ప్రతిపక్షాలు, రైతుసంఘాల నిరసనలను బేఖాతరు చేసి కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చిన కేంద్రం- నెలరోజుల్లోనే ఉల్లిగడ్డల కోసం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. నిత్యావసర సరకుల నిల్వలపై ఆంక్షలు పూర్తిగా తొలగిస్తూ కొత్త చట్టాన్ని 2020 సెప్టెంబరు ఆఖరివారంలో పార్లమెంటు ఆమోదించింది. సరిగ్గా నెలరోజుల్లోపలే ఆ చట్టాన్ని పక్కనపెట్టి దానికి ముందున్న తీరుగానే ఉల్లిగడ్డల నిల్వలపై మళ్లీ ఆంక్షలు పెడుతూ కేంద్రం ఆదేశాలిచ్చింది. దేశంలో ఆహారోత్పత్తుల ధరల్లో అస్థిరతకు ఉల్లి, వంటనూనెలు తాజా ఉదాహరణ. మనదేశంలోకి గత ఆరునెలల్లో రికార్డుస్థాయిలో పొద్దుతిరుగుడు, సోయా వంటనూనెలను దిగుమతి చేసుకున్నారు. ఇప్పుడు ఉల్లి దిగుమతులకు కేంద్రం పచ్చజెండా ఊపడం విశేషం. ఉల్లిగడ్డ ఎగుమతులను నిషేధించడం, అనుమతించడం ఏటా ప్రహసనంలా మారింది. ఆరు నెలల క్రితం కేంద్రం భద్రపరచిన లక్ష టన్నుల ఉల్లిగడ్డల్లో 25 వేల టన్నులు, గతేడాది మరో 30 వేల టన్నులు గోదాముల్లో కుళ్లిపోవడంతో విలువైన ప్రజాధనం వృథా అయింది.
కరవైన ముందుచూపు
ప్రజల నిత్యావసర ఆహారోత్పత్తుల విషయంలో ప్రణాళికాబద్ధమైన చర్యలు కరవయ్యాయి. రెండు దశాబ్దాల క్రితం ఉల్లిధరల పెరుగుదల వల్ల వాజ్‌పేయీ పాలనలో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని చవిచూసింది. ఆ తరవాత మరో రెండు దశాబ్దాలు పాలించిన యూపీఏ హయాములోనూ ఉల్లి, వంటనూనెల ధరల మంట, దిగుమతులు కొనసాగాయి. ఇప్పుడు తిరిగి ఎన్డీఏ పాలనలోనూ అదే తంతు సాగుతోంది. గతేడాది ఉల్లి ధర కిలోకు కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో రూ.100 నుంచి 200కు చేరింది. ఈ పెరుగుదల వల్ల మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్బందులొస్తాయని కేంద్రం ఎగుమతులను ముందు జాగ్రత్తగా 2019 సెప్టెంబరు 29న నిలిపివేసింది.
బంగ్లాదేశ్ ముందు జాగ్రత్త
గతేడాది భారత్ నుంచి ఉల్లి ఎగుమతులను హఠాత్తుగా నిషేధించడంతో పక్కనున్న బంగ్లాదేశ్‌లో దాని ధరలు ఆకాశాన్నంటాయి. తిరిగి మార్చి నుంచి ఎగుమతులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్, మే, జూన్)లో మనదేశం నుంచి 6.80 లక్షల టన్నుల ఉల్లిగడ్డలను విదేశాలకు ఎగుమతి చేయగా, బంగ్లాదేశ్ కొన్నవే 1.90 లక్షల టన్నులు. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది బంగ్లాదేశ్ 147.50 శాతం అధికంగా దిగుమతి చేసుకుంది. బంగ్లాదేశ్ అధిక దిగుమతి వెనక 'ముందు జాగ్రత్త' దాగి ఉంది. గతేడాది హఠాత్తుగా ఉల్లి ఎగుమతులను భారత్ నిషేధించడంతో బంగ్లాదేశ్‌లో ధరలు భగ్గుమని ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆ దేశ ప్రధాని హసీనా 2019 అక్టోబరులో భారత పర్యటనకు వచ్చినప్పుడు వాపోయారు. ఈ ఏడాది కూడా భారత ప్రభుత్వం ఇలాగే సెప్టెంబరు నాటికి ఉల్లి ఎగుమతులను నిషేధిస్తుందని ముందుగానే ఊహించిన బంగ్లాదేశ్ వ్యాపారులు ముందు జాగ్రత్తగా గత ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 147 శాతం అధికంగా కొనేసి దిగుమతి చేసుకుని ముందస్తు నిల్వలు పెట్టేసుకున్నారు.
విదేశాల నుంచి దిగుమతి
లాక్‌డౌన్‌లో నిశ్చింతగా ఉన్న భారత ప్రభుత్వం 2020 సెప్టెంబరు 15 నాటికి కళ్లు తెరిచి బంగ్లాదేశ్ ముందుగా ఊహించినట్లుగానే ఎగుమతులు నిషేధించింది. కానీ అప్పటికే మనదేశంలో అధిక వర్షాలు, వరదలతో ఉల్లిపంట దెబ్బతినడం, భారీగా ఎగుమతులతో ఇక్కడ కొరత ఏర్పడి కిలో ధర ఇటీవల రూ.100 దాటింది. ఇప్పుడిక చేసేదిలేక తీరిగ్గా అఫ్గానిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ వంటి చిన్నదేశాల నుంచి కిలో రూ.40కి పైగా వెచ్చించి దిగుమతి చేసుకోవడానికి కేంద్రం తాజాగా అనుమతించింది. మూడు నెలల క్రితం ఇందులో సగం ధర కూడా రాక భారతదేశంలో ఉల్లి పంట పండించిన రైతులు నష్టపోయారు. రాయలసీమ రైతులు గిట్టుబాటు ధర లేదని, కోత ఖర్చు కూడా రావడం లేదని ఉల్లిని కోయకుండానే దున్నేశారు. గతేడాది దేశంలో 2.44 కోట్ల టన్నుల ఉల్లిపంట పండినా ఇప్పుడు కొరత ఏర్పడి ధరలు మండిపోతున్నాయి.
సదుపాయాలు అవసరం
ప్రజల నిత్యావసరాల్ని సరైన ధరకు అందించి ఆహారభద్రత కల్పించలేని ఏ దేశమూ ఆర్థికాభివృద్ధి సాధించలేదు. కొన్ని పంటల దిగుబడుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నా ప్రజలకు సరైన ధరలకు ఇవ్వడంలో, ఎగుమతుల్లో వెలాతెలాపోతోంది. ఆహారోత్పత్తుల ధరలను స్థిరీకరించాలంటే శుద్ధి, నిల్వ సదుపాయాలు అత్యంత ఆవశ్యకం. అవి లేని దేశాల్లోనే ధరలు మండిపోతున్నాయి. వ్యవసాయ, ఆహారోత్పత్తుల ఎగుమతులు పెంచడానికి 2018లో ఎనిమిది రకాల పంటలకు విడివిడిగా ‘ఎగుమతి ప్రోత్సాహక వేదిక’(ఈపీఎఫ్)లను కేంద్ర వ్యవసాయశాఖ ఏర్పాటుచేసింది. ఈ పంటలు- ఉల్లిగడ్డ, ద్రాక్ష, మామిడి, అరటి, బియ్యం, పోషక తృణధాన్యాలు, దానిమ్మ, పూలు. ఈ వేదికల్లోని నిపుణులు రెండు నెలలకోమారు సమావేశమై దేశంలో ఆయా పంటల దిగుబడి, సాగు, ఎగుమతికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించి గట్టి చర్యలు తీసుకోవాలి.
అలా చేస్తేనే..
కానీ రెండేళ్లుగా ఉల్లిగడ్డల ఎగుమతులు పెంచడం వదిలేసి నిషేధించాల్సిన దుస్థితి ఏర్పడిందంటే- ఈ వేదికలేం చేస్తున్నట్లు? కోత తరవాత పంట వినియోగదారులకు చేరేలోగా 30 శాతం పాడవుతోంది. ఈ పరిస్థితిని నివారించినా ధరలు తగ్గి ప్రజలకు మేలు జరుగుతుంది. దేశంలో ఏ భూముల్లో ఏ పంట ఎంత విస్తీర్ణంలో ఎంత సాగుచేయించాలనే ప్రణాళికను రాష్ట్రాలవారీగా ఏడాది ముందే సిద్ధం చేయాలి. పంట పండే ప్రాంతంలోనే శుద్ధి, నిల్వ, ఎగుమతులకు సదుపాయాలు కల్పించాలని కేంద్రం అయిదేళ్లుగా అన్ని రాష్ట్రాలకు చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉల్లితో పాటు పలురకాల నూనెగింజల పంటలు బాగా పండే భూములున్నందువల్ల వాటికి ఈ- క్లస్టర్లు ఏర్పాటుచేసి రైతులను ప్రోత్సహించాలి. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు తెచ్చి తెలుగు రాష్ట్రాల్లో అమ్ముతున్నందువల్ల రవాణా వ్యయం జతపడి ధరలు మండిపోతున్నాయి. కూరగాయల పంటలకూ ఇలాగే క్లస్టర్లు ఏర్పాటుచేస్తే తక్కువ ధరలకే ఇక్కడి ప్రజలకు లభించడమే కాకుండా ఎగుమతుల ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశమూ ఉంది.
ప్రహసనంగా నిర్వహణ
భారతదేశంలో ఆహారోత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల ప్రహసనాన్ని చూసి బంగ్లాదేశ్, మలేసియా, ఉక్రెయిన్ వంటి చిన్న దేశాలు సైతం జాగ్రత్త పడుతున్నాయి. ఇక్కడ వంటనూనెల కొరతను సాకుగా చేసుకుని పామాయిల్, పొద్దుతిరుగుడు నూనెల ధరలు పెంచుతూ మలేసియా, ఉక్రెయిన్ వంటి దేశాలు భారత ప్రజల జేబులు కొల్లగొడుతున్నాయి. పొద్దుతిరుగుడు నూనె టన్ను ధర ఏడాది వ్యవధిలో రూ.55,575 నుంచి రూ.75,578కు పెరిగింది. 2019 నవంబరు-2020 సెప్టెంబరు వరకు 11 నెలల్లో 31.06 లక్షల టన్నుల సోయానూనె, మరో 23.48 లక్షల టన్నుల పొద్దుతిరుగుడు వంటనూనె మనదేశంలోకి దిగుమతయ్యాయి. గతేడాది ఇదే 11 నెలలతో పోలిస్తే ఈ నూనెల దిగుమతులే 5.50 లక్షల టన్నులు అదనంగా పెరిగాయి. వంటనూనెల దిగుమతులకు రూ.70 వేల కోట్లు మనదేశం ఏటా ధారపోయాల్సి వస్తోంది. సోయాచిక్కుడు, పొద్దుతిరుగుడు పంటలకు సైతం సరైన ధర ఇవ్వకుండా విదేశాల నుంచి ఆ నూనెలను భారీగా సొమ్ము వెచ్చించి కొంటున్నాం.
- మంగమూరి శ్రీనివాస్, రచయిత
ఇదీ చదవండి: ఉల్లి ధరల పెరుగుదలతో ఎవరికి లాభం?