చైనా వస్తువులను బహిష్కరించాలన్న ఉద్యమం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది. దీనిపై కొన్నేళ్లుగా అడపాదడపా చర్చ జరుగుతున్నా తొలిసారిగా ఇప్పుడది క్షేత్రస్థాయికి చేరింది. 'వోకల్ ఫర్ లోకల్'(స్థానిక ఉత్పత్తులకే మద్దతివ్వండి) అని ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న ప్రచారం సైతం చైనా ఉత్పత్తులను దూరం పెట్టాలన్న భావనకు మరింత ఊపునిస్తోంది. 'ప్రస్తుత పరిస్థితుల్లో చైనా ఉత్పత్తులు కొనాలని ఎవరూ అనుకోవడం లేదు.. భారతీయ పరిశ్రమలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవా'లని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే వ్యాఖ్యానించారు. ఆఖరికి చెంచాలు సైతం అక్కడి నుంచే దిగుమతి చేసుకోవాలా? అని ఆయన ప్రశ్నించారు. చైనా వస్తువులను బహిష్కరించేలా దిగుమతిదారులపై ఒత్తిడి తెస్తామని వాణిజ్య సంఘాలూ ప్రకటిస్తున్నాయి. భారతీయ మార్కెట్‌ను చైనా వస్తువులు ముంచెత్తడం ఇప్పటికిప్పుడు కొత్తగా జరిగిందేమీ కాదు. కొన్నాళ్లుగా చాపకింద నీరులా సాగుతున్న ఈ పరిణామం గడిచిన అయిదారేళ్లలో మరింత వేగం పుంజుకుంది. దేశంలో అత్యధికంగా సెల్‌ఫోన్లు అమ్ముతున్న తొలి అయిదు కంపెనీల్లో నాలుగు చైనావే. 2020 తొలి త్రైమాసికంలో భారత్‌లో అమ్ముడైన సెల్‌ఫోన్లలో 73 శాతం ఈ నాలుగు కంపెనీల ఫోన్లే. చైనా వస్తువులను బహిష్కరించాలని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) సైతం బలంగా కోరుతోంది. మూడు వేలకు పైగా ఉత్పత్తులను బహిష్కరించాలని విస్తృతంగా ప్రచారం ప్రారంభిస్తామని సమాఖ్య చెబుతోంది. 'మా సమాఖ్యలో 40 వేల వ్యాపార సంఘాలున్నాయి. చైనా ఉత్పత్తులను నిలిపివేయాలంటే 10 వేల మందికి పైగా ఉన్న దిగుమతిదారులను ఈ సంఘాలు కోరబోతున్నాయి’'అని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ ప్రకటించారు.
యథేచ్ఛగా ఇ-వాణిజ్యం!
సామాజిక మాధ్యమాల్లో దీనిపై ఇంత చర్చ జరుగుతున్నా ఇ-వాణిజ్య సైట్ల ద్వారా జరిగే కొనుగోళ్లలో మాత్రం చైనా వస్తువుల దూకుడు తగ్గడం లేదు. తమ సైట్లలో చైనా వస్తువులకు గానీ- షియోమి, రియల్‌మీ, ఒప్పో, వివో వంటి సెల్‌ఫోన్లకుగానీ గిరాకీ ఏ మాత్రం తగ్గలేదని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ చెబుతున్నాయి. చైనా ఉత్పత్తులను బహిష్కరించడమంటే ఒక సెల్‌ఫోన్‌నో, ఒక ట్రూత్ బ్రష్‌నో కొనకపోవడమేనని అనుకుంటే పొరపాటే. వాస్తవానికి ఆ దేశం వీటిని దాటి చాలా ముందుకెళ్లింది. చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు షియోమి (ఎంఐ క్రెడిట్), ఒప్పో (ఒప్పో క్యాష్) లాంటివి 'ఆన్‌లైన్ లెండింగ్' సేవలు ప్రారంభించాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే లక్ష రూపాయల లోపు వ్యక్తిగత రుణాలిచ్చే కార్యక్రమాల ద్వారా భారత్‌లో ఏడాదికి రూ.50 వేల కోట్ల అప్పులివ్వాలన్నది వాటి లక్ష్యం. భారత్‌లో రూ.7,500 కోట్లకు పైగా విలువైన మొదటి శ్రేణికి చెందిన 30 అంకుర సంస్థల్లో పద్దెనిమిదింటికి చైనా నుంచే నిధులు వస్తున్నాయి. సాంకేతిక ఆధారిత భారతీయ అంకుర సంస్థల్లోనే చైనా కంపెనీలు రూ.3.02 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి. చైనా ఇ-వాణిజ్య దిగ్గజం అలీబాబా గ్రూప్- స్నాప్‌డీల్‌లో రూ.5,284 కోట్లు, పేటీఎంలో రూ.3,019 కోట్లు, బిగ్‌బాస్కెట్‌లో రూ.1,887 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఆ దేశానికే చెందిన టెన్సెంట్ హోల్డింగ్స్ ఓలా, జొమాటోలకు చెరో రూ.1,509 కోట్లు పెట్టుబడిగా సమకూర్చింది. ఇవన్నీ భారతీయ ఇ-వాణిజ్య రంగంలో పేరొందిన సంస్థలే. వీటిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. భారతీయ మార్కెట్లో చైనా ఆర్థిక జోక్యాన్ని అడ్డుకోవాలంటే పెట్టుబడుల విషయంలో చైనా ప్రమేయాన్ని నిలువరించాల్సి ఉంటుందన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం.
ప్రత్యామ్నాయాలేవీ?
చైనా ఉత్పత్తులను బహిష్కరించండి' అనే నినాదానికి కొత్త ఊపునిచ్చిన లద్దాఖ్ వాసి సోనమ్ వాంగ్‌చుక్- చైనా వస్తువుల బహిష్కరణ వినియోగదారుడి వల్లే సాధ్యమంటున్నారు.
"నిర్దిష్ట కాలపరిమితుల మేరకు- చైనా సాఫ్ట్‌వేర్‌ను ఒక వారంలో, హార్డ్‌వేర్‌ను ఏడాదిలో, నిత్యావసరం కాని సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి వాటిని ఏడాదిలో; నిత్యావసరాలను కొన్నేళ్ల పరిధిలో వదిలించుకోవాలి. చైనా వస్తువులు తక్కువ ధరకు దొరుకుతాయి కాబట్టి వినియోగదారులు వాటివైపు మొగ్గు చూపుతున్నారు. అదే ధరకు ఉత్పత్తులు అందించాలంటే- చైనా తరహాలోనే ఇక్కడి ప్రభుత్వాలూ తయారీదారులకు మరిన్ని ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు ఇవ్వాలి. ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలను కచ్చితంగా అమలు పరచి దేశానికి అవసరమైన వస్తువులను తయారుచేసుకోగల స్వయంసమృద్ధ దేశంగా ఎదగాలి. అప్పుడే వినియోగదారులు దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. అది కుదరని పక్షంలో చైనా వస్తువుల బహిష్కరణ అన్న మాట ఆచరణ సాధ్యం కాని నినాదంలానే మిగిలిపోతుంది."
--- సోనమ్ వాంగ్‌చుక్, లద్దాఖ్వాసి
ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణల నేపథ్యంలో ఒక దేశంలో తయారైన ఉత్పత్తులను ప్రపంచంలో ఎక్కడైనా విక్రయించుకునే వెసులుబాటు కలిగింది. చైనా ఎగుమతుల్లో ఇండియాకు చేరేది మూడు శాతం మాత్రమే. కానీ, విదేశాలకు భారత్ చేస్తున్న ఎగుమతుల్లో చైనా వాటా 5.7 శాతం. నిరుడు రూ.1.28 లక్షల కోట్ల భారతీయ ఉత్పత్తులు చైనాకు ఎగుమతయ్యాయి. ఇందులో ఆభరణాలు, ముడి ఇనుము వంటి ఖనిజాలు; పత్తి, ఆక్వాలాంటి వ్యవసాయ ఉత్పత్తులు ప్రధానమైనవి. చైనా వస్తువులను భారత్ బహిష్కరిస్తే- వాళ్లూ మన ఎగుమతులపై నియంత్రణలు విధించే ప్రమాదం కొట్టిపారేయలేనిది. అది ఆర్థికంగా భారత్‌కు పెద్ద దెబ్బే! భారత్ దిగుమతి చేసుకునే బల్క్ డ్రగ్స్, ఔషధ సంబంధిత ముడి పదార్థాల్లో మూడింట రెండొంతులు చైనా నుంచే వస్తున్నాయి. కాబట్టి, చైనా ఉత్పత్తులను వద్దనుకుంటే భారత ఔషధ పరిశ్రమ మొత్తం ప్రభావితమవుతుంది. దిల్లీలో 2018 మార్చిలో 'ఆర్థిక సంబంధాలపై ఇండో చైనా సంయుక్త బృంద సమావేశం జరిగింది. అందులో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింతగా వృద్ధి చేసుకోవడానికి ఉభయ పక్షాలూ అంగీకరించాయని కేంద్రప్రభుత్వం లోక్‌సభకు నిరుడు జూన్‌లో తెలియజేసింది. ఇలాంటి విభిన్న ఒప్పందాల నేపథ్యంలో ‘చైనా ఉత్పత్తుల బహిష్కరణ' అనేది సామాజిక మాధ్యమాల్లో చర్చించినంత సులువైన విషయమైతే కాదు.
చేదు అనుభవాలు
ఇతర దేశాల ఉత్పత్తులను తమ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకునేందుకు గతంలో వివిధ దేశాలు చేసిన ప్రయత్నాలేవీ సత్ఫలితాల్విలేదు. జపాన్ వస్తువులను బహిష్కరించాలని 1930లో చైనా ప్రయత్నించి విఫలమైంది. అమెరికా సైతం 2003లో ఫ్రాన్స్ ఉత్పత్తులను బహిష్కరించేందుకు చేసిన యత్నాలూ బెడిసికొట్టాయి. స్మార్ట్‌ఫోన్లే కాదు ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఏసీలు ఇలా నిత్యజీవితంలో వాడే అనేక వస్తువులకు సంబంధించిన కొన్ని విడిభాగాలు చైనాలోనే తయారవుతున్నాయి. అక్కడ శ్రామికశక్తి చౌకగా లభ్యమవడం, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఎక్కువగా ఉండటంతో వస్తూత్పత్తికి తక్కువ ఖర్చవుతుంది. అందుకే అనేక దేశాల్లోని పెద్ద పరిశ్రమలు చైనానుంచి విడిభాగాలు తెప్పించుకుంటాయి. వాటితో వివిధ ఉత్పత్తులు తయారు చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏది చైనాది, ఏది కాదని గుర్తించడం ఎలా అన్న మౌలిక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. చైనా వస్తువులను కొనడంవల్ల వారు లాభపడతారు కాబట్టి, వాటిని ఆపాలంటే నిత్యం వాడే అనేక వస్తువులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. లేదంటే ఇతర దేశాల్లో తయారయ్యే అవే వస్తువులను అధిక ధరకు కొనాల్సి ఉంటుంది. అది అంతిమంగా స్థూలదేశీయోత్పత్తిపై ప్రభావం కనబరుస్తుంది. తక్కువ ఖర్చుతో అవసరమైన ఉత్పత్తులను తయారుచేసుకోగల స్వయం సిద్ధ దేశంగా భారత్ ఎంత త్వరగా ఎదగితే- అంత సత్వరం దేశీయ నినాదం సాకారమవుతుంది.
- శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ కొండవీటి