వెయ్యి మంది నేరస్థులు తప్పించుకున్నా సరే, ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు- న్యాయ వ్యవస్థ మూల సూత్రాల్లో ఇది ముఖ్యమైనది. అందుకే నిందితుడు నేరస్థుడని రుజువయ్యేంత వరకు అతడిని నిర్దోషిగానే పరిగణించాలి, అనవసరంగా అరెస్టు చేసి సమాజంలో తలవంపులు కలిగించకూడదని ఇటీవల సుప్రీంకోర్టు(Supreme Court) స్పష్టం చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక టెండరు కుంభకోణంలో నేరాభియోగం నమోదైన 84 మందిలో ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌ను పురస్కరించుకుని సుప్రీం ఈ వ్యాఖ్య చేసింది. చట్ట ప్రకారం నిందితుడిని అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉన్నంతమాత్రాన దాన్ని దుర్వినియోగం చేయకూడదని జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ హృషీకేశ్ రాయ్‌ల ధర్మాసనం ఉద్ఘాటించింది. నిందితుడు పరారయ్యే అవకాశం, దర్యాప్తును ప్రభావితం చేసే ముప్పు లేనప్పుడు, దర్యాప్తునకు సహకరిస్తున్నప్పుడు అరెస్టు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆ తరహా అరెస్టులు రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిస్వేచ్ఛను(Personal Liberty) హరిస్తాయనీ వ్యాఖ్యానించింది.
ఉత్తర్‌ప్రదేశ్ టెండరు కుంభకోణం కేసు ఒక ట్రయల్ కోర్టు ముందుకు వచ్చినప్పుడు భారత నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ)లోని 170వ సెక్షన్ ప్రకారం నిందితుడిని అరెస్టు చేస్తేకాని ఛార్జిషీటును స్వీకరించబోమని కోర్టు పేర్కొంది. దీనిపై నిందితుడు ముందస్తు బెయిలు కోరుతూ ఏడేళ్ల క్రితం అలహాబాద్ హైకోర్టుకు వెళ్ళగా, అక్కడ అతడి అర్జీ నిరాకరణకు గురైంది. దీంతో నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు సీఆర్‌పీసీ 170 సెక్షన్‌ను పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రంలా ప్రయోగించకూడదని స్పష్టం చేసింది. ప్రతి నిందితుడినీ అరెస్టు చేసిన తరవాతనే ఛార్జిషీటు దాఖలు చేయాలనడం సరికాదని పేర్కొంది. ఈ అంశాన్ని 1980ల నుంచి పలు హైకోర్టులు స్పష్టం చేస్తూనే ఉన్నాయి. అరెస్టు విధివిధానాల గురించి సుప్రీంకోర్టు కూడా 1994లో సమగ్ర మార్గదర్శక సూత్రాలను జారీచేసినా అనవసర అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. టెండరు కుంభకోణం కేసులో నిందితుడికి సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిలు మంజూరు చేసింది.
ఇదీ చదవండి:'దర్యాప్తునకు సహకరిస్తుంటే అరెస్టులు ఎందుకు?'
జైళ్లలో రద్దీ తగ్గేందుకు...
పోలీసులు చేసే అరెస్టులలో 60శాతం అకారణమైనవేనని హైదరాబాద్, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్స్‌లర్ ఫైజాన్ ముస్తఫా కూడా గతేడాది వ్యాఖ్యానించారు. వ్యక్తి స్వేచ్ఛకు రాజ్యాంగం భరోసా ఇస్తోందని, దీన్ని నిరాకరించే హక్కు, అధికారం ప్రభుత్వానికి, పోలీసులకూ లేదన్నారు. అకారణ అరెస్టుల వల్ల జైళ్ల బడ్జెట్‌లో 40శాతం నిధులు వృథా అవుతున్నాయని వివరించారు. ఎవరెన్ని చెప్పినా పోలీసులు అకారణంగా అరెస్టులకు పాల్పడుతూనే ఉన్నారు, విచారణ తెమలకుండా దీర్ఘకాలం జైళ్లలో మగ్గేలా చేస్తున్నారు.
2019 జాతీయ నేర గణాంకాల సంస్థ అంచనా ప్రకారం విచారణ కోసం ఎదురు చూస్తూ జైళ్లలో మగ్గుతున్నవారి సంఖ్య 3,30,487. మొత్తం ఖైదీలలో 70శాతం విచారణలో ఉన్న ఖైదీలే. కొవిడ్ మహమ్మారి ప్రమాదకరంగా పరిణమించిన సమయంలో జైళ్లు కిక్కిరిసిపోయి ఉండటం ఎంతమాత్రం సమంజసం కాదు. పెరిగిన వ్యయాన్ని తట్టుకోవడానికి బడ్జెట్‌లో జైళ్లకు రూ.6,818 కోట్లు కేటాయిస్తున్నారు. ఈ పరిస్థితిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్‌లు గత మే నెలలో ఆందోళన వ్యక్తం చేశారు.
జైళ్లలో రద్దీని తగ్గించడానికి ఖైదీలకు తాత్కాలిక బెయిలు లేదా పెరోల్ ఇవ్వాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఇటీవల స్పష్టం చేసింది. లలిత్, జోసెఫ్‌ల ధర్మాసనం ఈ దిశగా ఆసక్తికరమైన సూచన చేసింది. వేలు, లక్షల సంఖ్యలో జైళ్లలో కుక్కేబదులు, వారిలో చాలామందిని గృహ నిర్బంధంలో ఉంచే విషయాన్ని ఆలోచించాలని, దీనికోసం మన శాసన వ్యవస్థ తగిన చట్టం చేయవచ్చని ఇద్దరు న్యాయమూర్తులు సూచించారు. గౌతమ్ నవ్‌లఖా అనే భీమా కోరేగావ్ ఉద్యమకారుడు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ వారు ఈ ప్రతిపాదన ముందుకుతెచ్చారు.
భీమా కోరేగావ్ కేసులో డజనుమందికిపైగా నిందితుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లలో నమోదు చేయకుండానే అరెస్టు చేశారు. వారిలో పాత్రికేయులు, కళాకారులు, ఉద్యమకారులు, మేధావులు ఉన్నారు. నవ్‌లఖా చాలా రోజులు గృహ నిర్బంధంలో ఉన్నారు. రాజకీయ అసమ్మతీయులను గృహ నిర్బంధంలో ఉంచడం భారతదేశానికి కొత్త కాదని ద్విసభ్య ధర్మాసనం గుర్తుచేసింది. ఇంట్లో ఉండాల్సిన నిర్బంధితుడు బయటకు కాలు పెడితే వెంటనే పోలీసులను హెచ్చరించే ఎలక్ట్రానిక్ కాలిమడమ పట్టీలను విదేశాల్లో ఉపయోగిస్తున్నారని జస్టిస్ కె.ఎం.జోసెఫ్ గుర్తుచేశారు.
ప్రజాధనం వృథా
కొవిడ్ కాలంలో జైళ్లలో రద్దీని తగ్గించే మార్గాలను సూచించడానికి ఉన్నత స్థాయి సంఘాలను నియమించాలని గత మార్చిలో సుప్రీంకోర్టు రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. తాత్కాలిక బెయిలుపై, పెరోలు మీద ఉన్న ఖైదీలతోపాటు విచారణలో ఉన్న ఖైదీలనూ విడిచిపెట్టే విషయాన్ని పరిశీలించాలని కోరింది. ముఖ్యంగా నిరుడు పెరోల్ మంజూరైన వారికి మళ్ళీ ఈ ఏడాది 90 రోజులపాటు బెయిలు ఇవ్వాలని సూచించింది. ఏడేళ్ల లోపు జైలుశిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో విచారణ కోసం ఎదురు చూస్తున్న ఖైదీలను తాత్కాలికంగా విడిచిపెట్టడం మేలు అని అభిప్రాయపడింది.
పోలీసులు, దిగువ కోర్టులు నిందితుల అరెస్టుపై చూపుతున్నంత శ్రద్ధ సక్రమంగా దర్యాప్తు పూర్తి చేసి దోషులను శిక్షించడంపై చూపడం లేదు. అరెస్టులు కొండంత, శిక్షలు గోరంత. దీనివల్ల జైళ్లలో ఖైదీలు పెరిగి, వారిపై బోలెడు ప్రజాధనాన్ని వృథా చేయవలసి వస్తోంది. సుప్రీంకోర్టు సూత్రాలను చిత్తశుద్ధితో పాటిస్తే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది.
వక్రభాష్యంతో తంటాలు
నిందితుల్ని పోలీసు లేక జుడీషియల్ కస్టడీలోకి తీసుకోవాలని సీఆర్‌పీసీ 170వ సెక్షన్ ఎక్కడా నిర్దేశించలేదు. దర్యాప్తు అధికారి ఛార్జిషీటు దాఖలు చేసే సమయంలో నిందితుల్ని కోర్టు ఎదుట హాజరు పరచాలని మాత్రమే పేర్కొంటోంది. అంతమాత్రాన అరెస్టు చేసి మరీ కోర్టుకు తీసుకురావాలని భావించరాదు. దర్యాప్తునకు సహకరిస్తున్నప్పుడు అరెస్టు చేయాల్సిన అవసరమేమిటని సుప్రీం ప్రశ్నించింది. కానీ, దిగువ కోర్టులు 170వ సెక్షన్ సారాంశాన్ని అర్థం చేసుకోకుండా అరెస్టు కోసం పట్టు పడుతున్నాయి. దారుణ నేరం జరిగినప్పుడు లేదా నిందితుల్ని కస్టడీలోకి తీసుకుంటే తప్ప దర్యాప్తు సక్రమంగా జరగదని భావించినప్పుడు మాత్రమే అరెస్టు చేయడం సమర్థనీయం అవుతుందని న్యాయస్థానం పేర్కొంది. అకారణ అరెస్టులు వద్దని సర్వోన్నత న్యాయస్థానం సూచించడం ఇదే మొదటిసారి కాదు. 2014లో అరుణేశ్ కుమార్ వెర్సస్ బిహార్ ప్రభుత్వం, ఇతరుల కేసులో కూడా ఇదే సలహా ఇచ్చింది. బెయిలు ఇవ్వడానికి వీలులేని, శిక్షార్హ నేరాల్లోనూ తొందరపడి అరెస్టు చేయడం తగదని స్పష్టంచేసింది.
- ఆర్య
ఇదీ చదవండి:Population: జనాభా నియంత్రణ బిల్లుతో మరింత ముప్పు!