున చైనా పాగా
చైనా తన ఆర్థిక పటిమతో ఆగ్నేయాసియా దేశాలను, హిందూ మహాసముద్ర తీర దేశాలనూ గుప్పిట్లోకి తీసుకొంటోంది. తద్వారా పసిఫిక్‌లో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాల ప్రాబల్యానికి, హిందూ మహాసముద్రంలో భారత్ పలుకుబడికి ఎసరు పెడుతోంది. భారత్ పొరుగున శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, మాల్దీవులకు పెట్టుబడుల ఎరవేసి లోబరచుకొంటోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి అమెరికా గత అక్టోబర్‌లో క్వాడ్ భేటీ ముగిసిన వెంటనే బరిలోకి దిగింది. దశాబ్ద కాలంగా బంగ్లాదేశ్, అమెరికాల మధ్య ఉన్నత స్థాయి రాకపోకలు పెద్దగా జరిగింది లేదు. భారత్ చొరవతో అమెరికా ఉప విదేశాంగ మంత్రి స్టీఫెన్ బీగన్ గత అక్టోబరులో ఢాకా వెళ్లి బంగ్లా నాయకులతో సమావేశమయ్యారు. ఆ తరవాత చైనా రక్షణ మంత్రి వెయ్ ఫెంఘె నేపాల్ సందర్శన ముగించుకుని ఢాకా వద్దామనుకున్నా బంగ్లా ప్రభుత్వం అందుకు అయిష్టత చూపింది. దక్షిణాసియాలో చైనా ఎత్తులను చిత్తు చేయడానికి భారత ప్రభుత్వం నేపాల్‌తో సంబంధాలను మళ్ళీ పట్టాలెక్కించడానికి నడుం బిగించింది. ఈ నెలాఖరులో నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యావలి భారత్ సందర్శనకు రానుండటం శుభసంకేతం.
దీనికితోడు శ్రీలంక, మాల్దీవులతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్ తన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌ను గతవారం కొలంబోకు పంపింది. ఈ దేశాలతో రక్షణ సంబంధాలను పటిష్ఠం చేసుకోవడం ద్వారా చైనా పన్నాగాలను అడ్డుకోవడానికి పావులు కదిపింది. 2014లో మాల్దీవుల్లో అధికారంలో ఉన్న అబ్దుల్లా యమీన్ ప్రభుత్వం చైనా వైపు వెళ్ళింది. శ్రీలంకలో పూర్వ ప్రభుత్వాలు కూడా చైనాతో అత్యంత సన్నిహిత సంబంధాలు నెరపాయి. చైనా బెల్ట్ అండ్ రోడ్ పథకంలో భాగస్వాములయ్యాయి. తదనుగుణంగా శ్రీలంక, మాల్దీవులలో మౌలిక వసతుల నిర్మాణానికి చైనా భారీ పెట్టుబడులు పెట్టింది. ఈ దీర్ఘకాలిక ప్రాజెక్టులు రెండు దేశాలనూ అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. చైనాకు మాల్దీవులు బాకీపడిన నేపథ్యంలో ఆ రుణభారం శ్రీలంక, మాల్దీవులను పునరాలోచనలోకి నెట్టింది. ఆ సమయంలో డోభాల్ కొలంబో వెళ్లి త్రైపాక్షిక సముద్ర భద్రతా సహకారం పెంచుకోవడానికి చర్చలు జరిపారు. చైనాతో ఆర్థిక సహకారం కొనసాగిస్తూనే భద్రత విషయంలో మాత్రం తాము ఎల్లప్పుడూ భారత్‌కే ప్రాధాన్యం ఇస్తామని శ్రీలంక నాయకులు డోభాల్‌కు హామీ ఇచ్చారు. తమ భూభాగం నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించబోమని ఉద్ఘాటించారు. గతేడాది అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా కొలంబో వెళ్లి సంప్రదింపులు జరిపారు. హిందూ మహాసముద్రంలో చైనా పలుకుబడిని నియంత్రించడానికి క్వాడ్ నడుం కట్టిందనడానికి ఇదే నిదర్శనం. తాజాగా డోభాల్ శ్రీలంక అధ్యక్ష, ప్రధానమంత్రులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. కొలంబో చర్చల్లో మాల్దీవుల మంత్రి మరియా అహ్మద్ దీదీ కూడా పాల్గొన్నారు. హిందూ మహాసముద్రంలో రవాణాపరమైన భద్రత, ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిరోధం, ఉగ్రవాదంపై పోరుకు ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడి, సైబర్ భద్రతలపై పరస్పరం సహకరించుకోవాలని త్రైపాక్షిక సమావేశం నిర్ణయించింది.
నౌకా రవాణాపై డేగ కన్ను
హిందూ మహాసముద్రంలో నౌకల కార్యకలాపాల గురించిన సమాచారాన్ని భారత నౌకాదళం మొత్తం 21 దేశాలు, 22 అంతర్జాతీయ సంస్థలతో పంచుకొంటోంది. ఈ మహాసముద్రంలో ఏ సమయంలో చూసినా భారత నౌకాదళం 12,000 నౌకలు, 300 విదేశీ చేపల పడవలపై నిఘా వేస్తూ ఉంటుంది. వీటికి తోడు మూడు లక్షల భారతీయ చేపల పడవల కదలికలనూ అనుక్షణం గమనిస్తూ ఉంటుంది. అవి ఆపదలో చిక్కుకుంటే తక్షణం రంగంలోకి దిగి ఆదుకొంటుంది. ప్రపంచంలో 75 శాతం సముద్ర వ్యాపారం హిందూ మహాసముద్రంగుండానే జరుగుతోంది. 50 శాతం అంతర్జాతీయ వినియోగ సరకుల ఎగుమతి దిగుమతులు ఈ జలమార్గం గుండానే జరుగుతుంటాయి. ఇంతటి కీలకమైన మార్గం కనుకనే అమెరికా, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మయన్మార్, బంగ్లాదేశ్ వంటి 21 దేశాలు హిందూ మహాసముద్ర రవాణా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి భారత్‌తో కలిసి పని చేస్తున్నాయి. ఈ సమాచార మార్పిడికి భారత్ 2018లోనే గురుగ్రామ్‌లో అంతర్జాతీయ సమాచార కేంద్రాన్ని నెలకొల్పింది. అమెరికా, జపాన్, ఫ్రాన్స్‌ల సమన్వయ అధికారులు ఈ కేంద్రంలో పనిచేస్తున్నారు. దీనికి తోడు క్వాడ్ దేశాలు ఏటా ఉమ్మడిగా ఆపరేషన్ మలబార్ విన్యాసాలు జరపడం, హిందూ మహాసముద్ర ప్రాధాన్యాన్ని సూచిస్తోంది. ఇప్పటికే తూర్పు, దక్షిణ చైనా సముద్రాలు తనవేనని దబాయిస్తున్న చైనా- హిందూ మహాసముద్ర జలాలపైనా ఆధిపత్యం చలాయించాలని చూస్తోందని క్వాడ్ భావిస్తోంది. పాక్‌లోని గ్వాడర్ రేవు, ఆఫ్రికాలో జిబూటీ రేవులను ఇందుకు సాధనాలుగా చైనా వాడుకోనున్నది. హిందూ మహాసముద్రంలో చైనాకు పగ్గాలు వేసే బాధ్యతను నిర్వహించడంలో భారత్‌కు క్వాడ్ దేశాలు అండగా నిలుస్తున్నాయి.
ఇదీ చదవండి : 'స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ నిర్మాణమే లక్ష్యం'