ప్రపంచం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల్లో వాయు కాలుష్యం ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం- ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరు మాత్రమే స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నారు. వాయు కాలుష్యం వల్ల ప్రపంచంలో సంవత్సరానికి 70 లక్షల మంది చనిపోతుండగా, అందులో 42 లక్షల మంది బహిరంగ కాలుష్యానికి గురైనవారే. రవాణా, విద్యుత్ ఉత్పత్తి, భవనాల శీతలీకరణ, వ్యవసాయ వ్యర్థాల దహనం, పరిశ్రమలు... బహిరంగ కాలుష్యానికి ప్రధాన కారణాలు.
ప్రపంచంలోని అత్యంత కాలుష్యకారకమైన 20 నగరాల్లో 14 మన దేశంలోనే ఉండటం ఆందోళనకరం. బహిరంగ వాయు కాలుష్యానికి 27 శాతందాకా వాహనాలే కారణం; నగరాల్లో అవి 70 శాతందాకా కారణమవుతున్నాయి. దేశంలో వివిధ రకాల వాహనాలు 28 కోట్లకుపైగా ఉండగా, రోజుకు మరో 52 వేలు కొత్తగా రోడ్డుపైకి చేరుతున్నాయి. దేశంలో ఏడాదికి 305 కోట్ల టన్నుల కాలుష్యం విడుదల కావడమే కాకుండా చమురు దిగుమతికి భారీస్థాయిలో విదేశ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తోంది. దేశ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా వాయు, ధ్వని కాలుష్య తీవ్రత, విదేశ మారక ద్రవ్య వ్యయాల్ని తగ్గించుకోవాలంటే ఉత్తమ ప్రత్యామ్నాయం- విద్యుత్ వాహనాల వినియోగమే.
తగ్గనున్న ధరలు!
ప్రస్తుతం ప్రభుత్వం వాయు కాలుష్యం తక్కువగా ఉండే బీఎస్-6 వాహనాలు మాత్రమే వినియోగించాలనే నిబంధన తేవడంతో- చమురు, విద్యుత్ వాహనాల మధ్య ధరల్లో వ్యత్యాసం కొంతమేర తగ్గింది. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలకు అదనంగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వాహనాల ఉత్పత్తి ఛార్జింగ్ కేంద్రాలు స్థాపించేవారికి అవసరమైన భూమి, వ్యవస్థాపకత వ్యయంలో 20 శాతం, విద్యుత్ ఛార్జీల్లో 25 శాతం రాయితీలు, రాష్ట్ర జీఎస్టీ, స్టాంపుడ్యూటీ, రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ రుసుముల్లో మినహాయింపు ఇచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం అదనంగా ద్విచక్ర వాహనాలకు రూ.5వేలు, ఆటోలకు రూ.7,500, కార్లకు రూ.1.25లక్షల రాయితీ ప్రకటించింది. దిల్లీ ప్రభుత్వం మరిన్ని రాయితీలు ఇవ్వడంతోపాటు, పాత వాహనాలను స్వయంగా ‘తుక్కు’గా మార్చుకునేవారిని ప్రోత్సహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం బ్యాటరీ రహిత వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వెసులుబాటుతో సుమారు 30 నుంచి 40 శాతం తక్కువ ధరకే వాహనాలు లభించే అవకాశం ఉంది. ఇది ద్విచక్ర, త్రిచక్ర వాహన కొనుగోలుదారులకు మరింత ప్రోత్సాహం ఇవ్వగలదు. ఈ పద్ధతిలో వాహనదారుడు అవసరమైన బ్యాటరీని బహిరంగ మార్కెట్‌లో అద్దెకు తీసుకోవడంగానీ, మార్పిడి విధానంలోగానీ వాడుకోవచ్చు.
దేశంలో 69 వేల పెట్రోలు బంకులు ఉండగా, విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలు 1,332 మాత్రమే ఉన్నాయి. విద్యుత్ వాహనం ఛార్జింగ్‌కు చాలా సమయం తీసుకోవడం వల్ల దేశంలోని వాహనాలన్నీ విద్యుత్‌లోకి మారితే, ఇప్పుడున్న పెట్రోల్ బంకులకంటే ఎన్నో రెట్లు ఛార్జింగ్ కేంద్రాలు అవసరమవుతాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 24 రాష్ట్రాల్లో 2,636 ఛార్జింగ్ కేంద్రాలను స్థాపించనున్నారు. అందులో తెలంగాణలో 178, ఏపీలో 266 ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి పెట్రోలు బంకులో కనీసం ఒక ఛార్జింగ్ పాయింటు ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఇళ్లు, కార్యాలయాల వద్ద సులువుగా ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంది.
విస్తృత అవగాహన అవసరం
పార్కింగ్ స్థలాలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, వ్యాపార, నివాస సముదాయాల్లో వేగంగా ఛార్జింగ్ చేయగలిగే కేంద్రాలను ఏర్పాటు చేస్తే సమస్యలను అధిగమించవచ్చు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఎన్టీపీసీ, ఈఈఎస్‌ఎల్, రైల్వేశాఖ, మెట్రో రైల్, ఐఓసీ తదితర ప్రభుత్వ సంస్థలు 15 కేంద్రాలను, ప్రైవేటులో మరో 40 దాకా ఛార్జింగ్ కేంద్రాలను స్థాపించాయి. ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు లాభదాయక వ్యాపారమైనందువల్ల విద్యుత్ పంపిణీ సంస్థలు తమ ఉపకేంద్రాలు, ఇతర కార్యాలయాల వద్ద నెలకొల్పడం అందరికీ ప్రయోజనకరం. అంతేకాదు, అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను ఉపయోగించుకొని ఇప్పుడున్న పాత వాహనాలను విద్యుత్ పరిజ్ఞానంలోకి మార్చుకుంటే ఎంతో ప్రయోజనం పొందవచ్చు. అత్యాధునిక స్మార్ట్ గ్రిడ్ సాంకేతిక విధానం ద్వారా విద్యుత్ వాహనాలను పంపిణీ సంస్థ లైన్లకు అనుసంధానం చేసి అవసరాన్ని బట్టి ఛార్జింగ్ చేసుకోవడం లేదా బ్యాటరీలో నిల్వ ఉండే కరెంట్‌ను తిరిగి లైన్‌లోకి పంపవచ్చు. విద్యుత్ అంతరాయం తలెత్తినప్పుడు గృహాలు, దుకాణాల్లో వినియోగించుకోవచ్చు.
పైలట్ ప్రాజెక్టు..!
కేంద్ర భారీ పరిశ్రమలశాఖ సూచించినట్లుగా విద్యుత్ వాహనాల వినియోగాన్ని ముందుగా పది లక్షలకుపైగా జనాభాగల పట్టణాల్లో ప్రయత్నిస్తే విజయవంతమయ్యే అవకాశముంది. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను తొలి ప్రాధాన్యంగా ఎంచుకుంటే పరిమిత దూర ప్రయాణాలవల్ల, స్వయంగా ఇళ్ల వద్దే ఛార్జింగ్ చేసుకోవడం, బ్యాటరీ మార్చుకోవడం వంటి పద్ధతుల కారణంగా పబ్లిక్ ఛార్జింగ్ కేంద్రాలపై ఆధార పడాల్సిన అవసరం ఉండదు. ముఖ్య విడిభాగాలను దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసుకుంటే స్వావలంబన సాధించడమే కాకుండా, విదేశ మారక ద్రవ్యం ఆదాచేయవచ్చు. విడిభాగాల తయారీ పరిశ్రమల ఏర్పాటు వల్ల యువతకు ఉపాధి అవకాశాల్నీ కల్పించవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా తమ వాహనాలను విద్యుత్ పద్ధతిలోకి మార్చుకొని, అన్ని కార్యాలయాల్లో ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు మార్గదర్శకంగా నిలవాలి. ఈ వాహనాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకొంటూ, ప్రజలకు అవగాహన పెంచుతూ ముందుకు సాగితే 2030 నాటికి దేశంలో సగం వాహనాలనైనా విద్యుత్ పరిజ్ఞానంలోకి మార్చాలన్న లక్ష్యం నెరవేరుతుంది.
వినియోగాన్ని పెంచేలా...
గత దశాబ్ద కాలంగా చాలా దేశాలు విద్యుత్ వాహనాల వాడకంపై దృష్టి సారించాయి. కేంద్ర ప్రభుత్వం 2013లో ‘నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్’ కార్యక్రమం ద్వారా విద్యుత్ వాహనాల వినియోగానికి సంబంధించిన ప్రోత్సాహక మార్గదర్శకాలను విడుదల చేసింది. 2015-18లో ఈ వాహనాల ప్రోత్సాహకానికి రూ.530 కోట్లు ఖర్చు పెట్టగా, 2019-22 సంవత్సర కాలానికి పదివేల కోట్ల రూపాయలు కేటాయించి... వాహనాల ఉత్పత్తి, ఛార్జింగ్ స్టేషన్లు, మౌలిక వసతుల కల్పన, జీఎస్టీ తగ్గింపు, కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో 64 పట్టణాల్లో 5,700 విద్యుత్ బస్సులకు (తెలంగాణకు 325, ఏపీకి 300) రాయితీలు కల్పించడం ద్వారా వీటి వినియోగాన్ని పెంచే ప్రణాళికను అమలు చేస్తోంది. ఏపీ, తెలంగాణ తమ అధీనంలోని బస్సులన్నీ 2030 నాటికి 100 శాతం విద్యుత్ వాహనాలుగా మారాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ప్రోత్సాహక కార్యక్రమాలెన్ని ఉన్నా నేటికీ దేశంలో విద్యుత్ వాహనాలు కేవలం ఒక శాతం లోపు మాత్రమే ఉన్నాయి. ఇందుకు కారణం- వాహనాల ధర ఎక్కువగా ఉండటం, తగినన్ని ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం, ఛార్జింగ్‌కు అధిక సమయం తీసుకోవడం, పరిమిత దూరం మాత్రమే ప్రయాణించే పరిస్థితి ఉండటం వంటి సమస్యలు వేధిస్తున్నాయి.
- ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఇంధన రంగ నిపుణులు
ఇదీ చూడండి: లద్దాఖ్‌లో శాంతిని నెలకొల్పడం ఎలా?