దేశంలో అయిదేళ్ల లోపు పిల్లల్లో పౌష్టికాహార లోపాలు పెచ్చరిల్లుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5) ఇటీవలే ధ్రువీకరించింది. కేంద్ర అభివృద్ధి అజెండాలో పోషకాహారానికి విశేష ప్రాధాన్యం కల్పించాలన్న నీతి ఆయోగ్ సూచనలూ సిఫార్సులకు దీటుగా స్పందించాల్సిన కేంద్రప్రభుత్వం తన వంతుగా చేసిందేమిటి? విధ్యుక్త ధర్మానికి నీళ్లొదిలేసింది! 'పోషణ్ అభియాన్' మలి అంచెకు సర్వసన్నద్ధతతో ముందడుగేయాల్సిన దశలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుందన్న ఆశలు చివరికి అడియాసలయ్యాయి. తాజా బడ్జెట్లో శిశు సంక్షేమానికి కేటాయింపులు కుంగిపోయాయి. బడ్జెట్ ప్రతిపాదనల్ని లోతుగా మథిస్తే సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్) పద్దు అయిదువేల కోట్లరూపాయల దాకా తెగ్గోసుకుపోయి సుమారు రూ.21వేల కోట్లకు పరిమితమైన వైనం ప్రస్ఫుటమవుతుంది.
ప్రాథమ్యాలు గాడితప్పి..
గ్రామం, నివాస సముదాయాల స్థాయిలో మాతాశిశు ఆరోగ్యం, పౌష్టికాహార బాధ్యతల్ని పూర్తిగా అంగన్‌వాడీ కేంద్రాలకే దఖలు పరచాలని, అక్కడే వైద్యుల సేవలూ అందుబాటులోకి రావాలని ఆ మధ్య నీతి ఆయోగ్ కార్యాచరణ వ్యూహాన్ని సూచించడం తెలిసిందే. అంగన్‌వాడీ కేంద్రాలన్నింటా తగినంతమంది సహాయకుల నియామకాలు చేపట్టాలని, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు మెరుగైన శిక్షణ అందుతుండాలనీ అప్పట్లో అది గిరిగీసింది. మహిళ గర్భం దాల్చింది మొదలు వెయ్యి రోజుల వ్యవధిలో శిశువుల మెదడు 90 శాతం దాకా వికాసానికి నోచుకుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ స్పృహతో, వాస్తవికావసరాలకు అనుగుణంగా నిధుల లభ్యత పెంపొందించాల్సిన దశలో- పెంపుదల మాట అలా ఉంచి, ఉన్న కేటాయింపులకే అంటకత్తెర వేయడమేమిటి? ప్రాథమ్యాలు గాడి తప్పిన దుస్థితి ఆరోగ్యం, పోషకాహారం, ఆహార హక్కుల నిపుణులనే కాదు- బాలభారతం దయనీయావస్థ గురించి కనీస అవగాహన కలిగిన ప్రతి ఒక్కరినీ విస్మయపరుస్తోంది!
కరవైన ప్రాథమిక సదుపాయాలు
ఆరేళ్ల లోపు పిల్లలు, కిశోర బాలికలు, బాలింతలు, చూలింతలందరికీ ఏడాదిలో 300 రోజులపాటు పోషకాహారం అందించాలన్నది దాదాపు మూడు దశాబ్దాలనాటి సర్వోన్నత న్యాయస్థాన నిర్దేశం. అంతకుముందు నుంచే, ఇప్పటికి నాలుగున్నర దశాబ్దాలుగా దేశంలో ఐసీడీఎస్ అమలవుతోందన్నది నిజం. వ్యాధినిరోధక టీకాల సక్రమ సరఫరా, పౌష్టికాహార పంపిణీల నిమిత్తం దేశంలో 17లక్షల అంగన్‌వాడీ కేంద్రాలు నెలకొల్పాలని సుప్రీంకోర్టు ఏనాడో సూచించినా.. నేటికీ వాటి సంఖ్య 13.77 లక్షలకు మించలేదు. అందులోనూ నాలుగో వంతుకు తాగునీటి వసతి కొరవడిందని, 36శాతం కేంద్రాల్లో మరుగుదొడ్డి సదుపాయమే కరవని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అనేక అంగన్‌వాడీలు అధికార సిబ్బంది అక్రమార్జన కేంద్రాలుగా పరువు మాస్తున్నాయి. తరతమ భేదాలకు తావివ్వకుండా అంగన్‌వాడీలన్నింటినీ తాగునీరు, విద్యుత్ సహా సకల విధాల పరిపుష్టీకరించాలన్న సిఫార్సులు నిలువునా నీరోడుతుండటమే- ప్రపంచంలోనే అతిపెద్ద పోషకాహార పథకాన్ని కొన్నేళ్లుగా గుల్లబారుస్తోంది.
పోషకాహార లేమితో..
అయిదో పుట్టిన రోజైనా చూడకుండా అర్ధాంతరంగా చనిపోతున్న బాలల్లో 68శాతం మరణాలకు నేరుగా కారణమవుతున్నది... పోషకాహార లేమి. పాత తప్పిదాలనుంచి పాఠాలు నేర్చి పౌష్టిక లోపాల్ని నియంత్రిస్తున్నట్లు ప్రభుత్వ యంత్రాంగం చాటుకుంటున్నా- ఏటా ఏడు లక్షల మంది వరకు పిల్లల బలిదానం ఆగక కొనసాగుతోంది. కొవిడ్ సంక్షోభం దృష్ట్యా అదనంగా 40లక్షల మంది బాలబాలికల్లో పోషకాహార లోపాలు తీవ్రతరమవుతున్నట్లు ‘గ్లోబల్ హెల్త్ సైన్స్’ పత్రిక ఏడు నెలల క్రితమే హెచ్చరించింది. క్షేత్ర స్థాయి స్థితిగతుల్ని ప్రక్షాళించకుండా, మేలిమి సూచనల్ని పట్టించుకోకుండా కనబరుస్తున్న అలసత్వమే- ప్రపంచవ్యాప్తంగా గిడసబారిపోతున్న పిల్లల్లో 30శాతం, ఈసురోమంటున్నవారిలో 50శాతానికి ఇండియా పురిటిగడ్డగా భ్రష్టుపట్టడానికి పుణ్యం కట్టుకుంటోంది. భావి తరానికి జవసత్వాలు సమకూర్చనిదే శ్రేష్ఠ్ భారత్ ఎలా అవతరిస్తుంది?
ఇదీ చదవండి :బాలీవుడ్ ట్విట్టర్ వార్ వయా రైతు నిరసనలు