ఇరవై నాలుగ్గంటలూ భర్తలు ఇంట్లోనే ఉంటే భరించడం భార్యలకు సాధ్యం కాదని కొందరి విషయంలో కరోనా నిరూపిస్తోంది. మహమ్మారి కాలంలో గృహహింస, విడాకుల కేసులు వేగంగా పెరుగుతున్న తీరే ఇందుకు నిదర్శనం. లాక్‌డౌన్ ఆరునెలలపాటు కొనసాగితే ప్రపంచం మొత్తం మీద 3.1 కోట్లకుపైగా గృహహింస కేసులు నమోదవుతాయన్నది ఐక్యరాజ్య సమితి అంచనా. సంక్షోభంలో ముదురుతున్న మరో సంక్షోభమిది. దీనిపై తప్పకుండా దృష్టి సారించాలని 'యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్' హెచ్చరిస్తోంది.
కరోనా ప్రభావం సంవత్సరం ఉంటే ఆరు కోట్లపైగా కేసులు నమోదవుతాయని చెబుతోంది యూఎన్పీఎఫ్. ప్రతి మూడు నెలలకు ఒకటిన్నర కోట్ల చొప్పున కేసులు పెచ్చరిల్లుతాయని నివేదికలు స్పష్టీకరిస్తున్నాయి. నిజానికి ఈ ఉత్పాతంలో కరోనా పాత్ర ఏమీ లేకపోయినప్పటికీ అప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న చిన్నాపెద్ద విభేదాలు, నిరాశా నిస్పృహలు ఒక్కసారిగా బయటపడి హింసకు, విడాకులకు దారితీయడానికి తక్షణ కారణంగా మారింది.
కరోనాకు ముందు వాణిజ్య రాజధాని ముంబయిలో నెలకు 1,280 విడాకుల కేసులు నమోదయ్యేవి. లాక్‌డౌన్ సమయంలో అది మూడింతలై 3,480కి చేరింది. కొవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న ముంబయిలోనే ఇలాంటి సామాజిక సంక్షోభం తలెత్తడం గుర్తించాల్సిన అంశం. తరవాతి స్థానంలో దేశ రాజధాని దిల్లీ ఉంది. బయటకు వస్తున్నవి కొన్ని మాత్రమే రానివి ఎన్నో రెట్లు ఉండవచ్చని అంచనా.
ఒత్తిళ్ల పర్యవసానం
'ఇంట్లో ఉండండి... భద్రంగా ఉండండి' అంటూ అందరూ నినదిస్తున్నారు. కానీ ఆడవారికి అత్యంత ప్రమాదకర ప్రదేశంగా ఇల్లు మారిపోయిందన్నది నిష్ఠుర సత్యమవుతోంది. మానవత్వానికి మచ్చలుగా మిగిలిపోయిన కొందరు మగవాళ్లు మానసిక, శారీకర, లైంగిక తీవ్రవాదాలకు పాల్పడుతున్నారు.
ఇంటి నుంచి పని, ఆర్థిక ఒత్తిళ్లు, ఉద్యోగాలు కోల్పోవడం వంటి పరిణామాలు పురుషులపై ప్రభావాన్ని చూపడం వల్ల హింసోన్మాదం ప్రబలుతోందని చెబుతున్న సాకులు ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఇళ్లలో ఇబ్బందులు పడుతున్న ఆడవారి పరిస్థితి గమనిస్తే ఎవరైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. మొగుడు ఎప్పుడెలా ప్రవర్తిసాడో తెలియక సతమతమైపోతున్నారు.
చట్టాల మాటేంటి?
రకరకాల ఆరోపణలతో అత్తల దాడులు, ఆడపడుచుల ఆగడాలు, మామల వేధింపులు, మూడింతలు పెరిగిన ఇంటిపనులు... ఇవన్నీ చూస్తుంటే ఓ మహిళ స్వేచ్ఛ ఎంత అరాచకంగా అణచివేతకు గురవుతోందో అర్థమవుతుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లనీయరు. ఎవరికీ చెప్పుకోలేరు. సహాయకేంద్రాలను సంప్రతించే వీలు లేదు. అసలు కాలు కదపడానికి స్వాతంత్య్రమే లేదు. మహిళలపై జరిగే 22 రకాల నేరాలకు సంబంధించి ఈ ఏప్రిల్, మే నెలల్లో జాతీయ మహిళా కమిషన్‌కు 3,027 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 47.2 శాతం గృహహింసకు పాల్పడినవే ఉన్నాయి.
2006 అక్టోబరులో అమలులోకి వచ్చిన గృహహింస నిరోధక చట్టం(2005) అనుకున్న ఫలితాలను సాధించిన దాఖలాలు లేవు. జాతీయ నేరగణాంకాల సంస్థ (2018) నివేదిక ప్రకారం మహిళలకు వ్యతిరేకంగా పాల్పడుతున్న నేరాల్లో 31.8 శాతం భర్త, అతడి బంధువుల క్రూరత్వానికి సంబంధించినవే ఉన్నాయి. అంటే దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరు గృహహింసకు గురవుతున్నారు.
అంతటా అదే పరిస్థితి..
ప్రపంచవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గణాంకాల ప్రకారం 35 శాతం ఆడవారు భర్తల అకృత్యాలకు బలవుతున్నారు. జనతా కర్ఫ్యూ విధించిన మార్చి 22కి 25 రోజుల ముందు నుంచి జాతీయ మహిళా కమిషన్‌కు గృహహింసకు సంబంధించి అందిన ఫిర్యాదులు 123. అదే మార్చి 23 తరవాత 25 రోజుల్లో 239 ఫిర్యాదులు వచ్చాయి. అంటే దాదాపు 95 శాతం మేర కేసులు పెరిగాయి. అదే సమయంలో పోలీస్, ఎన్‌జీఓ హెల్ప్‌లైన్లకు వచ్చే ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దిల్లీ కమిషన్ ఆఫ్ ఉమెన్ (డీసీడబ్ల్యూ)కి మార్చి 12-25 మధ్య 808 ఫిర్యాదులు వస్తే, ఏప్రిల్ 7-20 మధ్య కేవలం 337 ఫిర్యాదులు అందాయి.
తీరుమారాలి...
ఇప్పటికీ చాలామంది భారత నారీమణులు భర్తలో మార్పు తీసుకురావాలని భగవంతుడికి అదేపనిగా విన్నపాలు చేస్తూనే ఉన్నారు తప్ప ఇతర మార్గాలను అన్వేషించడం లేదు. పిల్లలు పెరిగిన కొద్దీ కట్టుకున్నవాడి కర్కశత్వంలో మార్పు వస్తుందని సముద్రమంత ఆశతో ఎదురు చూస్తున్నారు. సనాతన కాలం నుంచీ సర్దుకుపోమని చెప్పే పుట్టింటివాళ్లూ ఇంకా మారలేదు. ఇక హింసకు అడ్డుకట్ట ఎలా పడుతుంది? సంసృతీ సంప్రదాయాల నిరంకుశత్వం, ఆర్థికంగా ఆధారపడాల్సిన దుస్థితి ఆడవారిని హింసకు అలవాటుపడేలా చేస్తున్నాయి.
అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయుల్లోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, పౌరసమాజం వెంటనే స్పందించాలి. నియమిత కాలవ్యవధుల్లో ఇళ్లకు వెళ్లి వ్యక్తిగతంగా మహిళలను కలిసి విచారించాలి. గృహహింస నిరోధాన్ని అత్యవసర సేవగా గుర్తించాలి. కరోనా మహమ్మారిని మించిన మహమ్మారి కాపురాలను కూల్చేయకుండా కాపాడాలి!
(రచయిత- ఎమ్మెస్)