ETV Bharat / opinion

మాదకద్రవ్యాల మహా విపత్తు! - డ్రగ్స్​ వాడకం

ఒకప్పుడు సంపన్నవర్గాల జల్సా విందులకే పరిమితమైన మాదకద్రవ్యాల లభ్యత, నెట్‌వర్క్‌ ఇంతలంతలై దేశం మూలమూలలా పాఠశాల విద్యార్థులకు సైతం చేరువైన వైనం దిమ్మెరపరుస్తోంది. దేశవ్యాప్తంగా వాటి ఉరవడి తీరుతెన్నులపై క్షేత్రస్థాయి కథనాలు, విశ్లేషణలు దిగ్భ్రాంతపరుస్తున్నాయి. కోట్ల మందిని జీవచ్ఛవాలుగా మార్చేస్తున్న కిరాతక సంతతిని ఉక్కుపాదంతో అణిచేసేలా సమగ్ర విధి విధానాల క్షాళనే మాదక మహమ్మారి పీడకు సరైన విరుగుడు.

drug catastrophe in the country
మాదకద్రవ్యాల మహా విపత్తు!
author img

By

Published : Oct 11, 2020, 7:31 AM IST

మత్తు అనే భయంకరమైన ఊబిలోకి నెట్టుకుపోయి యువత బతుకుల్ని, కన్నవారి ఆశల్ని క్రూరంగా చిత్తుచేసే భల్లూకం పట్టు మాదకద్రవ్యాలది. దేశవ్యాప్తంగా వాటి ఉరవడి తీరుతెన్నులపై క్షేత్రస్థాయి కథనాలు, విశ్లేషణలు దిగ్భ్రాంతపరుస్తున్నాయి. ఒకప్పుడు సంపన్నవర్గాల జల్సా విందులకే పరిమితమైన మాదకద్రవ్యాల లభ్యత, నెట్‌వర్క్‌ ఇంతలంతలై దేశం మూలమూలలా పాఠశాల విద్యార్థులకు సైతం చేరువైన వైనం దిమ్మెరపరుస్తోంది. కొన్నాళ్లక్రితం వరకు అడపాదడపా తనిఖీల్లో గంజాయి పట్టుబడినా పరిమిత స్థాయి సరఫరా బాగోతాలే వెలుగుచూసేవి. ఇప్పుడు తరచూ వందల కిలోల సరకు తరలిస్తున్న ముఠాల బరితెగింపు, నిఘా వ్యవస్థల దక్షత అప్రమత్తతలపట్ల వాటిలో పేరుకున్న చులకన భావాన్ని చాటుతోంది. విశాఖనుంచి ఉత్తర్‌ ప్రదేశ్‌కు చేరవేస్తున్న వెయ్యి కిలోల గంజాయిని మొన్నీమధ్య రాచకొండ ఎల్‌బీనగర్‌ పోలీసు దళాలు వలేసి పట్టుకున్నాయి. మార్కెట్లో ఆ సరకు కోటీ 30లక్షల రూపాయలదాకా పలుకుతోంది. భద్రాచలం వద్ద ఎనిమిది కోట్ల రూపాయల గంజాయి దొరికిన తరవాత స్వల్ప వ్యవధిలోనే కరీంనగర్‌లో 270 కిలోలు, మణుగూరులో 119 కిలోల మేర పట్టివేత, కృష్ణాజిల్లాలో బీటెక్‌ విద్యార్థులు మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ చేస్తూ అడ్డంగా దొరికిపోవడం... ఎలుగెత్తుతున్నదేమిటి? మూతపడిన ఫార్మా పరిశ్రమలెన్నో డ్రగ్స్‌ తయారీ కేంద్రాలుగా వర్ధిల్లుతుండటం తెలియజెబుతున్నదేమిటి? కొత్తకొత్త మార్గాల్లో మాదకముఠాలు తమ నేరసామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతుంటే- నిఘా వ్యవస్థ తాను ఉండీ లేనట్లేనని నిర్లజ్జగా నిరూపించుకుంటోంది. 'మేమింత పట్టుకుంటున్నాం కదా...' అనే అడ్డగోలు వాదనలు చెల్లని కాసులు. విస్తృతస్థాయిలో సరఫరా జోరెత్తుతోందంటే- దొరికిపోతున్నదానికి ఎన్నోరెట్ల పరిమాణంలో మాదకద్రవ్యాలు గుట్టుగా చేరాల్సిన చోట్లకు చేరిపోతున్నాయని అర్థం!

తొలి ఐదు స్థానాల్లో ఆ రాష్ట్రాలు..

ఈ ఏడాది మొదట్లో చండీగఢ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన అధ్యయనం, అక్కడ 50శాతం విద్యార్థులు మత్తుపదార్థాల సేవనానికి అలవాటు పడ్డట్లు నిర్ధారించింది. ఆమధ్య పంజాబ్‌ పోలీస్‌ బలగాల్లో సగంమంది వరకు మాదకద్రవ్యాలకు బానిసలయ్యారన్న వివరాలు గగ్గోలు పుట్టించాయి. తమ రాష్ట్రంలో 70శాతానికిపైగా యువత డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్లు పంజాబ్‌ రాష్ట్రప్రభుత్వమే ఉన్నత న్యాయస్థానానికి నివేదించడం తెలిసిందే. జైళ్లలోనూ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ విచ్చలవిడిగా సాగుతున్నదని సూటిగా తప్పుపట్టిన పంజాబ్‌-హరియాణా హైకోర్టు ఉద్ధృత స్థాయిలో మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటం చేపట్టాలని నిరుడు జనవరిలో ప్రభుత్వ యంత్రాంగానికి నిర్దేశించింది. న్యాయస్థానం క్రోడీకరించిన ఇరవైఅయిదు అంశాల సూత్రావళిపై ఇంత మందాన దుమ్ము పేరుకుపోయిందే తప్ప, నేటికీ ఒరిగిందేమీ లేదు. పిల్లల్లో మత్తు వ్యసనాన్ని చెదరగొట్టేలా పటిష్ఠ చర్యలు చేపట్టాల్సిందిగా 2018 జులైలో కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం చేసిన ఉద్బోధకూ అదే గతి పట్టింది. విద్యార్థుల మత్తు వదిలించే మార్గం చూపాలని ఏడు నెలలక్రితం తెలంగాణ హైకోర్టు విద్యాసంస్థలకు పిలుపిచ్చింది. ఇంజక్షన్ల ద్వారా మాదకద్రవ్యాలు తీసుకునే వ్యసనపరుల సంఖ్య ప్రాతిపదికన- యూపీ, పంజాబ్‌, దిల్లీ, ఏపీ, తెలంగాణ తొలి అయిదు స్థానాల్ని ఆక్రమించాయి. ఆ అప్రతిష్ఠను చెక్కుచెదరకుండా పరిరక్షించాలన్న పట్టుదలతోనే కావచ్చు- న్యాయస్థానాల అదేశాల స్ఫూర్తిని నీరుకార్చడంలో విద్యాసంస్థలు, నిఘా వ్యవస్థలు శాయశక్తులా పోటీపడుతున్నాయి!

మూడు ముఠాలు- ఆరు మూటలుగా..

పదిహేనేళ్ల కిందటితో పోలిస్తే ఇండియాలో హెరాయిన్‌, నల్లమందు తదితరాల వాడకం అయిదింతలు పెరిగిందని ప్రపంచ మాదకద్రవ్య నివేదిక వెల్లడిస్తోంది. కేంద్రప్రభుత్వమే నిర్వహించిన దేశవ్యాప్త అధ్యయనం ప్రకారం- 15శాతం పౌరులు లిక్కరుమత్తులో తూలుతుండగా, మరో ఏడెనిమిది శాతం వేర్వేరు మార్గాల్లో డ్రగ్స్‌ వినియోగానికి అలవాటుపడ్డారు. దేశ రాజధాని దిల్లీ మహానగరంలో 90శాతం వీధిబాలలు మత్తుపదార్థాల ఉచ్చులో చిక్కుకున్నవారేనని సర్కారీ గణాంకాలే చెబుతున్నాయి. ఒక్క ముంబయిలోనే అయిదు లక్షల మంది రోజుకు అధమపక్షం 500 కిలోల మత్తుపదార్థాలు వాడుతున్నట్లు అధ్యయనాలు ఘంటాపథంగా వెల్లడిస్తున్నాయి. మోతాదు మించిన డ్రగ్స్‌ వినియోగం కారణంగా దేశంలో ప్రతి 12 గంటలకొక మరణం సంభవిస్తున్నట్లు ఎన్‌సీఆర్‌బీ (జాతీయ నేరరికార్డుల బ్యూరో) మదింపు వేసింది. ఇంతగా పరిస్థితి దిగజారిందంటే, మాదకద్రవ్యాల సరఫరాలు యథేచ్ఛగా పెచ్చరిల్లుతున్నాయని వేరే చెప్పాలా? ఈ అంశాన్నే ప్రస్తావిస్తూ, అంతర్జాతీయ డ్రగ్స్‌ అంగడిగా భారత్‌ దిగజారిందా అని మూడు నెలలక్రితం కేంద్రప్రభుత్వాన్ని మద్రాస్‌ హైకోర్టు నిగ్గదీసింది. గంజాయినుంచి చరస్‌, కొకైన్‌ వరకు అన్నిరకాల మత్తుపదార్థాలకూ హైదరాబాద్‌ సహా వివిధ నగరాలు అడ్డాలుగా మారిపోయాక- యావత్‌ దేశ ప్రతిష్ఠే ఘోరంగా మసకబారుతోంది. ఎక్కడికక్కడ 'మూడు ముఠాలు- ఆరు మూటలు'గా పరిస్థితి దిగజారుతుండబట్టే... మాదకశక్తుల పట్ల నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) వంటివి చాణక్యుడిలా వ్యవహరించాలని కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ఇటీవల పిలుపిచ్చింది. కాలిలో దిగబడి బాధించిన కంటకాన్ని కసిగా కాల్చేసిన కౌటిల్యుడి తరహాలో డ్రగ్స్‌ మహమ్మారిని తుదకంటా నిర్మూలించాలన్నది హైకోర్టు పలికిన హితవాక్యం. వాస్తవంలో, ‘నిషాముక్త్‌ భారత్‌’ను కేంద్రం అభిలషిస్తున్నా... మాదకద్రవ్యాల ఉత్పత్తి, సరఫరాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగం ఏం చేస్తోంది? నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, పోలీసు విభాగాల మధ్య అర్థవంతమైన సమన్వయం ఎండమావి కావడం మత్తు మాఫియాకు అయాచిత వరమవుతోంది. ఎక్కడ ఎప్పుడు వందల కిలోల సరకుతోపాటు దిగువస్థాయి వ్యక్తులు దొరికిపోయినా, అసలు సూత్రధారుల అజాపజా ఎన్నడూ వెల్లడి కాకపోవడం- విచ్ఛిన్నశక్తులకు, వాటిని పరిమార్చాల్సిన వ్యవస్థలకు మధ్య లోపాయికారీ అవగాహనపై శంకలు రేకెత్తించడంలో తప్పేముంది?

మాదకద్రవ్యాల వినియోగం, ఉత్పత్తి, సరఫరా, నిల్వ, వ్యాపారం... వేటికి పాల్పడినా థాయ్‌లాండ్‌, వియత్నాం ప్రభృతదేశాల్లో మరణదండన విధిస్తున్నారు. కోట్ల మందిని జీవచ్ఛవాలుగా మార్చేస్తున్న కిరాతక సంతతిని ఉక్కుపాదంతో అణిచేసేలా సమగ్ర విధి విధానాల క్షాళనే ఇక్కడా మాదక మహమ్మారి పీడకు సరైన విరుగుడు. ఏమంటారు?

- బాలు

ఇదీ చూడండి: ఔషధం మాటున మాదకద్రవ్యం... హైదరాబాద్​ కేంద్రంగా వ్యాపారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.