ETV Bharat / opinion

ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదీ మూల్యం!

కొవిడ్​ సంక్షోభంతో భారత్​లో కొరవడిన వైద్యసేవలు, స్వాస్థ్య వ్యవస్థ పరిమితులు బట్టబయలయ్యాయి. 2021-22 వార్షిక బడ్జెట్‌లో తమకు సుమారు లక్షా 21వేల కోట్ల రూపాయలు అనుగ్రహించాల్సిందిగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కోరినా.. అందులో రూ.50వేల కోట్లు కోతపెట్టినట్లు పార్లమెంటరీ స్థాయీసంఘం నివేదికాంశాలే చాటుతున్నాయి. బడ్జెట్‌లో జనారోగ్యం యోగక్షేమాలకు సుమారు రూ.2.23 లక్షల కోట్లు ప్రత్యేకించినట్లు విత్తమంత్రి ఘనంగా ప్రకటించినా.. అందులో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వాయుకాలుష్య నియంత్రణ లాంటి పద్దులంటిన్నింటినీ కలగలిపారు. సుప్రీంకోర్టు చెప్పినట్లు.. చికిత్సా వ్యయం భరించదగ్గ స్థాయిలో ఉండటం ఆరోగ్య హక్కులో అంతర్భాగం. అందుకు తగినట్లు విధాన రచన గాడిన పడి, కేటాయింపులు ఇతోధికమైనప్పుడే దేశంలో అర్థవంతమైన ఆరోగ్య సంరక్షణ సాధ్యపడుతుంది.

North Block
కేంద్ర ప్రభుత్వం, నార్త్​బ్లాక్​
author img

By

Published : May 11, 2021, 7:07 AM IST

నూట ముప్ఫై తొమ్మిది కోట్లకు పైబడిన విశాల జనబాహుళ్యానికి దీటైన వైద్యసేవల విస్తృతి కొరవడ్డ భారత్‌లో.. స్వాస్థ్య వ్యవస్థ పరిమితుల్ని కొవిడ్‌ మహా సంక్షోభం బట్టబయలు చేసింది. సగటు పౌరులకు కొవిడ్‌ రక్షణ అందని ద్రాక్షలా మారిందని ఆమధ్య సుప్రీంకోర్టు ధర్మాసనం సూటిగా తప్పుపట్టగా- ప్రాణదీపాలు కొడిగట్టకుండా కాచుకోవడంలో పాలకగణం అలసత్వాన్ని గర్హిస్తూ వివిధ హైకోర్టులూ ఇటీవల గట్టిగా తలంటేశాయి. ఈ దురవస్థకు ప్రబల హేతువేమిటో విదేశాంగ వ్యవహారాల శాఖామాత్యులు జైశంకర్‌ మొన్నీమధ్యే సూత్రీకరించారు. ఏడున్నర దశాబ్దాల తరబడి ఆరోగ్య రంగం సముచిత కేటాయింపులకు నోచనేలేదన్నది ఆయన వెల్లడించిన వాస్తవం. మునుపటి ప్రభుత్వాలనేముంది, కేంద్రంలో ప్రస్తుతం చక్రం తిప్పుతున్న ఎన్డీయే సర్కారు ఏలుబడిలోనూ దుస్థితి కొనసాగుతోందన్నది యథార్థం.

బడ్జెట్​లో కోతలు..

2021-22 వార్షిక బడ్జెట్‌లో తమకు సుమారు లక్షా 21వేల కోట్ల రూపాయలు అనుగ్రహించాల్సిందిగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కోరినా- అందులో రూ.50వేల కోట్లదాకా తెగ్గోసినట్లు పార్లమెంటరీ స్థాయీసంఘం నివేదికాంశాలే చాటుతున్నాయి. బడ్జెట్‌లో జనారోగ్యం యోగక్షేమాలకు ఎకాయెకి రూ.2.23లక్షల కోట్లు ప్రత్యేకించినట్లు విత్తమంత్రి ఘనంగా ప్రకటించినా- అందులో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వాయుకాలుష్య నియంత్రణ లాంటి పద్దుల్నీ కలగలిపి మసి పూసి మారేడు చేశారు. అరకొర కేటాయింపుల్లో సిబ్బంది జీతభత్యాలకు పోను మౌలిక వసతుల పరికల్పన, అత్యవసర దిద్దుబాటు చర్యలు, పరిశోధనలకు నికరంగా మిగిలేదెంత? ఆరోగ్య సంరక్షణ నిమిత్తం కేంద్రం విదిల్చేది అంతంత మాత్రమేనని, రాష్ట్రాలూ కేంద్రపాలిత ప్రాంతాలు తమ బడ్జెట్లలో ఎనిమిది శాతం మేర వైద్యరంగానికి కేటాయించాలన్న జాతీయ విధాన స్ఫూర్తి సైతం నీరోడుతున్నదంటున్న స్థాయీసంఘం నివేదిక- దేశవ్యాప్త అవ్యవస్థను కళ్లకు కడుతోంది. కనుకనే, కొవిడ్‌ విజృంభణ వేళ ప్రజల ప్రాణాలు ఇలా గాలిలో దీపాలయ్యాయి.

ఆ విషయంలో 158వ స్థానంలో​..

స్వీడన్‌, జపాన్‌ తదితరాలు తమ జీడీపీ(స్థూల దేశీయోత్పత్తి)లో తొమ్మిది శాతానికి పైగా నిధుల్ని వైద్య ఆరోగ్య రంగానికి కేటాయిస్తుండగా- ఇండియాలో ఆ మొత్తం కేవలం 1.4 శాతం. దేశాల వారీగా ఆరోగ్య పద్దుల్ని సరిపోల్చి అందులో ఇండియాది భ్రష్ట రికార్డుగా ప్రపంచ బ్యాంకు గణాంకాలు, 'ఆక్స్‌ఫామ్‌' నివేదిక వంటివి లోగడే ధ్రువీకరించాయి. జర్మనీ, బెల్జియం, యూకే, స్వీడన్‌ ప్రభృత దేశాలు దశాబ్దాలుగా సార్వత్రిక స్వాస్థ్య ప్రణాళికలు అమలు పరుస్తూ మన్ననలందుకుంటున్నాయి. అందుకు విరుద్ధంగా వైద్యరంగాన ప్రభుత్వ వ్యయం ప్రాతిపదికన 196 దేశాల జాబితాలో 158వ స్థానానికి పరిమితమై ఇండియా కునారిల్లుతోంది. పౌరుల ఆరోగ్య వ్యయంలో సొంత ఖర్చుకు సంబంధించి అంతర్జాతీయ సగటు 18 శాతమైతే, భారత్‌లో చికిత్సకయ్యే ఖర్చులో 63 శాతందాకా జనమే భరించాల్సి వస్తోంది.

పిట్టల్లా రాలిపోతున్న అమాయక జనం..

దేశంలో 80 శాతం కుటుంబాలు ఆస్పత్రి బిల్లులు చెల్లించలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయన్న డెబ్భై అయిదో జాతీయ నమూనా సర్వే ధ్రువీకరణ, ఆరోగ్య రంగానికి అత్యవసర చికిత్స ఆవశ్యకతను ఎలుగెత్తింది. 'స్వస్థతే జాతికి సురక్ష' అనే స్ఫూర్తికి కార్యాచరణలో తూట్లుపడి- ఆస్పత్రి పడకలు, ఆక్సిజన్‌ సరఫరా, వెంటిలేటర్ల సదుపాయాలు అందుబాటులో లేక అభాగ్యులెందరో పిట్టల్లా రాలిపోతున్నారిప్పుడు. ప్రస్తుత జనారోగ్య సంక్షోభానికి మూలాలు ప్రభుత్వ విధానాల్లోనే ఉన్నాయి. సుప్రీంకోర్టు చెప్పినట్లు- చికిత్సా వ్యయం భరించదగ్గ స్థాయిలో ఉండటం ఆరోగ్య హక్కులో అంతర్భాగం. అందుకు తగినట్లు విధాన రచన గాడిన పడి, కేటాయింపులు ఇతోధికమైనప్పుడే దేశంలో అర్థవంతమైన ఆరోగ్య సంరక్షణ సాధ్యపడుతుంది. ఆరోగ్య రంగానికి కాయకల్ప చికిత్స ఒక్కటే, జాతిని తెరిపిన పడేయగలిగేది!

ఇదీ చదవండి:ఈసీ అడ్డగోలు వాదనలు - సుప్రీంకోర్టు మొట్టికాయలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.