శిశు వికాసం రెండున్నరేళ్ల్ల వయసులో ప్రారంభమవుతుంది. చూపు, స్పర్శ, వినికిడి, గుర్తింపు వంటివి విజ్ఞానం వైపు తొంగిచూస్తూ స్పందన, ఊహా ప్రపంచం క్రమేపీ విస్తరిస్తుంది. ఆరేళ్లకు ముందే పిల్లల మెదడు 85శాతం అభివృద్ధి చెందుతుందని పిల్లల మనోవిజ్ఞానశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పాఠశాలలో మొదటి తరగతి చదువు ప్రారంభానికి ముందే పిల్లల పూర్వ ప్రాథమిక విద్య ఆవశ్యకతను ప్రపంచం గ్రహించినప్పటికీ- దాన్ని అమలు చేయడంలో వెనకబడి ఉంది.
యునిసెఫ్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సగం మంది పిల్లలు పూర్వ ప్రాథమిక విద్య నమోదుకు దూరంగా ఉన్నారు. పాఠశాల విద్య ప్రారంభానికి ముందు అవసరమైన నైపుణ్యాలను కిండర్ గార్టెన్‌గా ఫ్రెడ్రిక్ ఫ్రోబెల్ 1837లో మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేశాడు. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, శ్రీలంకల కంటే పూర్వ ప్రాథమిక విద్యలో పిల్లల నమోదు భారతదేశంలో తక్కువగా ఉందని యునిసెఫ్ నివేదిక వెల్లడిస్తోంది.
అందరికీ అందితేనే...
జాతీయ నూతన విద్యావిధానంద్వారా భారత్ 2025నాటికి 3-6 సంవత్సరాల మధ్య పిల్లలందరికీ నాణ్యమైన బాల్య సంరక్షణ, విద్యను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో కరోనా వైరస్ సోకకముందే 5.6కోట్ల మంది చిన్నారులు బడికి దూరంగా ఉండగా- నేటి వైరస్ ప్రభావంతో బడిలో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గి డ్రాపౌట్స్ 20శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ హెచ్చరిస్తోంది.
ఇది దేశ విద్యావ్యవస్థకే పెను సవాలు. పాఠశాల విద్య ప్రారంభానికి ముందు పిల్లల అభ్యసన సంసిద్ధత చాలా తక్కువగా ఉందని, ఈ విద్య మీద అసోం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో 4-8 సంవత్సరాల వయసుగల గ్రామీణ విద్యార్థులమీద చేసిన ఒక సర్వే ఫలితాలను యునిసెఫ్ వెల్లడించింది. కిండర్ గార్టెన్ పేరుతో ఈ విద్య దేశంలోని మెట్రో నగరాల్లో అందుబాటులో ఉన్నా- అది కొన్ని వర్గాలకే పరిమితమైంది. మొదటి తరగతిలో ప్రవేశించే విద్యార్థులంతా నాణ్యమైన ప్రారంభ బాల్య వికాసం, సంరక్షణ, సార్వత్రిక నియమాలు కలిగి ఉండాలన్నది నూతన జాతీయ విద్యావిధానం అభిలాష. ప్రేరణ, నైపుణ్యాలు, విలువలు, మానవ హక్కుల పట్ల బాధ్యత, సుస్థిర అభివృద్ధి జీవనం, ప్రపంచం మేలుకోరే పౌరులను తయారు చేయాలన్న జాతీయ విద్యావిధానం సరిగ్గా అమలు కావాలంటే పాఠ్యప్రణాళికలో మార్పు రావాలి. వర్ణమాల, భాషలు, సంఖ్యలు, రంగులు, బొమ్మలు, ఆటలు, క్లిష్ట సమస్యల సాధన, లలితకళలు వంటివి పాఠ్యప్రణాళికలో ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. భారతీయ కళలు, కథలు స్థానిక సంప్రదాయాలతో కూడిన ఈ పాఠ్యప్రణాళిక మన మూలాలు, సంస్కృతిపై అవగాహన కల్పించేందుకు దోహదపడుతుంది.
ఆహ్లాదకర అభ్యాసం
నాణ్యతగల మౌలిక సదుపాయాలు, ఆహ్లాదకర అభ్యసన వాతావరణం, సరైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నప్పుడే విద్యాకుసుమాలు వికసిస్తాయి. ఈ పూర్వ ప్రాథమిక విద్యాశిక్షణకు అంగన్‌వాడీ కేంద్రాలను ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వాల ఆలోచన. ప్రస్తుతం పనిచేస్తున్న అంగన్‌వాడీ ఉపాధ్యాయులకు ఎన్‌సీఈఆర్‌టీ, రాష్ట్రాల పరిధిలోని ఎస్‌సీఈఆర్‌టీలతో కలిసి ప్రత్యేక శిక్షణ అందిస్తాయి. ఇంటర్మీడియట్, ఆపైన చదివిన వారికి ఆరునెలల సర్టిఫికెట్ కోర్సు, అంతకంటే తక్కువ అర్హతగల వారికి ఒక ఏడాది డిప్లొమా కోర్సుగా శిక్షణ ఇవ్వనున్నారు. సాధారణంగా 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని కేటాయించగా సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన ప్రాంతాల పిల్లలకు 25 మందికి ఒకరు చొప్పున నియమించనున్నారు. అభ్యసనకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో ఏమాత్రం అలసత్వం కనిపించినా కార్యం నెరవేరదు. ‘నేను నా శిష్యులకు ఎప్పుడూ బోధించలేదు. వారికి కేవలం నేర్చుకోవడానికి కావలసిన పరిస్థితులు అందించే ప్రయత్నమే చేశాను’ అన్న ఐన్‌స్టీన్ మాటలు ఆదర్శప్రాయ అభ్యసన వాతావరణం ఎలా ఉండాలో సూచిస్తాయి.
ఉపాధ్యాయులకు నైపుణ్యాలు అవసరం
విద్యా ప్రమాణాల్లో ఎంతో ముందున్న ఫిన్‌లాండ్ పూర్వ ప్రాథమిక విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అమెరికా సైతం పెద్దపీట వేసింది. విద్యకు కేటాయించిన బడ్జెట్‌లో పూర్వ ప్రాథమిక విద్యకు కనీసం 10శాతం కేటాయించాలన్నది యునిసెఫ్ సూచన. విద్యాశాఖలో పూర్వ ప్రాథమిక విద్య పర్యవేక్షణకు ప్రత్యేక విభాగం ఏర్పరచాలి. వెనకబడిన, గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పిల్లల నమోదు పెంచితే- అది వారికి వరంగా మారుతుంది. పాఠశాల విద్యాభ్యసనం సాఫీగా సాగితే డ్రాపౌట్లు తగ్గిపోతాయి.
ఇప్పుడున్న అంగన్‌వాడీలను నాణ్యమైన తొలి విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో అనేక జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఆట ఆధారిత అభ్యసన ద్వారా ప్రతి బిడ్డ వికాసానికి బాటలు వేయాల్సిన నైపుణ్యం ఉపాధ్యాయులకు అవసరం. ప్రతి చిన్నారికీ సురక్షితమైన ప్రదేశంలో ఆహ్లాదకర వాతావరణంలో- క్రమశిక్షణతో, విలువలతో కూడిన బోధన జరుగుతుందన్న భరోసా కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పౌరసమాజం... అందరి సమష్టి కృషితోనే జాతీయ నూతన విద్యావిధానం లక్ష్యాలను అందుకోవడం సాధ్యపడుతుంది.
- డాక్టర్ గుజ్జు చెన్నారెడ్డి
(అసోసియేట్ ప్రొఫెసర్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం)
ఇదీ చదవండి: భారత రోడ్లపై త్వరలోనే విద్యుత్ కార్ల జోరు!