తగ్గినట్లే తగ్గుతూ కొత్త కోరలు తొడుక్కుంటున్న మహమ్మారి వైరస్ కరోనా, యావత్ మానవాళికే పెనుసవాలు రువ్వుతోంది. పులి వెనకడుగు వేసేది తిరిగి దాడి చేసేందుకేనన్న చందంగా, దేశంలోనూ మళ్ళీ మహోద్ధృతంగా విరుచుకుపడుతున్న కొవిడ్ ధాటిని కేసుల తీవ్రత కళ్లకు కడుతోంది. ఒక్కరోజులో లక్షకుపైగా కేసుల నమోదు కరోనా ఉగ్రరూపాన్ని ఆవిష్కరించింది. ఈ స్థాయిలో వైరస్ ప్రకోపం అమెరికా తరవాత ఇండియాలోనే.
ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా చురుగ్గా జోరెత్తుతున్న కేసుల ప్రాతిపదికన అమెరికా, ఫ్రాన్స్, బ్రెజిల్, బెల్జియం తరవాతి స్థానం భారత్‌దే. గత నెలలో నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్; ఇండోర్ భోపాల్ సూరత్ రాజ్‌కోట్ అహ్మదాబాద్ వడోదరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. ఈ నెలాఖరుదాకా వారాంతపు లాక్‌డౌన్, రాత్రివేళ కర్ఫ్యూలను మహారాష్ట్ర అమలుపరుస్తుండగా- దేశ రాజధాని దిల్లీలోనూ చీకటి మాటున జనసంచారాన్ని నిషేధిస్తూ నిన్ననే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈశాన్య భారతం మినహా తక్కిన రాష్ట్రాల్లో తరతమ భేదాలతో క్రమేణా కేసులు పెరుగుతుండటం కలవరపరుస్తోంది. ఇప్పటికే రెట్టించిన బలంతో చాపకింద నీరులా వ్యాపిస్తున్న కొవిడ్ విజృంభణకు బెంబేలెత్తుతున్న ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ ప్రభృత దేశాలు గత్యంతరం లేదంటూ లాక్‌డౌన్ బాట పడుతున్నాయి. పరిస్థితి చేజారిపోతే ఇక్కడా అటువంటి అనివార్య నిర్ణయం తప్పదన్న విశ్లేషణల వెలుగులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చురుగ్గా దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉంది.
ఆ రాష్ట్రాల్లోనే అధికం
మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌లలో సింహభాగం కేసులు వెలుగు చూస్తున్నా- తక్కిన రాష్ట్రాల్లోనూ ఆందోళనకర స్థితిగతులే నెలకొన్నాయి. లాక్‌డౌన్లకన్నా విస్తృత పరీక్షలు, టీకాలు, మాస్కులు, జనచేతన కార్యక్రమాలకే నిపుణులు ఓటేస్తున్న తరుణంలో- కొవిడ్ వ్యాప్తికి ఎక్కడికక్కడ తూట్లు పొడిచేలా ప్రభుత్వాల కార్యాచరణ మరింతగా పదును తేలాలి!. కరోనా రెక్కలు విరిచేందుకంటూ నిరుడు విధించిన లాక్‌డౌన్ల పర్యవసానంగా భిన్నరంగాలు చతికిలపడి దేశార్థికం కుదేలైంది. అసంఖ్యాక శ్రమజీవుల బతుకులు తలకిందులయ్యాయి. జీవనాధారం కొల్లబోయి పట్టణ ప్రాంతాల్లో 12 కోట్ల మంది, పల్లెపట్టుల్లో 28 కోట్లమంది కొత్తగా పేదరికంలో కూరుకుపోయారన్న విశ్లేషణలు పది నెలలకిందటే గగ్గోలు పుట్టించాయి. అటుతరవాతా కొవిడ్ దుష్పరిణామాలు అసంఖ్యాక వలస కూలీల జీవితాలను ఎంతగా అతలాకుతలం చేశాయో చూశాం. రాబోయే రెండు నెలల్లో వైరస్ ఇంకా రెచ్చిపోనుందంటున్న దశలో, మునుపటిలాగా దేశమంతటా లాక్‌డౌన్ విధించాల్సి వచ్చే దుస్థితి దాపురించకూడదంటే- కేసులు పోటెత్తకుండా అందరూ కచ్చితంగా నిర్దిష్ట జాగ్రత్తలు పాటించి తీరాల్సిందే! మాస్కులు, శానిటైజర్లు, నిర్ణీత భౌతిక దూరం వంటి జాగ్రత్తల్ని విధిగా పాటిస్తే 70 శాతం మేర కేసుల్ని అదుపు చేయగల వీలుందని వైద్యనిపుణులు ఎప్పటినుంచో సూచిస్తున్నారు. అలసత్వం వహిస్తే ఒక్క కరోనా రోగినుంచి నాలుగు వందల మందికిపైగా వైరస్ సంక్రమిస్తుందన్న హెచ్చరికతోపాటు- కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తి సంబంధీకుల్లో 30మందినైనా గుర్తించి, సత్వరం పరీక్షలు నిర్వహించి, తొలి మూడు రోజులూ ఏకాంతంగా ఉంచాలన్న మార్గదర్శకాలూ ఇప్పటికే జారీ అయ్యాయి. వాటిని రాష్ట్రాలన్నీ తు.చ. తప్పక పాటిస్తూ- 'ఫిక్కీ' (భారత వాణిజ్య పారిశ్రామిక సంఘాల సమాఖ్య) చేసిన విలువైన సూచనల్నీ ఔదలదాల్చాలి.
వారికీ టీకా ఇవ్వాలి
18-45 ఏళ్ల వారందరికీ టీకాలు వేయడానికి అనుమతించాలన్న 'ఫిక్కీ'- కొవిడ్ పరీక్షల నిర్వహణ శీఘ్రతరం కావాలని, వ్యాక్సినేషన్ వేగం పరిధి ఇనుమడించాలని పిలుపిచ్చింది. ముఖ్యంగా ప్రతి పౌరుడూ ముఖానికి మాస్కు, చేతుల పరిశుభ్రత, భౌతిక దూరం తదితర నిబంధనల్ని విధిగా పాటిస్తే- వైరస్ వ్యాప్తి వేగాన్ని చాలావరకు కట్టడి చేయగలుగుతాం. వ్యక్తి స్థాయిలో చేతనకు వ్యవస్థాగత దిద్దుబాట్లు జతపడితేనే- కొవిడ్ కొమ్ములు విరవగలుగుతాం!