ఇటీవల దేశంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఒక్కరోజు వ్యవధిలోనే ప్రమాదాలు జరగడంతో దేశవ్యాప్తంగా పారిశ్రామిక భద్రతా ప్రమాణాలపై చర్చ మొదలైంది. ఇటీవల విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కర్మాగారంలో గ్యాస్ లీకేజీ, తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ థర్మల్ కేంద్రంలో బాయిలర్ పేలుడు, ఛత్తీస్‌గఢ్‌లోని ఓ పేపర్ మిల్లులో గ్యాస్ లీకేజీ వంటి సంఘటనలు వరసగా చోటుచేసుకున్నాయి. నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమని, ఇలాంటి సంఘటనల్లో మొదటగా బలయ్యేది నిరుపేదలేనని మరోసారి స్పష్టమైంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు విచారణ కమిటీలు వేయడం, బాధితులకు ఎంతోకొంత పరిహారం ప్రకటించడం, ఆ తరవాత మరచిపోవడం ఓ తంతులా మారింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాల ప్రకారం ఏటా ప్రపంచవ్యాప్తంగా 2.78 లక్షల మంది కార్మికులు వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. కచ్చితమైన లెక్కలంటూ లేకపోయినా, ఒక అధ్యయనం ప్రకారం భారత్‌లో సాలీనా 48 వేల మంది మరణిస్తున్నట్లు అంచనా. ఇందులో ఎక్కువమంది నిర్మాణ రంగానికి చెందినవారే కావడం గమనార్హం.
భోపాల్ విషవాయు దుర్ఘటన జరిగి 36 ఏళ్లు గడిచినా మనం నేర్చుకున్న పాఠాలు శూన్యమని ఇటీవలి విశాఖ ప్రమాదంతో రుజువైంది. భోపాల్, విశాఖ ఘటనల్లో- రెండు పరిశ్రమలూ విదేశీ యాజమాన్యంలోనివే కావడం గమనార్హం. ఈ రెండూ ‘రెడ్ జోన్’ విభాగంలోని పరిశ్రమలే. భారత్‌లో పర్యావరణ మంత్రిత్వశాఖ- పరిశ్రమల్ని వాటిలో వాడే ముడిపదార్థాలు, వెలువరించే కాలుష్యం తదితర అంశాల ఆధారంగా- ఎరుపు, ఆరెంజ్, ఆకుపచ్చ, తెలుపు జోన్లుగా విభజించింది. ఎరుపు విభాగంలోని పరిశ్రమలు అత్యంత ప్రమాదకరం. దాదాపు 89 రకాల రసాయన, ఆమ్ల, పురుగు మందులు, ఔషధ, బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమలన్నీ ఆ విభాగంలోకే వస్తాయి. వీటికి పర్యావరణం, కాలుష్య నియంత్రణ, భద్రత తదితర సంస్థల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఊరికి దూరంగా, మనుషులు ఎక్కువగా సంచరించని ప్రాంతాల్లోనే వీటిని ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తారు.
కర్మాగారాల చట్టం-1948, కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ పరిరక్షణ చట్టం, వివిధ పారిశ్రామిక విధానాలు సూచించే నిబంధనలను అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు తరచూ జరుగుతున్న ప్రమాదాలే స్పష్టం చేస్తున్నాయి. భోపాల్ విషవాయువు ఘటన దరిమిలా పర్యావరణ పరిరక్షణ చట్టం-1986ను తీసుకొచ్చినా పకడ్బందీగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కర్మాగారాల చట్టం ప్రకారం- వ్యర్థాలు, విష వాయువుల లీకేజీలు లేకుండా చూసుకోవడం, పరిశ్రమ చుట్టుపక్కల నివసించే ప్రజలకు విపత్తుల వేళ పాటించాల్సిన నియమ నిబంధనలపై అవగాహన కల్పించడం, భద్రతా ఇన్‌స్పెక్టర్ల నియామకం వంటి నిబంధనలెన్నో ఉన్నాయి. ఐరోపా దేశాల్లో ఒక పరిశ్రమ స్థాపనకు అనుమతించేముందు స్థాపించాలంటే అన్ని అంశాలనూ నిక్కచ్చిగా పరిగణనలోకి తీసుకుంటారు. పటిష్ఠమైన నియంత్రణ విభాగం స్వతంత్రంగా పని చేసే స్వేచ్ఛ ఉంటుంది.
మన దేశంలో విదేశీ పెట్టుబడులకు భారీగా అవకాశం కల్పించారు. మానవ వనరులు, ముడిసరకులు చౌకగా లభ్యమవుతున్నాయి. ప్రపంచ దేశాలకు భారత్ ఆకర్షణీయమైన విపణి. కొవిడ్ వ్యాపిస్తున్న తరుణంలో చైనా నుంచి బయటపడే యోచన ఉన్న కంపెనీలను జాగ్రత్తగా పరిశీలించి అనుమతులు జారీ చేయాల్సి ఉంటుంది. కర్మాగారాల చట్టంలో పేర్కొన్న వివిధ నిబంధనలు కార్మికుల ఆరోగ్యం, సంక్షేమం, భద్రత, పనివేళలు మొదలైన అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే, ఆర్థికాభివృద్ధి పేరిట ఎన్నో ఉపద్రవాల్ని కోరి కొనితెచ్చుకున్నట్లవుతుంది. నిబంధనలు పాటించని కంపెనీలను ప్రోత్సహించడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే. పరిశ్రమల్లో పలు కారణాలతో, సరిపడినంతగా మానవ వనరుల భర్తీ సకాలంలో జరగకపోవడం వల్ల- ఎక్కువ ప్రమాదాలకు ఆస్కారం ఉంది. పారిశ్రామిక దుర్ఘటనల కారణంగా పర్యావరణ మార్పులు, కాలుష్యం, ప్రజారోగ్యానికి హాని, జీవనోపాధికి శరాఘాతం వంటి పలు సమస్యలు పొంచి ఉండటం వల్ల ఈ అంశాన్ని ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మృతులకు పరిహారం ఇవ్వడమనేది సమస్యకు పరిష్కారం కాదు. భోపాల్ ఘటన తరవాత పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఒక స్వతంత్ర సంస్థ ఉండాలని సుప్రీంకోర్టు సర్కారుకు సూచించినా ఇప్పటికీ అలాంటి సంస్థను ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం- పరిశ్రమలన్నీ తమ అధీనంలో ఉంటూ, తమ అనుమతితో మాత్రమే నడవాలన్న యోచనతో ఉండటం వల్లే అటువంటి సంస్థను ఏర్పాటు చేయడం లేదన్న విమర్శలు లేకపోలేదు. పరిశ్రమలు కేవలం లాభాపేక్షతో పని చేయకుండా, విధిగా కార్పొరేట్ స్వీయపాలనను పాటించాలి. వివిధ నియంత్రణ విభాగాలను ఒత్తిళ్లు లేకుండా పనిచేసే స్వేచ్ఛను ప్రభుత్వాలు కల్పించాలి. అప్పుడే పారిశ్రామిక ప్రమాదాల నివారణకు అవకాశం ఉంటుంది. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వాలు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని విశాఖ సంఘటన నొక్కి చెబుతోంది.
- డాక్టర్ రమేశ్ బుద్దారం
(రచయిత- మధ్యప్రదేశ్‌లోని గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులు)