అత్యవసర సందర్భాల్లో ఆసుపత్రుల్లో వినియోగించే మత్తు మందులు (సెడెటివ్స్) యువతకు ప్రాణాంతక వ్యసనాలుగా మారుతున్నాయి. వీటి విక్రయాలపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో బహిరంగ విపణిలో విచ్చలవిడిగా లభ్యమవుతూ దుర్వినియోగమవుతున్నాయి. ఔషధ నియంత్రణ శాఖ, ప్రైవేటు ఔషధ విక్రయశాలల బాధ్యతారహిత పోకడలతో ఈ మత్తు మందులకు యువకులు బానిసలవుతున్నారు. అంతిమంగా ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. మత్తుమందుల వినియోగంపై కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన సర్వేలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 18-75 సంవత్సరాల వయసు వారిలో 1.21శాతం మత్తు మందులకు అలవాటు పడినట్లు సర్వేలో గుర్తించారు. మత్తుమందులు అధికంగా దుర్వినియోగమవుతున్న రాష్ట్రాల్లో పంజాబ్ తొలిస్థానంలో ఉంది. అక్కడి జనాభాలో 4.61శాతం వీటికి బానిసలవగా, హరియాణాలో 3.05శాతం, దిల్లీలో 3.19శాతం వీటి బారినపడ్డారు.
కుటుంబాలు ఛిన్నాభిన్నం..
దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనే మత్తు మందుల వినియోగం అత్యధికంగా ఉంది. తమిళనాడు (0.32శాతం), కర్ణాటక (0.51శాతం), కేరళ (0.53శాతం)లతో పోలిస్తే- తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి పోనుపోను ఆందోళనకరంగా మారుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.1శాతం మత్తు మందులను వినియోగిస్తున్నట్లు సర్వేలో బయటపడింది. మద్యం వినియోగంలో దేశంలోనే ముందున్న ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఈ దుర్వ్యసనం కమ్ముకొంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో 6.74 లక్షల మంది (1.79శాతం), తెలంగాణలో 3.48 లక్షల మంది (1.31శాతం) వీటికి బానిసలయ్యారు. ఈ సంఖ్య క్రమేపీ పెరుగుతున్నదన్న అధ్యయన ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల దొంగతనం కేసుల్లో పోలీసులకు పట్టుబడుతున్న వారిలో ఇంజినీరింగ్ విద్యార్థులు, ఇతర ఉన్నత విద్యావంతులు ఎక్కువగా ఉంటున్నారు. వారి విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఆపరేషన్ థియేటర్లలో వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సిన మత్తు మందులను యువకులు యథేచ్ఛగా ఉపయోగిస్తున్నారు. వీటి కొనుగోలుకు అవసరమైన డబ్బు కోసం బైక్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లను చోరీ చేస్తున్నారు. ఈ మందుల వినియోగంతో ఉన్మత్తులవుతూ కుటుంబ సభ్యులపై దాడులు చేస్తున్న సంఘటనలూ చోటుచేసుకుంటున్నాయి.
పక్కదారి..
వైద్య అవసరాల కోసమే వాడాల్సిన మత్తు మందులను విచ్చలవిడిగా వినియోగిస్తే ప్రమాదకర పర్యవసానాలు తప్పవని వైద్యులు చెబుతున్నారు. మానసిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఎక్కువగా ఈ మందులు వినియోగిస్తారు. మానసిక రోగుల విపరీత ప్రవర్తనను అదుపు చేసేందుకు, వారిని పరిమితకాలం మత్తులో ఉంచేందుకు ఇవి ఉపయోగపడతాయి. వీటిని సాధారణ వ్యక్తులు వినియోగించడం కలవరపెడుతోందని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల అనుమతి లేనిదే వాడకూడని మందులను దుకాణాల్లో నేరుగా విక్రయిస్తుండటం యువత పాలిట శాపంగా మారుతోంది. ఈ మందులకు అలవాటు పడినవారు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రధానంగా ఒత్తిడి, కుంగుబాటు వంటి లక్షణాలతో బాధపడుతున్నవారు ఎక్కువగా ఈ మత్తు మందులకు అలవాటు పడుతున్నారు. వీటిని దీర్ఘకాలం తీసుకోవడం వల్ల విచక్షణ కోల్పోతారు. చిన్న విషయాలకే ఆవేశపడుతుంటారు.
మత్తు ఇంజక్షన్లు అతిగా తీసుకోవడం వల్ల పలు రకాల ఇన్‌ఫెక్షన్లకు గురవుతారు. ఈ దుర్వ్యసన ఊబిలో చిక్కినవారు డబ్బుల కోసం నేరాలకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇటువంటి వారిని తిరిగి మామూలు మనుషులుగా మార్చేందుకు మానసిక వైద్యశాలల్లో ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కొన్ని ఎన్జీఓలు సైతం ఈ పని చేస్తున్నాయి.
మత్తు మందులకు బానిసలైన వారిలో ఆత్మహత్యలకు పాల్పడే ధోరణి అధికంగా ఉంటుందని, జ్ఞాపకశక్తిని కోల్పోవడం వంటి వాటికి గురవుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో ఇటువంటి మందుల వినియోగంపై ఔషధ నియంత్రణ విభాగం పటిష్ఠ పర్యవేక్షణ ఉంటుంది. మన దేశంలో ఔషధ నియంత్రణ శాఖ పర్యవేక్షణ ఉన్నా- క్షేత్ర స్థాయిలో ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందుల విక్రయాలు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టడంపై అధికార యంత్రాంగం సత్వరం దృష్టిసారించాలి. మానసిక సమస్యలతో ఇబ్బందిపడే వారు ప్రాథమిక దశలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందితే సత్ఫలితాలు వస్తాయి. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల ప్రవర్తనను ఒక కంట కనిపెడుతూ ఉంటేనే ఈ దుర్వ్యసనాలను మొగ్గదశలోనే తుంచివేయవచ్చు.
- నాదెళ్ల తిరుపతయ్య
ఇవీ చదవండి: