ETV Bharat / opinion

మాదకద్రవ్యాలకు అడ్డుకట్ట ఏది?

భారీ పరిమాణంలో మాదకద్రవ్యాలు పట్టుబడుతున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో జోరెత్తాయి. నెలరోజుల్లో.. హైదరాబాద్‌, చెన్నై, దిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లో పట్టుబడిన హెరాయిన్‌ మార్కెట్‌ విలువ సుమారు రూ.400 కోట్లు అని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌ ఇటీవలే తెలిపింది. సరకును గుట్టుగా నిర్దేశిత వ్యక్తులకు చేరవేసే క్రమంలో కొంతమంది అడ్డంగా దొరికిపోతున్నా మూలాల్ని పట్టుకుని సూత్రధారుల్ని వెలికి తీయడంలో సరైన ముందడుగు పడకపోవడం బాధాకరం.

drugs mafia
డ్రగ్స్ మాఫియా, మత్తు రవాణా
author img

By

Published : Jun 10, 2021, 7:17 AM IST

కోట్లమందిని మత్తుకు బానిసలు చేసి జీవచ్ఛవాలుగా మార్చేసే నికృష్ట మాదకద్రవ్య వ్యాపార సామ్రాజ్యం చిలవలు పలవలు వేసుకుపోతోంది. కొవిడ్‌ కేసుల విజృంభణ దరిమిలా అఫ్గాన్‌-పాక్‌-ఇండియా సరిహద్దు ప్రాంతాల్లో రవాణా సన్నగిల్లి దందాసురులు కొత్తదారి పట్టినట్లు ఇటీవలి పరిణామాలు స్పష్టీకరిస్తున్నాయి. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) లెక్కల ప్రకారం నెల్లాళ్లుగా హైదరాబాద్‌, చెన్నై, దిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లో పట్టుబడిన హెరాయిన్‌ మార్కెట్‌ విలువ సుమారు రూ.400 కోట్లు. ఆ సరకంతా అఫ్గానిస్థాన్‌ నుంచి ఆఫ్రికా మీదుగా భారత్‌కు చేరాక రోడ్డుమార్గాన దేశంలోని ఇతర నగరాలకు తరలుతోందంటున్నారు.

భారీ స్థాయిలో...

భారీ పరిమాణంలో మాదకద్రవ్యాలు పట్టుబడుతున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో జోరెత్తాయి. రెండు నెలల క్రితం బెంగళూరులో వెయ్యి కిలోలు, భాగ్యనగరంలో 332 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఏప్రిల్‌ నెలలోనే కేరళ సమీపాన అరేబియా మహాసముద్రంలో నౌకాదళం వశపరచుకున్న మాదకద్రవ్యాల విలువ అంతర్జాతీయ విపణిలో రూ.3000 కోట్లు. ఆహార సరఫరా ముసుగులో మత్తుపదార్థాల పంపిణీ బాగోతం అసోమ్‌లో వెలుగుచూసింది. సరకును గుట్టుగా నిర్దేశిత వ్యక్తులకు చేరవేసే క్రమంలో కొంతమంది అడ్డంగా దొరికిపోతున్నా మూలాల్ని పట్టుకుని సూత్రధారుల్ని వెలికి తీయడంలో సరైన ముందడుగు పడటం లేదు. ముంబై మహానగరం కొకైన్‌ రాజధానిగా మారినట్లు స్వయంగా మాదక ద్రవ్య నియంత్రణ సంస్థ(ఎన్‌సీబీ) అంగీకరిస్తున్నా, అందుకు కారణభూతులైనవాళ్ల అజాపజా దొరకడం లేదు. 'ఎక్కడైనా మాదక ద్రవ్యాలు పట్టుబడితే ఆయా ప్రాంతాల్లో వాటి ఉరవడి ఉద్ధృతంగా ఉన్నట్లే'నని ఐక్యరాజ్య సమితికి చెందిన డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌ కార్యాలయ వార్షిక నివేదిక ఏనాడో ధ్రువీకరించింది. దేశంలోని పలుచోట్ల తనిఖీల్లో కిలోల లెక్కన దొరుకుతున్న మత్తుసరకు, ఉన్మత్త నేరశక్తుల ధాటిని ప్రస్ఫుటీకరిస్తోంది!.

మత్తుతో వినాశనమే..
మాదక ద్రవ్య సరఫరా ముఠాల కదలికల్ని నియంత్రించడంలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డీఆర్‌ఐ, పోలీస్‌ విభాగాల మధ్య సమన్వయరాహిత్యం కొన్నేళ్లుగా మత్తు మాఫియాకు కోరలు తొడుగుతోంది. మాదకద్రవ్యాల కారణంగా అంధకారం(డార్క్‌నెస్‌), విధ్వంసం(డిస్ట్రక్షన్‌), వినాశం(డివాస్టేషన్‌) దాపురిస్తున్నట్లు ప్రధాని మోదీయే సూత్రీకరించినా- జాతీయస్థాయి కార్యాచరణ అన్నది సజావుగా పట్టాలకు ఎక్కనే లేదు. దేశంలో మత్తుపంటల సాగు, డ్రగ్స్‌ సరఫరాల తీరుతెన్నులపై సమగ్ర సమాచారం క్రోడీకరించే బాధ్యతను అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌)కు దఖలుపరచాక ఏం ఒరిగిందో ప్రభుత్వమే తెలియజెప్పాలి!.

అంతర్జాతీయ నేరగాళ్లకు ఎరవేస్తూ 'ట్రోజన్‌ షీల్డ్‌' పేరిట ఎఫ్‌బీఐ 16 దేశాల్లో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌ విజయవంతమైంది. 800 మందికిపైగా అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని 32 టన్నుల దాకా డ్రగ్స్‌ను వశపరచుకోగలిగారు. అదే ఇక్కడ? అంతర్జాలం ద్వారా జరిగే మాదకద్రవ్యాల లావాదేవీలను నియంత్రించడం తనవల్ల కాదని ఎన్‌సీబీ అశక్తత వ్యక్తపరుస్తుండగా- ఒప్పందానుసారం నిర్దేశిత నగరాలకు సరకు రవాణా యథేచ్ఛగా కొనసాగుతుండటం నిఘా వ్యవస్థల అసమర్థతను రుజువు చేస్తోంది. మాదక పదార్థాల వినియోగం, ఉత్పత్తి, నిల్వ, వ్యాపారాలకు పాల్పడటాన్ని అత్యంత తీవ్ర నేరాలుగా పరిగణిస్తూ కాంబోడియా, వియత్నాం, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ వంటివి మరణదండన విధిస్తున్నాయి. వాటితో పోలిస్తే మాదక నేరగాళ్లకు దేశీయంగా స్వల్ప శిక్షలు, కొరమీనుల్లా తప్పించుకోగల కంతలు- డ్రగ్స్‌ ముఠాలకు అయాచిత వరాలవుతున్నాయి. ఈ దురవస్థను చెల్లాచెదురు చేస్తూ మాదక శక్తుల మారణహోమాన్ని పరిమార్చేలా పకడ్బందీ చట్ట సవరణలకు ప్రాథమ్య ప్రాతిపదికన ప్రభుత్వం గట్టి పూనిక వహించాలి. నిఘా యంత్రాంగాన్ని పరిపుష్టీకరించి, సత్వర న్యాయ విచారణ కఠిన శిక్షల అమలుతో సామాజిక ద్రోహులపై కదనభేరి మోగిస్తేనే- జాతి తెప్పరిల్లుతుంది!

ఇదీ చదవండి:ఆ గ్రామంలో ఇళ్లన్నీ అమ్మకానికే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.