మానవ సమాజం 21వ శతాబ్దంలో ఆధునిక హంగులతో ఉరకలు వేస్తున్నవేళ అంతరించిపోతున్న ఆదివాసీ భాషలు, సంస్కృతులను స్మరించుకోవాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. సాంకేతిక పరిజ్ఞానంపై విరివిగా ఆధారపడిన ప్రస్తుత తరుణంలో వీరు ఇప్పటికీ సహజవనరులైన భూమి, నీరు, అడవులపై, సంప్రదాయ వ్యవసాయం, ఫలసాయం తదితరాలపై ఆధారపడి ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు. చెట్టు, పుట్ట, నీరు వంటివాటిని పూజిస్తూ వాటితో ఒక అవినాభావ సంబంధం ఏర్పరచుకున్నారు. స్థిర అభివృద్ధి అనేది వీరి జీవనశైలిలో భాగమైంది. ఇంత గొప్ప సంస్కృతీ సంప్రదాయాలు కలిగిన ఆదివాసుల జనాభా, భాష క్రమంగా అంతరించిపోతుండటం ఎంతో బాధాకరం!
ఐక్యరాజ్య సమితి చొరవ
ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం మొత్తం ప్రపంచంలో 47.60కోట్ల ఆదివాసులు సుమారు 20 దేశాల్లో నివసిస్తున్నారు. ప్రపంచంలో వీరి జనాభా సుమారు ఆరు శాతం. ఏడు వేలకు పైగా భాషలు, అయిదు వేలకు పైగా సంస్కృతులు వీరి సొంతం. యునెస్కో అంచనాల ప్రకారం ఈ శతాబ్దం చివరకు సుమారుగా మూడు వేలకు పైగా అంటే నలభై భాషలు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇంతటి అసాధారణ చరిత్ర, సంస్కృతి, భాషలు కలిగిఉన్న ఆదివాసులను కాపాడుకునేందుకు ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఐక్యరాజ్య సమితి ఏటా ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ హక్కుల దినంగా నిర్వహిస్తోంది. 2019ను అంతర్జాతీయ ఆదివాసీ భాష సంవత్సరంగా, 2022-2032 కాలాన్ని అంతర్జాతీయ ఆదిమ భాషల దశాబ్దంగా ప్రకటించడం ద్వారా వీరి సంస్కృతులను పరిరక్షించాల్సిన ఆవశ్యకతను ప్రపంచానికి చాటింది.
ఆదివాసుల భాష, వారి సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందజేయాల్సిన అవసరం ఈ తరంపై ఉంది. ఈ భాషలకు లిపి లేదు. మరో తరానికి అవి మౌఖికంగానే బదిలీ అవుతున్నాయి. ప్రపంచీకరణ యుగంలో వచ్చిన సాంకేతిక విప్లవం, ఆధునికత, సైనిక ఆక్రమణలు; సామాజిక, ఆర్థిక, రాజకీయ, మతపరమైన అణచివేతలు; ఇతర బాహ్య కారణాలు, ఆత్మన్యూనత వంటి అంతర కారణాలవల్ల ఈ భాషలు క్రమక్రమంగా అంతరిస్తున్నాయి. వీటి ప్రభావం వారి అస్తిత్వంపై ప్రభావం చూపడమే కాకుండా, దీంతో ముడివడిన ఆచారాలు, కట్టుబాట్లు, ఆహారపుటలవాట్లు, సంప్రదాయాలు మొదలైనవీ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. యునెస్కో- ప్రపంచంలోని 6,912 భాషల్లో 2473 భాషలు వివిధ రూపాల్లో కనుమరుగు అవుతున్నాయని అంచనా వేసింది. భారత్‌లో 10.45 కోట్ల ఆదివాసులు(130 కోట్ల దేశజనాభాలో 7.5 శాతం) ఉన్నారు. 700కు పైగా విభిన్న జాతులున్నాయి. యునెస్కోకు చెందిన ‘అట్లాస్ ఆఫ్ వరల్డ్ లాంగ్వేజెస్’ ప్రకారం ఇండియా 197 భాషలతో మొదటిస్థానంలో ఉంది. అమెరికా 192 భాషలతో, ఇండొనేసియా 147 భాషలతో తరవాతి స్థానాలను ఆక్రమించాయి. ఇటీవలి కాలంలో అండమాన్ ద్వీపంలో నివసించే ‘గ్రేట్ అండమానీస్’ ప్రధాన భాష అక-జెరు- తంబొల అనే వ్యక్తి మృతితో అంతరించిపోవడం బాధాకరం. జరావా, సెంటీనేలే, షోపెన్, ఓనగీ, బిరహోర్, గదబా, పహరియా, బొండోలు మాట్లాడే భాషలూ అంతరించే దశలో ఉండటం ఆందోళనకరం.
యుద్ధప్రాతిపదికన చర్యలు
ఆదివాసుల సంరక్షణ, అభివృద్ది కోసం రాజ్యాంగంలో ఆర్టికల్ 16 (4), 46, 275, 330, 332, 243డి, 5, 6 షెడ్యూళ్ల ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ఉండే గవర్నర్లకు విచక్షణ అధికారాలను కల్పించారు. వీటిని ఉపయోగించి జాతీయ, రాష్ట్ర చట్టాలను క్షుణ్నంగా పరిశీలించి, వాటివల్ల ఆదివాసుల సంస్కృతికి ఏమన్నా ముప్పు సంభవిస్తే, వాటిని ఆపే హక్కు ఉంది. అయితే గిరిజనేతరుల ఆశయాలమేర చట్టాలు అమలు పరుస్తుండటం దురదృష్టకరం. వివిధ రాష్ట్రాల్లోని గిరిజన మంత్రిత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వంటివి నిరంతరం పనిచేస్తున్నప్పటికీ- వారి భాషను, సంస్కృతులను కాపాడలేకపోతున్నాయనడానికి అంతరిస్తున్న భాషలే నిదర్శనం. వీటి సంరక్షణ కోసం మానవ వనరుల శాఖ 2013లో అంతరించే భాషల సంరక్షణ, పరిరక్షణ పథకాన్ని భారతీయ భాషల సంస్థ, విశ్వవిద్యాలయాలు, భాష పరిశోధన సంస్థల సమన్వయంతో ప్రారంభించింది. ప్రమాదపుటంచున ఉన్న భాషలను గుర్తించి వాటిని సేకరించి భద్రపరచడం (డాక్యుమెంట్) ఈ పథకం ప్రధాన ఉద్దేశం. గిరిజనుల భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం దేశంలో గిరిజన విశ్వవిద్యాలయాలను, సాంస్కృతిక కేంద్రాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలతో పాటు, భారత్ కూడా ఆదిమ భాషలను కాపాడుకోవడం కోసం మాతృభాషను తప్పనిసరి చేస్తూ 2020 నూతన విద్యా విధానాన్ని రూపొందించింది. గిరిజన భాషల లిపి తయారు చేయడం, వాటిని భారత రాజ్యాంగంలో పొందుపరచడం వంటి చర్యల ద్వారానే ఆదివాసీ సంస్కృతి, భాషలను కాపాడగలుగుతాం. తద్వారా భారత జాతి గొప్పతనాన్ని భావితరాలవారికి అందించాలి!
(రచయిత: డాక్టర్ డి.వి.ప్రసాద్)