పఠనం జీవితానికి నాణ్యతను జోడిస్తుంది. బాల్యం నుంచే పుస్తక పఠనం అలవాటు చేసుకొంటే అదో మేధా కార్యకలాపంగా రూపొందుతుంది. భాష, సాహిత్యం, సాంస్కృతిక చైతన్యం పరిమళించడానికి దారులు చూపే గ్రంథాలయాలు- భావితరాలకు చరిత్రను అందించే వేదికలుగా నిలుస్తాయి. గ్రంథాలు లేదా రాతలు పురాతన కాలంలో రాళ్లపై కనిపించేవి. కాలక్రమేణా తాళపత్రాలు, రాగి రేకులు, చర్మాలు, కాగితాలు, తెరలమీదకు రూపాంతరం చెందాయి. మూఢాచారాలను పారదోలి ప్రజల్లో చైతన్యం నింపడానికి ఒకప్పుడు గ్రంథాలయ ఉద్యమాలు నడిచాయి. అవే భారత స్వాతంత్య్ర పోరాటంలో ప్రజలకు సమాచారం చేరవేయడానికి, ఉద్యమ స్ఫూర్తిని రగిలించడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. మహాత్మాగాంధీతో పాటు అనేక మంది జాతీయ నాయకులు, రచయితలు రాసిన వ్యాసాలు, గ్రంథాలు నాడు దేశవ్యాప్తంగా గ్రంథాలయ ఉద్యమాల ద్వారానే ప్రజలకు చేరి, చైతన్యపరచేవి. తరవాతి కాలంలో ప్రజా గ్రంథాలయాల ప్రాధాన్యం మందగించింది. విద్యాలయాల్లో గ్రంథాలయాలు ఎంతో ప్రయోజనకరంగా కొనసాగుతున్నాయి.
తెలుగు తేజాల కీలకపాత్ర
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆచార్యులు భారతీయ గ్రంథాలయాలకు విశేష సేవ చేసిన ఎస్.ఆర్.రంగనాథన్ సేవలకు గుర్తింపుగా- ఆయన జన్మదినమైన ఆగస్టు 12ను భారతీయ గ్రంథాలయ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. గ్రంథాలయాల్లో పుస్తకాలను క్రమ పద్ధతిలో పేర్చడానికి రంగనాథన్ ప్రతిపాదించిన 'ఎనలటికో-సింథటిక్ క్లాసిఫికేషన్' ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆయన సేవలను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటన్ లైబ్రరీ అసోసియేషన్‌కు ఉపాధ్యక్షుడిగా నియమించింది. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఏటా నవంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించే సంప్రదాయం భారత్‌లో 1968లో ప్రారంభమైంది. చదువరులను గ్రంథాలయాలకు ఆకర్షించడానికి ఏప్రిల్‌లో జాతీయ గ్రంథాలయ వారోత్సవాన్ని పాటించే సంప్రదాయాన్ని అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ 1958లో ప్రారంభించింది. తరవాత ఈ సంప్రదాయాన్ని అనేక దేశాలు అనుసరించాయి. భారత జాతీయ గ్రంథాలయ ఉద్యమంలో తెలుగువారిది కీలక పాత్ర.
గ్రంథాలయ ఉద్యమ రూపశిల్పిగా పేరుగాంచిన అయ్యంకి వెంకట రమణయ్య అధ్యక్షతన అఖిల భారత గ్రంథాలయ సమావేశం 1912 నవంబర్ 12న అప్పటి మద్రాసులో జరిగింది. ఈ సమావేశం భారతీయ గ్రంథాలయ సంఘానికి నాంది పలికింది. దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగునాట గ్రంథాలయ ఉద్యమాన్ని ఒక బాధ్యతగా తీసుకొన్న రాజకీయ నాయకులు, కవులు, విద్యావేత్తలు దేశభక్తితో పాటు సాంఘిక సంస్కరణలపై ప్రజలను చైతన్యపరచారు. తెలంగాణ ప్రాంతం నుంచి వట్టికోట ఆళ్వారుస్వామి గ్రంథాలయ ఉద్యమానికి ఎనలేని సేవ చేసి తదుపరి ఉద్యమకారులు కోదాటి నారాయణరావు, సురవరం ప్రతాపరెడ్డిలకు స్ఫూర్తినిచ్చారు. ఆధునిక పద్ధతిలో తొలి గ్రంథాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసినట్లు పరిశోధకులు వెల్లడించారు. హైదరాబాద్‌లోని శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషానిలయం, వరంగల్‌లోని రాజరాజ నరేంద్ర భాషానిలయం వందేళ్ల చరిత్ర కలిగినవి. తెలుగు రాష్ట్రాల్లో శతవసంతాలు పూర్తి చేసుకొన్న గ్రంథాలయాలు 25కు పైగా ఉండటం తెలుగు నాట గ్రంథాలయోద్యమం ఎలా నడిచిందో తెలియజేస్తుంది.
ప్రపంచంలోనే అతి పెద్ద గ్రంథాలయంగా పేరుగాంచిన 'లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్' అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఉంది. ఇందులో 15.50 కోట్ల గ్రంథాలు, అయిదు కోట్లకు పైగా రాతప్రతులు ఉన్నాయి. లండన్‌లో 'నేషనల్ బ్రిటిష్ లైబ్రరీ'లో 15 కోట్ల పుస్తకాలు ఉన్నాయి. 1836లో ప్రారంభమైన కలకత్తా భారత జాతీయ గ్రంథాలయంలో 22 లక్షల పుస్తకాలు ఉన్నాయి. అమెరికా, బ్రిటన్ గ్రంథాలయాలతో పోలిస్తే దీంట్లో పుస్తకాల సంఖ్య చాలా తక్కువ. పాఠశాల గ్రంథాలయాల నిర్వహణలో ఐరోపా దేశాలు ముందంజలో ఉన్నాయి. పాఠశాలల్లో గ్రంథాలయాలను అభివృద్ధిపరచి పిల్లల్లో పఠనాసక్తి పెంచాలని గతంలో మద్రాసు హైకోర్టు- తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
'డిజిటల్'కు ప్రాధాన్యం
కొవిడ్ మహమ్మారి సంక్షోభంతో గ్రంథాలయాల వినియోగం మరింతగా తగ్గి డిజిటల్ లేదా ఆన్‌లైన్ గ్రంథాలయాల ప్రాధాన్యం పెరిగింది. వీటిలో పుస్తకాలే కాకుండా వీడియోలు, యానిమేషన్ చిత్రాలు సమాచారాన్ని అందిస్తాయి. 2016లో భారత కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రారంభించిన జాతీయ డిజిటల్ లైబ్రరీ- జాతీయ, అంతర్జాతీయ గ్రంథాలను ఒక గొడుగు కిందకు తెచ్చింది. ఇందులో కేంద్రీయ పాఠ్యపుస్తకాలతో సహా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 20కి పైగా బోర్డుల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. సామాన్య ప్రజలకు ఉపయోగపడే అనేక రకాల ఇతర పుస్తకాలు సైతం ఇందులో లభిస్తాయి. ప్రస్తుతం ఆన్‌లైన్ బోధనలో భాగంగా డిజిటల్ ఉపకరణాలను వినియోగిస్తున్న విద్యార్థులు- సామాజిక మాధ్యమాలు, ఇతరాలను వీక్షించడమూ ఎక్కువైందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అనేక ప్రాథమిక గ్రంథాలు ముఖ్యంగా విజ్ఞాన సర్వస్వం వంటి ప్రతిష్ఠాత్మక గ్రంథాలు అంతర్జాలంలో అందుబాటులో ఉన్నా- వాటిని ఉపయోగించుకోవడంలో విద్యార్థిలోకం వెనకబడింది. పఠనాసక్తి క్రమేపీ తగ్గుతున్న నేటి తరం విద్యార్థుల్లో గ్రంథాలయోద్యమ స్ఫూర్తి రగిలించాల్సిన అవసరం ఉంది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రభుత్వాలు, విద్యావేత్తలు, కవులు, రచయితలు చొరవ తీసుకోవాలి.
-- డాక్టర్ గుజ్జు చెన్నారెడ్డి
ఇదీ చదవండి: