కరోనా మహమ్మారి కట్టడి కోసమంటూ మార్చి చివరి వారం నుంచి మొదలుపెట్టిన దేశవ్యాప్త లాక్‌డౌన్ చిల్లర వర్తక రంగంపై అక్షరాలా పిడుగుపాటైంది. వ్యవసాయం తరవాత అత్యధిక సంఖ్యాకులకు ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తూ స్థూల దేశీయోత్పత్తిలో పది శాతానికి ప్రోదిచేస్తున్న ఏడు కోట్ల చిల్లర వర్తక శ్రేణుల వర్తమానం, భవితవ్యం- రెండూ ప్రశ్నార్థకమవుతున్నాయి. గత వంద రోజుల్లోనే దేశీయ చిల్లర వర్తక రంగం ఎకాయెకి రూ.15.5 లక్షల కోట్లు నష్టపోయిందని 40 వేల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిల భారత వర్తకుల సమాఖ్య వెల్లడించింది. లాక్‌డౌన్‌కు మినహాయింపులు మొదలైన నెలన్నర తరవాతా చిల్లర వర్తకంలో పెద్దగా మెరుగుదల ఏమీ లేదంటూ- ఈ నెల తొలి పక్షం రోజుల్లోనే రూ.2.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ప్రకటించింది. దుకాణాల్లో కొనుగోలుదారుల సంఖ్య పట్టుమని పది శాతమే ఉంటోందన్న సమాఖ్య- నానాటికీ పెచ్చుమీరుతున్న ఆర్థిక సంకటాలు తట్టుకోలేక కోటిన్నర షాపులు మూతపడనున్నాయన్న వ్యథాకలిత వాస్తవాన్ని కళ్లకు కడుతోంది. మహమ్మారి ముప్పు నుంచి జన సామాన్యాన్ని కాచుకోవడానికి ప్రకటించిన లాక్‌డౌన్ కోట్లాది ఉద్యోగాల్ని ఊడ్చేసే ప్రమాదాన్ని ఊహించిన బ్రిటన్ ప్రభుత్వం- శ్రామికుల వేతనాల్లో 80 శాతం తానే చెల్లిస్తానని ప్రకటించింది. అదే తీరుగా ఇండియాలోనూ చిల్లర వర్తక రంగంలో స్థిరవ్యయంగా ఉన్న ఉద్యోగుల జీతాల్లో 50 శాతం సర్కారే చెల్లించాలని తొలినాళ్లలో కోరిన సమాఖ్య- తాజాగా పన్నుల చెల్లింపులో వెసులుబాటు, అదనపు వడ్డీ పెనాల్టీల బాదరబందీ లేకుండా బ్యాంకు రుణాల చెల్లింపు కాలావధి పెంపు, సజావుగా వ్యాపారాలు సాగించేలా నిధుల అందుబాటు వంటి డిమాండ్లు చేస్తోంది. కోట్లాది జన జీవితాల్లో కొండంత వెలుగు నింపుతున్న ఈ చిరు దివ్వెలు కొండెక్కకుండా కాచుకోవడం ప్రభుత్వాల విధి!
ఇండియాలో చిల్లర వర్తక రంగం భవిష్యత్తు ఎంత ఉజ్జ్వలంగా ఉండబోతోందో మొన్న ఫిబ్రవరినాటి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యయనమే చాటింది. 2019లో 70 వేలకోట్ల డాలర్లుగా ఉన్న విపణి పరిమాణం 2025 నాటికి ఏటా 9-11 శాతం వృద్ధిరేటుతో లక్షా 30వేల కోట్ల డాలర్లకు చేరుతుందని, పట్టణీకరణ, ప్రజల ఆదాయాల్లో పెరుగుదల, చిన్న చిన్న కుటుంబాలు ఆ ప్రగతి వేగానికి దోహదపడనున్నాయని అధ్యయనం పేర్కొంది. ఇండియాలో వినిమయం వృద్ధిరేటు- అభివృద్ధి చెందిన అమెరికా, యూకేలను మించిపోనుందన్న ఆ అంచనాలన్నీ 'కొవిడ్' రక్కసి కోరసాచక ముందునాటివి! పలు రంగాల్లో ఉన్న ఉద్యోగాలు ఊడి, కోట్లమందికి జీతాల్లో కోతపడి, కరోనా భయంతో అత్యవసర వ్యయాలకూ జనం జంకుతున్న వాతావరణంలో- చిల్లర వర్తక రంగం కోలుకోవడానికి ఇంకో ఆర్నెల్లు అయినా పడుతుందని భావిస్తున్నారు. నగదు నిల్వలన్నీ హరాయించుకు పోగా, రాబడులు దారుణంగా కుంగిన తరుణంలో స్థిరవ్యయాల్ని భరిస్తూ ఏ వ్యాపారాలు మాత్రం ఎంతకాలం నెగ్గుకు రాగలవు? ప్రస్తుతం దేశ శ్రామిక శక్తిలో ఎనిమిది శాతానికి బతుకు తెరువుగా ఉన్న చిల్లర వర్తక రంగం పోనుపోను 20 శాతానికి జీవనాధారం కానుందంటున్నారు. ఇండియా స్థూల దేశీయోత్పత్తిలో ప్రైవేటు వస్తు సేవల వినిమయం వాటా 58 శాతమని, అందులో 48 శాతం చిల్లర వర్తక రంగానిదేనని గణాంకాలు చాటుతున్నాయి. వస్తుసేవల వినిమయం మళ్ళీ జోరందుకొంటే, చిల్లర వర్తకం తెరిపినపడటమే కాదు- దేశార్థికమూ పుంజుకొంటుంది. ఈలోగా సర్కారు సాయం అందక చిల్లర వర్తకం కుదేలైతే నిరుద్యోగిత జడలు విరబోసుకొని మరో సంక్షోభం దాపురిస్తుంది. ఈ గొలుసుకట్టు ప్రమాదాల్ని నివారించాలంటే, రిటైల్ రంగాన్ని ఆదుకొనే సమగ్ర కార్యాచరణకు కేంద్రం సమకట్టాలి!