ప్రశ్న: కాంగ్రెస్‌లో పాతతరం వర్సెస్ యువతరం అన్న చర్చ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో పాటు నాయకత్వ సంక్షోభం కూడా ఉందని తెలుస్తోంది. అసలు సమస్య ఏంటి?
నాయకత్వం విషయంలో ఎలాంటి సమస్య లేదు. 23 మంది సీనియర్ నేతలు(సోనియా గాంధీకి లేఖ రాసిన అసమ్మతి నేతలు) కూడా కాంగ్రెస్ సమస్యలకు పరిష్కారం నాయకత్వ మార్పులో ఉందని సూచించలేదు. నాయకత్వ లోపం ఉందని భావిస్తే.. ఏఐసీసీ సెషన్ జరిగినప్పుడు వారిలో ఎవరో ఒకరు లేచి పోటీలో నిలబడేవారు. గతంలో సోనియా గాంధీకి 9400 ఓట్లు, ప్రత్యర్థిగా నిలిచిన జితేంద్ర ప్రసాదకు 94 ఓట్లు వచ్చాయి. ఆ ఫలితాలే వారికీ పునరావృతమయ్యేవి.
స్వాతంత్య్ర ఉద్యమం నుంచి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 20 ఏళ్ల వరకు అన్ని సామాజిక సమూహాలు కాంగ్రెస్‌తో కలిసే ఉండేవి. 1967 జాతీయ ఎన్నికల వల్లే భారత జాతీయ కాంగ్రెస్(ఐఎన్ఎస్) నుంచి విడిపోయి.. అందరూ సొంత మార్గాలు ఎన్నుకున్నారు. 1990లో మండలాలు ఏర్పడిన తర్వాత వెనుకబడిన అనేక వర్గాలు తమను ప్రత్యేక సమూహాలుగా ఏర్పరచుకున్నాయి. వెనుకబడిన వర్గాలలో యాదవులు అందరికంటే ముందున్నారని, షెడ్యూల్డ్ కులాల్లో జాతవులు అందరికంటే ముందున్నారని వర్గీకరించుకున్నారు. బాబ్రీ ఘటన తర్వాత కూడా మరో గందరగోళం ఏర్పడింది. ముస్లింలు సామూహికంగా కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు. ఇలా అందరూ కాంగ్రెస్‌ను వీడి వెళ్లిపోవడం నాయకత్వ సమస్యగా చూడకూడదు.
సమస్యకు పరిష్కారం ఒకటే. విడిపోయిన సామాజిక సమూహాలను తిరిగి ఏకతాటిపైకి తీసుకురావడం. ముఖ్యంగా ప్రాంతీయ, కుల, సమాజ ప్రాతిపదికన ఏర్పడిన పార్టీలు కూటమిలో చేరడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. ఇక్కడ కేరళ మోడల్ అనుసరించాలి. ఆ రాష్ట్రంలో.. ఎన్నికలు పూర్తయిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వం కోసం అన్ని వర్గాలు ముందుకొస్తాయి. సొంత గుర్తింపును కాపాడుకుంటూనే.. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేయాల్న దానిపై ప్రత్యేకమైన నిబంధనలు రూపొందించుకుంటాయి. కూటమి అధికారం చేపడితే అందరికీ ప్రత్యేకమైన శాఖలు కేటాయించి తగిన ప్రాధాన్యం ఇస్తారు.
ప్రశ్న: మీకు సంకీర్ణం ఎందుకు అవసరం? ఈ ప్రాంతీయ పార్టీలు అన్నీ కాంగ్రెస్ అనే గొడుగు కింద పనిచేయాలనుకుంటున్నారా?
ప్రస్తుతం భారతీయ జనతా పార్టీని ఓడించే ఏకైక మార్గం సంకీర్ణం మాత్రమే. ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ సహకారంతో పనిచేయాలని సూచిస్తున్నాను. అందరూ మా నాయకత్వంలోకి వస్తారని చెప్పడం ప్రారంభిస్తే ఎవ్వరూ ఆ నిర్ణయాన్ని అంగీకరించరు. సంకీర్ణ ప్రభుత్వం వస్తే.. అత్యధిక సంఖ్యలో సీట్లు గెలిచిన పార్టీ లేదా ఆ దశలో ఆమోదయోగ్యమైన మరే ఇతర ఫార్ములా ద్వారా అయినా ఏ పార్టీ అయినా నాయకత్వం వహించవచ్చు. 2024లో భాజపాను గద్దె దించాలంటే కేరళ తరహా అఖిల భారత ఐక్య ప్రజాస్వామ్య ఫ్రంట్ అవసరమని నా అభిప్రాయం.
ప్రశ్న: వరుసగా రెండు జాతీయ ఎన్నికల్లో.. కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా పదవిని పొందటానికి లోక్‌సభలో కనీస 10 శాతం(54) సీట్లు సంపాదించలేకపోయింది. దానిపై మీ అభిప్రాయం..?
వాస్తవానికి ఇది పెద్ద సవాలు. మాకు నాయకత్వం చేపట్టే అవకాశం వస్తే ఎక్స్ పోస్ట్ ఫాక్టో తీసుకోవాలి. నా సొంత రాష్ట్రం తమిళనాడులో 1967 నుంచి మేము అధికారంలో లేము. భవిష్యత్‌లో కనీసం 600 సంవత్సరాలు అక్కడ అధికారంలో ఉండకపోవచ్చు. కాంగ్రెస్ మద్దతుదారులు లేని గ్రామం తమిళనాడులో ఒక్కటైనా లేదు. అదే మాకు డీఎంకే, ఏఐడీఎంకే రెండింటితోనూ పొత్తు కుదుర్చుకోగల అవకాశం ఇచ్చింది. 1991లో ఏఐడీఎంకేతో మా కూటమి తమిళనాడులోని మొత్తం 39 పార్లమెంటరీ స్థానాలను గెలుచుకుంది. పార్లమెంటరీ రాజకీయాల్లో విశిష్టత ఇది. మనం ఎక్కడ పోటీ చేస్తున్నాం అనే అంశాన్ని గుర్తించి, మద్దతిచ్చే వర్గాలను తిరిగి సంపాదించడం కీలకం.
ప్రశ్న: ప్రస్తుతానికి కాంగ్రెస్‌కు ఎన్నికల ద్వారా వచ్చే అధ్యక్షుడు అవసరమా?
ప్రస్తుత నాయకత్వం అంతర్గతంగా అన్ని అంశాలపై ఎక్కువ దృష్టిసారిస్తే మరింత మంచిది. రాహుల్ గాంధీ.. తనకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనటానికి కాంగ్రెస్‌కు ప్రతి అవకాశాన్ని ఇచ్చారు. రాహుల్‌తో పాటు సోనియా, ప్రియాంక బాధ్యతలు స్వీకరించమని వెనక్కి తగ్గారు. అయితే కాంగ్రెస్‌లో నాయకత్వం వహించే అభ్యర్థిగా ముందుకు రావడానికి కాంగ్రెస్‌లో ఎవరూ లేరు. భాజపా లక్ష్యం కాంగ్రెస్ ముక్త్ భారత్. గాంధీ-ముక్త్ కాంగ్రెస్ ఉంటే వారు అందులో విజయం సాధించినట్లే. అందుకే మేము నాయకత్వం అంశంపై సమయాన్ని వృథా చేయాలనుకోవట్లేదు.
ప్రశ్న: మీరు గాంధీలే అనివార్యమని భావిస్తున్నారా? పార్టీని బలోపేతం చేయడం ఎలా?
ముగ్గురు గాంధీల్లో ఒకరు అధికారంలో ఉండాలని తప్ప వేరే ఆలోచనే లేదు. రాహుల్ కోరుకుంటే ఆయనే అధ్యక్షుడు కావచ్చు. ఆయన పార్టీకి అందుబాటులో ఉంటానని చెప్తున్నారు. కానీ నాయకత్వం చేపట్టడానికి ఇష్టపడని వ్యక్తిని ఎలా ముందుకు నెట్టాలి? సోనియా అనారోగ్యంతో ఉన్న ఈ సమయంలో రాహుల్ మనసు మార్చుకోవాలి. లేదంటే ప్రియాంకకు బాధ్యతలు ఇవ్వాలి.
ఒక పార్టీగా మా ఏకైక శత్రువు భాజపా. మేము కోల్పోయిన సామాజిక సమూహాలను తిరిగి తీసుకురావడానికి బలమైన పొత్తులు ఏర్పాటు చేసుకోవాలి. గాంధీ నాయకత్వంలో అందరూ ఒక తాటిపైకి వచ్చి.. రాబోయే నాలుగేళ్లు పోరాడాలి. దాని వల్ల మంచి ఫలితాన్ని అందుకోగలమని ఆశిస్తున్నాం. మేము లోక్‌సభలో 52 స్థానాలకు పరిమితం కావడానికి కారణం పార్టీ బలహీనంగా ఉండటం కాదు. 2019 లో ఉన్న భాజపాయేతర ఓటు శాతం 63. ఆ ఓట్లన్నీ చీలిపోవడమే ఓటమికి కారణం. మేము వారందరినీ కలుపుకోవాలి. కఠినమైన నాయకత్వంలో బలమైన, ఐక్య పార్టీగా కనిపిస్తే.. కాంగ్రెస్ విశ్వసనీయతను తిరిగి సంపాదించుకుంటుంది. ఒక గాంధీ మాత్రమే అలాంటి నాయకత్వాన్ని అందించగలరని నా నమ్మకం. ఐదు తరాల గాంధీలు కాంగ్రెస్‌కు నాయకత్వం వహించారు. పార్టీలో అధ్యక్ష పదవిపై ఏకాభిప్రాయం లేకపోతే.. ఇప్పటివరకు పార్టీలో ఉన్నత పదవిని చేపట్టని కొత్త వ్యక్తిని ప్రయత్నించి చూడొచ్చు.
ప్రశ్న: ప్రియాంకా గాంధీ వాద్రా మీ ఛాయిస్ ఆ..?
లేదు. నా ఎంపిక గాంధీ మాత్రమే. ఎవరినైతే కాంగ్రెస్ కుటుంబం ఎంచుకుంటుందో వాళ్లూ ఓకే.
ప్రశ్న: గాంధీయేతర కాంగ్రెస్ అధ్యక్షుడి గురించి 2019 నుంచి కొంత చర్చ జరుగుతోంది. అది మంచి ఎంపిక అని మీరు భావిస్తున్నారా..?
నేను యువకుడిగా ఉన్నప్పుడు ప్రముఖ హిందీ నటి మధుబాల నాకు దక్కాలని కోరుకున్నాను. కానీ అది జరగలేదు. కాంగ్రెస్‌కు గాంధీయేతరుడు అధ్యక్షుడుగా ఉండాలనే డిమాండ్ అలాంటిదే. 'గాంధీ'లు ఉన్నంతవరకు ఏ గాంధీయేతరుడు ఆ పదవిలో కూర్చోలేరు.
ప్రశ్న: అంతర్గత ఎన్నికలపై మీ అభిప్రాయం ఏంటి?
ఈ విషయంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1990లో ఏం చెప్పారో.. 2007 నుంచి రాహుల్ అదే మాట చెబుతున్నారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియాలో అంతర్గత ఎన్నికలు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీలో కొన్ని వివాదాలు నెలకొన్నప్పటికీ అవన్నీ పెద్దగా పట్టించుకోనవసరం లేదు. 23 మంది సీనియర్ నాయకులు చేసిన కొన్ని ప్రతిపాదనలను పార్టీ అంగీకరిస్తుందని.. అవన్నీ అమలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నా.
(-- అమిత్ అగ్నిహోత్రి, సీనియర్ జర్నలిస్ట్)