కోరసాచిన కొవిడ్ మహమ్మారి- వైద్యఆరోగ్య రంగాల్లో సమున్నత ప్రమాణాలతో రాణిస్తున్న పలు సంపన్న రాజ్యాలనే తల వేలాడేసేలా చేసింది. ఆరోగ్యసేవల అందుబాటు, వాటి నాణ్యతలే కొలబద్దగా మదింపు వేస్తే మొత్తం 195 దేశాల్లో 145వ స్థానంలో నిలిచి ఈసురోమంటున్న ఇండియా దయనీయావస్థ గురించి చెప్పేదేముంది?
2017నాటి జాతీయ ఆరోగ్య విధానం- ప్రజారోగ్య వ్యయాన్ని స్థూల దేశీయోత్పత్తిలో 2.5 శాతం దాకా పెంచాలని, ఆ పెంపుదల 2025నాటికి క్రమానుగతంగా సాకారం కావాలని ప్రతిపాదించింది. ఉరుములేని పిడుగులా ఊడిపడిన కొవిడ్ దేశ వైద్యఆరోగ్య రంగం బలహీనతల విశ్వరూపాన్ని కళ్లకు కడుతున్న నేపథ్యంలో- ఎన్‌కే సింగ్ సారథ్యంలోని పదిహేనో ఆర్థిక సంఘం దిద్దుబాటు చర్యలపై ప్రధానంగా దృష్టి సారించింది.
2021-2026 నడిమి కాలానికి రూ.4.99 లక్షల కోట్ల కేటాయింపులు కావాలని మొదట కోరిన కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ అదనపు డిమాండ్లను చేర్చి మొత్తం రూ.6.04 లక్షల కోట్లు మంజూరు చెయ్యాలంటోంది! వైద్యారోగ్య రంగ వ్యయంలో కేంద్రం వాటా 35శాతం కాగా తక్కినవి రాష్ట్రాలు భరిస్తున్నాయి. స్థూల దేశీయోత్పత్తిలో 1.3 శాతం లోపే ఉన్న కేటాయింపులు- దశాబ్దాలుగా కోట్లాది అభాగ్య జనావళికి ఆరోగ్య మహాభాగ్యాన్ని దూరం చేస్తున్నాయి. ఈ దురవస్థను దునుమాడేలా ప్రజారోగ్య రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నదానిపై మరోమాట లేకపోయినా, కొవిడ్ కారణంగా దేశార్థికమే కకావికలమైపోయిన పరిస్థితుల్లో భూరినిధుల్ని ఎక్కడి నుంచి ఎలా తీసుకురావాలన్న ప్రశ్నే ప్రధానంగా వేధిస్తోంది. ఆరోగ్య సంరక్షణకు అవసరమైన మౌలిక సదుపాయాల్ని జిల్లాస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన రూ.60 వేలకోట్ల పథకానికి రుణసాయం చేసే అంశం ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంక్ పరిశీలనలో ఉంది. ఈ రుణ వితరణ కసరత్తు సాకారమైతే- కొరతల కోమాలో అచేతనంగా ఉన్న ప్రజారోగ్య రంగానికి కొత్త ఊపిరి చిక్కుతుంది!
వైద్యం కొనలేక చితికిపోతున్నాం..
పాలకుల ఉదాసీనత ప్రజారోగ్య రంగాన్ని ఎంతగా భ్రష్టుపట్టించిందీ ఎన్నో అధ్యయనాలు ఎలుగెత్తుతున్నాయి. సరైన వైద్య సేవలందక దేశంలో ఏటా ప్రాణాలు వదులుతున్న అభాగ్యుల సంఖ్య 24 లక్షలని పార్లమెంటరీ స్థాయిసంఘమే నిష్ఠుర సత్యం పలికింది. కుటుంబంలో ఎవరు అనారోగ్యం పాలపడినా వైద్యఖర్చులు భరించే స్థోమత కరవై ఏటా ఆరుకోట్ల మంది ఆర్థికంగా చితికిపోతున్న దేశం మనది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణిక నిర్దేశాల అనుసారం ప్రతి వెయ్యిమంది రోగులకు ఒక వైద్యుడు అవసరం కాగా, జర్మనీలో నిష్పత్తి 4.3, ఆస్ట్రేలియాలో 3.7, యూకేలో 2.9, అమెరికాలో 2.6, చైనాలో ఇద్దరు వైద్యులుండగా ఇండియాలో దాదాపు 1,500 మందికి ఒకే వైద్యుడున్న దుస్థితి నెలకొంది. 60శాతానికి పైగా జనాభా పల్లెపట్టుల్లో ఉంటే, 70శాతం పైగా వైద్యులు, ఆరోగ్య వ్యవస్థ పట్టణాలకే పరిమితమైన తీరు- స్వస్థ సేవల్లో దారుణ అసమానతల్ని కళ్లకు కడుతోంది.
ఆరోగ్యాన్ని దేశ ప్రజల ప్రాథమిక హక్కుగా నిర్ధారించి వచ్చే ఏడాది భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రకటించాలని పదిహేనో ఆర్థిక సంఘం నియమించిన ఉన్నత స్థాయి నిపుణుల బృందం సిఫార్సు చేసింది. క్షేత్రస్థాయిలో అవ్యవస్థను సరిదిద్దకుండా అలాంటి సదాశయ ప్రకటనలతో ఒరిగేది ఏముంది? దేశీయంగా అల్లోపతి వైద్యుల్లో ఎకాయెకి 57శాతం వైద్యపరమైన అర్హతలు లేనివారేనని కేంద్రం నివేదికలే ఘోషిస్తున్నందున- ప్రభుత్వాలు తక్షణ, మధ్య, దీర్ఘకాలిక కార్యాచరణ వ్యూహాలకు సానపట్టాలి. ప్రస్తుతం దేశం ఆరు లక్షల మంది వైద్యులు, 20 లక్షలమంది నర్సుల కొరత ఎదుర్కొంటున్నందున- భావి ధన్వంతరుల సృష్టికి దీర్ఘకాలిక వ్యూహం తప్పనిసరి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిపుష్టి ద్వారా కేరళ సాధించిన ప్రగతి అన్ని రాష్ట్రాలకూ గుణపాఠం కావాలి. అప్పులుగా దూసితెచ్చే ప్రతిపైసా సద్వినియోగమైతేనే ప్రజారోగ్య రంగం తెప్పరిల్లేది!
ఇదీ చదవండి: 'మోదీ నిర్ణయాల వల్లే కేసుల్లో భారత్ ముందుంది'